- బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలుడీకే అరుణ
గద్వాల, వెలుగు : లిక్కర్ ఆదాయంతో సర్కార్ పథకాలు అమలు చేయడం సిగ్గు చేటని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. ఊరుకో బెల్ట్ షాప్ పెట్టి పేద ప్రజల రక్తాన్ని జలగల్లా పీల్చి వాటి ద్వారా వచ్చే ఆదాయంతో సీఎం కేసీఆర్ పథకాలు అమలు చేస్తున్నాడని విమర్శించారు. ఆదివారం నడిగడ్డ ఇలవేల్పు జమ్ములమ్మ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మండలంలో ఇంటింటికీ బీజేపీ కార్యక్రమంలో భాగంగా పరమాల, కురువపల్లె, సంగాల, కాకులారం, గోనుపాడు తదితర గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ లిక్కర్ అమ్మకాలతో ఖజానాకు రూ.40 వేల కోట్ల ఆదాయం వస్తుందన్నారు. రాష్ట్రంలో కేసీఆర్ జేబు నుంచి ఇచ్చిన డబ్బులతో పథకాలు అమలు కావడం లేదని, ప్రజలు కట్టిన పన్నులతో నడుపుతున్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలన్నారు. రాష్ట్రంలో ఏ ప్రభుత్వం వచ్చినా, ఏ పథకం కూడా నిలిచిపోదన్నారు. రాష్ట్రంలో పేద ప్రజల జీవన స్థితిగతులు మారలేదని, కేవలం కేసీఆర్ ఫ్యామిలీ మాత్రమే పచ్చబడిందన్నారు.
ఓట్ల కోసం జూటా మాటలు చెప్పిన సీఎం కేసీఆర్ ను వచ్చే ఎన్నికల్లో తరిమి కొట్టాలన్నారు. నడిగడ్డపై వివక్ష చూయిస్తున్నారని, సీఎం కేసీఆర్, బిడ్డ, అల్లుడు, కొడుకు ఉన్న చోటనే అభివృద్ధి చేయడమే ఇందుకు నిదర్శనమన్నారు. ఓట్ల కోసం డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, పెన్షన్లు ఇస్తామని చెప్పి, ఇప్పటివరకు ఇవ్వలేదని మండిపడ్డారు. నడిగడ్డలో రోడ్లన్నీ గుంతలమయమైనా మొరం కూడా వేయలేని పరిస్థితి ఉందన్నారు. రాష్ట్రంలో బీజేపీ సర్కార్ రావడం ఖాయమని, వచ్చే ఎన్నికల్లో ఆశీర్వదించాలని కోరారు. గడ్డం కృష్ణారెడ్డి, రామాంజనేయులు, వెంకటేశ్వర్ రెడ్డి, బండల వెంకట్రాములు, రజక జయశ్రీ, శ్రీనివాస్ గౌడ్, కృష్ణమూర్తి, తిరుపతి, సంజీవ్ భరద్వాజ్ నరేందర్ రెడ్డి పాల్గొన్నారు.