భారతదేశ కీర్తిని పెంచే శక్తి బీజేపీకే ఉంది : డీకే అరుణ 

నల్గొండ జిల్లా : మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా టీఆర్ఎస్ పార్టీకి ఓటమి భయం పట్టుకుందని, అందుకే వందమంది ఇన్ చార్జ్ లను నియమించిందని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేశామని చెబుతున్నప్పుడు టీఆర్ఎస్ కు ఓటమి భయం ఎందుకని ప్రశ్నించారు. సొంత పార్టీ నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రిని కలవలేని పరిస్థితి రాష్ట్రంలో ఉందన్నారు. రాష్ట్ర ప్రజల ఆశ, ఆకాంక్షలను మునుగోడు ప్రజలు నెరవేరుస్తారనే నమ్మకం తమకు ఉందన్నారు. మునుగోడు నియోజకవర్గంలోని చండూర్ మండలం కొండాపురం, నేర్మాట గ్రామాల్లో డీకే అరుణ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. 

మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా నియోజకవర్గంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రజలకు మటన్, చికెన్ పంచుతున్నారంటూ డీకే అరుణ ఆగ్రహం వ్యక్తం చేశారు. మునుగోడులో 57 ఏళ్లు పైబడిన వారికి పింఛన్లు ఇవ్వలేదన్నారు. చాలా గ్రామాల్లోనూ ‘మిషన్ భగీరథ’ నీళ్లు రావడం లేదన్నారు. పాలమూరు, రంగారెడ్డిని దత్తత తీసుకుని ప్రతి ఎకరానికి నీరు ఇస్తానని హామీ ఇచ్చి ఎందుకు ఇవ్వలేదని కేసీఆర్ ను ప్రశ్నించారు. ‘రైతుబంధు, దళితబంధు, గిరిజనబంధు పేర్లు చెప్పి మిగతా సంక్షేమ పథకాలను నిలిపివేశారు. ఇక ఎక్కడుంది బంగారు తెలంగాణ’ అని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో విశ్వాసాన్ని కల్పించలేకపోయిందని చెప్పారు. భారతదేశ కీర్తిని పెంచే శక్తి బీజేపీ పార్టీకి మాత్రమే ఉందన్నారు. అవినీతి నాయకులకు బీజేపీ పార్టీ మీటర్లు పెడుతుంది గానీ, రైతులకు మాత్రం పెట్టదన్నారు.