జహీరాబాద్, వెలుగు : కాంగ్రెస్, బీఆర్‌ఎస్ రెండూ తోడు దొంగలని, ఆ పార్టీ నేతలు కూడబలుక్కొని తెలంగాణలో బీజేపీ బలోపేతాన్ని అడ్డుకుంటున్నారని ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్ విమర్శించారు. సంగారెడ్డి జిల్లా కోహిర్ మండలం గొట్టిగారిపల్లి గ్రామ శివారులోని వాటర్ షెడ్లను బుధవారం ఆయన పరిశీలించారు. అనంతరం రంజోల్ గ్రామ శివారులోని ఓ ఫామ్‌హౌస్‌లో మీడియాతో మాట్లాడారు.
తెలంగాణకు మంచి భవిష్యత్ బీజేపీతోనే సాధ్యమని, త్వరలో జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ క్యాండిడేట్లను గెలిపించాలన్నారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ క్యాండిడేట్లు ఎవరో కూడా వారికే తెలియడం లేదని ఎద్దేవా చేశారు. తెలంగాణ అభివృద్ధి కోసం ప్రధాని మోదీ కృషి చేస్తున్నారన్నారు. పసుపు బోర్డు ఏర్పాటు చేయడం, రూ. 1.10 లక్షల కోట్లతో జాతీయ రహదారుల అభివృద్ధి, రైల్వే వ్యాగన్ ఫ్యాక్టరీ, సికింద్రాబాద్, చర్లపల్లి స్టేషన్ల అభివృద్ధి, యాదగిరిగుట్ట వరకు ఎంఎంటీఎస్ వంటి అభివృద్ది కార్యక్రమాలు చేపట్టిందని గుర్తు చేశారు.
అధికారంలోకి వచ్చిన సంవత్సరంలోపే కాంగ్రెస్‌పై ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందన్నారు. సాధ్యం కాని హామీలు ఇచ్చిన కాంగ్రెస్ అన్ని వర్గాలను మోసం చేసిందన్నారు. సమావేశంలో ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, మాజీమంత్రి మర్రి శశిధర్‌రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షురాలు గోదావరి, గ్యాడ్యుయేట్ ఎమ్మెల్సీ క్యాండిడేట్ అంజిరెడ్డి, నాయకులు జైపాల్‌రెడ్డి, విజేందర్‌రెడ్డి, పాండురంగారెడ్డి, సుభాశ్‌రెడ్డి, బసవరాజ్ పటేల్, శ్రీనివాస్‌గౌడ్ పాల్గొన్నారు.