నేడు రాష్ట్రానికి బీజేపీ చీఫ్ నడ్డా

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు తెలియజేసేందుకు బీజేపీ " ఆరు హామీలు.. 66 అబద్దాలు" పేరుతో భారీ బహిరంగ సభను నిర్వహించనున్నది. శనివారం సాయంత్రం 5 గంటలకు సరూర్ నగర్​స్టేడియంలో  సభ ప్రారంభం కానున్నది. దీనికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా చీఫ్ గెస్టుగా హాజరుకానున్నారు. ఆయనతో పాటు బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, కేంద్రమంత్రి బండి సజయ్, బీజేపీ వైస్ ప్రెసిడెంట్ డీకే అరుణ, బీజేఎల్​పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ఓబీసీ మోర్చా అధ్యక్షుడు లక్ష్మణ్ తదితరులు పాల్గొననున్నారు.

శనివారంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సరిగ్గా ఏడాది పూర్తవుతున్న నేపథ్యంలో సర్కారు వైఫల్యాలపై బీజేపీ కౌంటర్ సభను నిర్వహిస్తోంది. సభ ఏర్పాట్లను ఎంపీ ఈటల రాజేందర్ శుక్రవారం పరిశీలించారు. ఎన్నికలప్పుడు కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై బీజేపీ ఇంటింటి సర్వే నిర్వహించిందని..రేవంత్ పాలన వైఫల్యాలను, దుర్మార్గాలను  సరూర్ నగర్ స్టేడియంలో వివరిస్తామని ఈటల పేర్కొన్నారు.