హ్యాంగోవర్​లోరాహుల్ గాంధీ

హ్యాంగోవర్​లోరాహుల్ గాంధీ
  • దేశ ప్రజలను అవమానించేలా వ్యాఖ్యలు
  • బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్

హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఎన్నికల హ్యాంగోవర్ లో ఉన్నారని, ఆయన దాని నుంచి ఇంకా బయటపడలేదని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు , ఎంపీ లక్ష్మణ్ విమర్శించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. విదేశీ పర్యటనలో ఉన్న రాహుల్ దేశ ప్రజలను అవమానించేలా మాట్లాడుతున్నారని చెప్పారు. ప్రధాని మోదీపై కోపంతో దేశాన్ని చులకన చేసి మాట్లాడటం సరికాదని సూచించారు.

కాంగ్రెస్ ఓడిపోతే దేశంలో ప్రజాస్వామ్యం లేనట్టా? అని ప్రశ్నించారు. ప్రతిపక్ష నాయకుడి హోదాలో రాహుల్ గాంధీ మొదటి పర్యటనలో ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

భారత్ ను వ్యతిరేకించే శక్తులతో రాహుల్ సమావేశం నిర్వహించడమేంటని లక్ష్మణ్ విమర్శలు చేశారు. సిక్కుల ఊచకోతకు కాంగ్రెస్ కారణం కాదా? అని ఆయన ప్రశ్నించారు. వారి హక్కుల గురించి రాహుల్ మాట్లాడటం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు.