
న్యూఢిల్లీ: గవర్నర్ పంపిన బిల్లుల విషయంలో రాష్ట్రపతికి గడువు విధిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ బీజేపీ ఎంపీలు నిషికాంత్ దుబే, దినేశ్ శర్మ చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగుతున్నది. వాళ్లిద్దరి తీరుపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. న్యాయవ్యవస్థను బలహీనపరిచేందుకు బీజేపీ లీడర్లు ప్రయత్నిస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ లీడర్ జైరాం రమేశ్ ఫైర్ అయ్యారు.
‘‘చట్టమేదైనా రాజ్యాంగానికి విరుద్ధంగా ఉండకూడదని సుప్రీంకోర్టు చెబుతున్నది. ఒకవేళ అలా ఉంటే, తాము తప్పకుండా కలగజేసుకుంటామని స్పష్టం చేసింది. రాజ్యాంగానికి విరుద్ధంగా ఉన్న పలు అంశాల్లో తన అభిప్రాయాలను వ్యక్తపరిచినందుకు సుప్రీంకోర్టును బీజేపీ లీడర్లు టార్గెట్ చేస్తున్నారు” అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
అలాగే కోర్టులను బీజేపీ లీడర్లు బెదిరిస్తున్నారని ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ మండిపడ్డారు. ‘‘మోదీజీ.. మీ వాళ్లు దారుణంగా మాట్లాడుతున్నారు. వాళ్లను ఆపకపోతే దేశం బలహీనపడుతుంది” అని హెచ్చరించారు. కాగా, గవర్నర్లు పంపే బిల్లులను రాష్ట్రపతి 3 నెలల్లోగా క్లియర్ చేయాలని ఇటీవల సుప్రీంకోర్టు ఆదేశించింది. దీనిపై బీజేపీ ఎంపీ నిషికాంత్ దుబే స్పందిస్తూ.. సుప్రీంకోర్టే చట్టాలు చేస్తే, ఇక పార్లమెంట్‌ను మూసేయాల్సిందేనని కామెంట్ చేశారు. జడ్జీలను నియమించే అధికారం ఉన్న రాష్ట్రపతికే సుప్రీంకోర్టు ఆదేశాలిస్తోందంటూ మండిపడ్డారు. మరో ఎంపీ దినేశ్ శర్మ మాట్లాడుతూ.. దేశంలో రాష్ట్రపతినే సుప్రీం అని, రాష్ట్రపతిని ఎవరూ సవాల్ చేయలేరన్నారు.
పార్టీకి సంబంధం లేదు: బీజేపీ
తమ ఎంపీలు చేసిన కామెంట్లతో పార్టీకి సంబంధం లేదని బీజేపీ పేర్కొంది. అవి వాళ్ల సొంత అభిప్రాయాలని తెలిపింది. ‘‘బీజేపీ ఎంపీలు నిషికాంత్ దుబే, దినేశ్ శర్మ చేసిన కామెంట్లతో పార్టీకి సంబంధం లేదు. అవి వాళ్ల సొంత అభిప్రాయాలు. మేం ఆ వ్యాఖ్యలను ఆమోదించడం లేదు. వాటిని ఖండిస్తున్నాం. న్యాయవ్యవస్థపై బీజేపీకి ఎల్లప్పుడూ గౌరవం ఉంటుంది” అని బీజేపీ చీఫ్ జేపీ నడ్డా పేర్కొన్నారు.