మంచిర్యాల: కాళేశ్వరం ప్రాజెక్ట్ కేసీఆర్ కు జేబు సంస్థ అని, కమీషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్ట్ ను కట్టారని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి ఆరోపించారు. జిల్లాలోని హాజీపూర్ మండలం వేంపల్లి గ్రామంలో జరిగిన ‘ప్రజాగోస – బీజేపీ భరోసా’ బైక్ ర్యాలీలో వివేక్ వెంకటస్వామి పాల్గొన్నారు. అక్కడ ఆయన బీజేపీ జెండాను ఎగురవేసి బైక్ ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా వివిధ పార్టీల నుంచి పలువురు కార్యకర్తలు వివేక్ సమక్షంలో బీజేపీలో చేరారు. వారికి పార్టీ కండువాలు కప్పిన వివేక్... వారిని పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ... గ్యాస్ సిలిండర్లపై మోడీ ఫోటో పెట్టాలనడం సరికాదన్నారు. పీఎం మోడీని విమర్శించే నైతిక హక్కు కేసీఆర్ కు గానీ, ఆయన కుటుంబ సభ్యులకు గానీ ఏమాత్రం లేదన్నారు. మద్యం సీసాలపై సీఎం కేసీఆర్, ఆయన కూతురు కవిత ఫోటోలు పెట్టాలని ఎద్దేవా చేశారు.
కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో సీఎం కేసీఆర్ అవినీతికి పాల్పడ్డారని, అందుకోసమే ప్రాజెక్ట్ ను రీ డిజైన్ చేశారని ఆరోపించారు. ఎలాంటి ముందుచూపు లేకుండా కోట్లు ఖర్చు పెట్టి కాళేశ్వరం ప్రాజెక్ట్ ను నిర్మించారన్న వివేక్... రీ డిజైనింగ్ లోపాల వల్ల మంచిర్యాల, చెన్నూరు, మంథని పట్టణాలు నీట మునిగాయని మండిపడ్డారు. అలాంటి వ్యక్తి ఇవాళ మోడీని విమర్శించడం హాస్యాస్పదంగా ఉందని వివేక్ చెప్పారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు రఘునాథ్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.