డబ్బులు తీసుకున్న దళారులపై కేసులు పెట్టాలి

డబ్బులు తీసుకున్న దళారులపై కేసులు పెట్టాలి

గోదావరిఖని, వెలుగు: రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ (ఆర్‌‌‌‌ఎఫ్‌‌‌‌సీఎల్‌‌‌‌)లో ఉద్యోగాలు పెట్టిస్తామని డబ్బులు వసూలు చేసిన దళారులను అరెస్ట్‌‌‌‌ చేయాలని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎంపీ జి.వివేక్‌‌‌‌ వెంకటస్వామి డిమాండ్‌‌‌‌ చేశారు. నిరుద్యోగుల నుంచి రూ.45 కోట్లు దండుకున్న ఈ కుంభకోణంపై సీబీఐ ఎంక్వైరీ చేయాలన్నారు. శుక్రవారం రామగుండంలోని తన నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘ఆర్‌‌‌‌ఎఫ్‌‌‌‌సీఎల్​ను రీఓపెన్‌‌‌‌ చేయించడానికి నాన్న కాకా వెంకటస్వామి, నేను పార్లమెంట్‌‌‌‌లో చాలా సార్లు మాట్లాడాం. అప్పటి ప్రధాని మన్మోహన్‌‌‌‌ సింగ్‌‌‌‌, ప్రణబ్‌‌‌‌ ముఖర్జీని కలిసి రూ.10 వేల కోట్ల అప్పును మాఫీ చేయించి కంపెనీని బీఐఎఫ్‌‌‌‌ఆర్‌‌‌‌ జాబితా నుంచి బయటకు తీసుకువచ్చాం’’ అని గుర్తుచేశారు. ఈ ప్రాంత ప్రజలకు మేలు జరుగుతుందని ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీ ప్రత్యేక చొరవ తీసుకుని రూ.7 వేల కోట్ల ఖర్చుతో ఆర్‌‌‌‌ఎఫ్‌‌‌‌సీఎల్‌‌‌‌ను రీ ఓపెన్​ చేశారని వివరించారు.

బాధితులకు న్యాయం చేయాలె

ప్లాంట్‌‌‌‌ ప్రారంభించిన తర్వాత కాంట్రాక్టు ఉద్యోగ నియామకాల్లో అవకతవకలు జరిగాయని వివేక్ ఆరోపించారు. స్థానికులకు ఉద్యోగాలివ్వడం లేదని, డబ్బులు వసూలు చేస్తూన్నారని.. ఈ వ్యవహారంపై విజిలెన్స్‌‌‌‌ ఎంక్వైరీ చేయించాలని గతంలో కేంద్ర ఎరువుల మంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. త్వరలో మరోసారి కేంద్ర మంత్రిని కలిసి జాబ్స్​పేరుతో డబ్బు వసూలు స్కాంపై సీబీఐ ఎంక్వైరీ చేయించాల్సిందిగా కోరతానన్నారు. ఆర్‌‌‌‌ఎఫ్‌‌‌‌సీఎల్‌‌‌‌లో పనిచేసే ఆఫీసర్లు, అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు, లీడర్లు కుమ్మక్కై ఉద్యోగాల పేరుతో నిరుద్యోగుల నుంచి లక్షలు దండుకొని మోసం చేశారన్నారు. దళారులకు డబ్బులు ఇచ్చిన వారు తిరిగి డబ్బులు పొందడానికి ఆత్మహత్యలకు పూనుకుంటున్నారని చెప్పారు. దళారులను అరెస్ట్‌‌‌‌ చేసి బాధితులకు వడ్డీతో సహా డబ్బులు చెల్లించేలా న్యాయం చేయాలన్నారు.

ప్రతి స్కాంలో కేసీఆర్‌‌‌‌ కుటుంబం

కాళేశ్వరం స్కాం.. మిషన్ భగీరథ స్కాం.. తాడిచెర్ల మైన్ స్కాం.. లిక్కర్ స్కాం ఇలా కేసీఆర్, ఆయన కుటుంబం స్కాంలు చేస్తూ రాష్ట్ర సంపద దోచుకుంటోందని వివేక్ ఆరోపించారు. తన కూతురు కవిత చేసిన లిక్కర్ స్కాం ప్రజలకు తెలియకుండా ఉండేందుకే బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రను కేసీఆర్ అడ్డుకున్నారని తెలిపారు. మునుగోడు ప్రజలు బీజేపీ వైపే ఉన్నారని చెప్పారు.  తెలంగాణ ఉద్యమ సమయంలో ఎన్ని ధర్నాలు, నిరసనలు చేసినా సాధారణ కేసులు పెట్టారని, కానీ ఇప్పుడు మాత్రం నిరసన తెలిపిన బీజేపీ వాళ్లను టార్గెట్‌‌‌‌ చేసుకుని హత్యాయత్నం కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశంలో బీజేపీ లీడర్లు కౌశిక హరి, పి.మల్లికార్జున్, కౌశిక లత, దుబాసి మల్లేశ్, రాచకొండ కోటేశ్వర్లు, సాదుల రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

లాఠీ చార్జ్​ చేసినోళ్లను సస్పెండ్‌‌‌‌ చేయాలి​

వారసత్వ ఉద్యోగాలు, ప్రమోషన్లపై శాంతియుతంగా ఆందోళన చేస్తున్న కాంట్రాక్ట్​ కార్మికులు, జేఏసీ లీడర్లపై లాఠీచార్జి చేసిన సీఐఎస్‌‌‌‌ఎఫ్‌‌‌‌ పోలీసులు, ఇందుకు ఆదేశాలిచ్చిన ఎన్టీపీసీ ఆఫీసర్లను సస్పెండ్‌‌‌‌ చేయాలని వివేక్‌‌‌‌ అన్నారు. రామగుండం ఎన్టీపీసీ లేబర్‌‌‌‌ గేట్‌‌‌‌ వద్ద ఇటీవల సీఐఎస్‌‌‌‌ఎఫ్ పోలీసులు జరిపిన లాఠీచార్జిలో గాయపడిన వారిని వివేక్​ పరామర్శించారు. తర్వాత జరిగిన గేట్‌‌‌‌ మీటింగ్‌‌‌‌లో మాట్లాడారు. సమస్యలు పరిష్కరించాలని కోరిన కార్మికులతో చర్చించాల్సిన ఆఫీసర్లు.. లాఠీచార్జి జరిపించడం సరికాదన్నారు. ఎన్టీపీసీ ప్లాంట్‌‌‌‌లో 3 వేల మందికి పైగా కాంట్రాక్టు కార్మికులు పనిచేస్తున్నారని, వారు గతంలో పెట్టిన డిమాండ్లపై 2018లోనే అగ్రిమెంట్‌‌‌‌ జరిగిందన్నారు. దాని ప్రకారం వారసత్వ ఉద్యోగాలు, ఐటీఐ ప్రమోషన్లు, సీనియార్టీ ప్రమోషన్లు కల్పించాల్సిన బాధ్యత మేనేజ్‌‌‌‌మెంట్‌‌‌‌దేనని చెప్పారు. లాఠీచార్జి అంశాన్ని ఢిల్లీకి వెళ్లి కేంద్ర మంత్రి ఆర్‌‌‌‌పీ సింగ్‌‌‌‌ను కలిసి వివరిస్తానని, కారకులైన ఆఫీసర్లు, సీఐఎస్‌‌‌‌ఎఫ్‌‌‌‌ పోలీసుల సస్పెండ్‌‌‌‌, ట్రాన్స్‌‌‌‌ఫర్‌‌‌‌ కోరతానన్నారు. గేట్‌‌‌‌ మీటింగ్‌‌‌‌లో బీఎంఎస్‌‌‌‌ జిల్లా అధ్యక్షుడు బూర్ల లక్ష్మినారాయణ, చిలుక శంకర్‌‌‌‌, నాంసాని శంకర్‌‌‌‌, భూమయ్య, సునీల్‌‌‌‌ కుమార్‌‌‌‌, సజ్జద్‌‌‌‌, వడ్డేపల్లి రాంచందర్‌‌ తదితరులు పాల్గొన్నారు.