గద్వాల, వెలుగు: స్వార్థ రాజకీయాల కోసం బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ప్రజలను మభ్యపెడుతున్నాయని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ పేర్కొన్నారు. సోమవారం మల్దకల్ మండలం ఎద్దులగూడెం గ్రామానికి చెందిన పలువురు బీఆర్ఎస్ లీడర్లు, కార్యకర్తలు బీజేపీలో చేరారు. వారికి పార్టీ కండువా కప్పి బీజేపీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆమె ఎన్నికల్లో గెలిచేందుకు బీఆర్ఎస్, కాంగ్రెస్ పోటీలు పడి హామీలు ఇచ్చి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేందుకు యత్నిస్తున్నాయని మండిపడ్డారు. ఇప్పటికే రాష్ట్రంలో, గద్వాల జిల్లాలో రోడ్లు అధ్వానంగా మారిపోయాయని పేర్కొన్నారు. గతంలో ఇచ్చిన హామీలకే దిక్కు లేదని, కేజీ టు పీజీ విద్య అడ్రస్ లేకుండా పోయిందని, ఉద్యోగాలు ఇవ్వలేదని ఇలా అన్నివర్గాల ప్రజలను నిండా ముంచి ఇప్పుడు మళ్లీ హామీలు ఇవ్వడం సిగ్గుచేటన్నారు.
దేశం, రాష్ట్రం బాగుండాలంటే బీజేపీ సర్కార్ రావాలని చెప్పారు. రాష్ట్రంలో యువత బీజేపీ వైపు చూస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో బీజేపీ గెలుపు ఖాయమన్నారు. అసెంబ్లీ కన్వీనర్ రామాంజనేయులు, ఆనంద్, లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.