హైడ్రా పేరిట డైవర్ట్ పాలిటిక్స్ : డాక్టర్ లక్ష్మణ్

హైడ్రా పేరిట డైవర్ట్ పాలిటిక్స్ : డాక్టర్ లక్ష్మణ్
  • ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుపై  హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్న: లక్ష్మణ్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కాంగ్రెస్ అసమర్థ పాలన సాగుతున్నదని, సీఎం, మంత్రులు ఢిల్లీకి పరుగులు పెట్టడం తప్పితే ప్రజలకు ఏమీ చేయడం లేదని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ విమర్శించారు. ప్రతిరోజు వార్తల్లో నిలవాలని హైడ్రా పేరిట హడావుడి చేస్తున్నారని, డైవర్ట్ పాలిటిక్స్ కు తెరదీశారని ఆరోపించారు. బీజేపీ స్టేట్ ఆఫీసులో ఆయన ఆ పార్టీ నేతలతో కలిసి మీడియాతో మాట్లాడారు. ఢిల్లీ నాయకులకు గులాంలుగా వారు మారారని విమర్శించారు. వర్షాలు పడినా, వ్యాధులు ప్రబలుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు. రుణమాఫీ అవ్వక, రైతు భరోసా అందక ఇబ్బందులు పడుతున్నారని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి 450 మందికి పైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నారని చెప్పారు. 

అవినీతి, అక్రమాలకు కాంగ్రెస్ పెట్టింది పేరని ఆరోపించారు. వరదల వల్ల 15 లక్షల ఎకరాల నుంచి 20 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని ప్రభుత్వం చెబుతున్నదని, మరి వారికి ఎప్పుడు పరిహారం ఇచ్చి ఆదుకుంటారని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో టీచర్ల కొరత కారణంగా 1800 స్కూళ్లు మూతపడ్డాయని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక వందలాది హత్యలు, 1900 కు పైగా లైంగిక దాడులు జరిగాయని ఆయన తెలిపారు. బీఆర్ఎస్ వద్దని కాంగ్రెస్ కు అధికారం ఇస్తే ప్రజలను ఇబ్బందులు పెడుతున్నారని పేర్కొన్నారు. 

ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై కోర్టు తీర్పును స్వాగతిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఒక పార్టీ గుర్తుపై గెలిచి ఇంకో పార్టీలో చేరి మంత్రి అవ్వడం సిగ్గుమాలిన చర్య అంటూ ఆయన మండిపడ్డారు. బీఆర్ఎస్ లాగే  కాంగ్రెస్ కూడా ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నదని ఫైరయ్యారు. స్పష్టమైన మెజారిటీ ఉన్నా ఫిరాయింపులను ప్రోత్సహించడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. బీజేపీ అంటేనే సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్న పార్టీ అని, ఒక్క సీటుతో ప్రభుత్వాన్ని కోల్పోతామని తెలిసినా ఫిరాయింపులను ప్రోత్సహించని పార్టీ బీజేపీ అని గుర్తుచేశారు.