ఓటమి భయంతోనే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై టీఆర్ఎస్ అబద్దపు ప్రచారాలు చేస్తోందని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ మండిపడ్డారు. రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కేసీఆర్ మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ కుటుంబాన్ని అంతం చేయడానికే రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేశారని చెప్పారు. టీఆర్ఎస్ పార్టీ విలువలు లేని రాజకీయాలు చేస్తోందన్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతోనే మునుగోడు నియోజకవర్గానికి నిధులు వస్తున్నాయని చెప్పారు. నియోజకవర్గం అభివృద్ధి కోసమే రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేశారని, ఆయన రాజీనామాతోనే ‘గట్టుప్పల్’ ను కేసీఆర్ మండలంగా ప్రకటించారని చెప్పారు. ఉప ఎన్నికలో ఓడిపోతామనే అభద్రతా భావంతో టీఆర్ఎస్ నాయకులందరూ మునుగోడు నియోజకవర్గంలో వాలిపోయారని మండిపడ్డారు. టీఆర్ఎస్ పరిపాలనలో ప్రచారం తప్ప ఏమీ లేదన్నారు. మునుగోడు తీర్పే తెలంగాణకు కీలక మలుపు అని చెప్పారు. మునుగోడు నియోజకవర్గంలోని చౌటుప్పల్ మండలంలో నిర్వహించిన ఎన్నిక ప్రచారంలో కోమటిరెడ్డి లక్ష్మీతో కలిసి డీకే అరుణ పాల్గొన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీలోనే ఎందుకు మకాం వేశారని డీకే అరుణ అన్నారు. ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడీ)కి భయపడం అని చెప్పేవాళ్లకు ఎందుకు భయం పట్టుకుందని ప్రశ్నించారు. తమ కూతురు, ఎమ్మెల్సీ కవితను తీసుకుని ఢిల్లీకి వెళ్లి ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. వివిధ సంక్షేమ పథకాల పేరుతో లక్షల కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. ‘ధరణి’ పేరుతో పెద్ద ఎత్తున భూ కుంభకోణం జరిగిందని చెప్పారు. కేసీఆర్ అవినీతి ఎప్పుడో ఒక్కసారి తప్పనిసరిగా బయటపడుతుందన్నారు. మునుగోడు నియోజకవర్గాన్ని దత్తత తీసుకుంటానని చెప్పి మంత్రి కేటీఆర్ మరోసారి మోసం చేసేందుకు కుట్ర చేస్తున్నారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో, రాష్ట్రంలో ప్రతిపక్ష పాత్ర పోషించడం లేదన్నారు.