- బీజేపీ ఓబీసీ జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ పిలుపు
హైదరాబాద్, వెలుగు : బీసీలకు కాంగ్రెస్ శత్రువని బీజేపీ ఓబీసీ జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. బీసీలంతా కలిసి మళ్లీ మోదీని గెలిపించాలని కోరారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు మోదీ సర్కార్ ఎంతో ప్రాధాన్యత ఇచ్చి గౌరవం పెంచిందన్నారు. రాహుల్ మాత్రం బీసీలను కించపర్చేలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. చాయ్ అమ్మిన ఒక వెనుకబడిన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ప్రధానిగా ఉంటే కాంగ్రెస్ ఓర్చుకోవడం లేదని ఫైర్ అయ్యారు.
ఆదివారం బీజేపీ స్టేట్ ఆఫీస్లో ఓబీసీ మోర్చా తెలంగాణ డైరీని లక్ష్మణ్ ఆవిష్కరించి మాట్లాడారు. ‘‘తుక్కుగూడలో కాంగ్రెస్ బహిరంగ విఫలమైంది. ఆ మీటింగ్లో పాంచ్ న్యాయ్ పేరుతో ప్రజలను వంచించడానికి కాంగ్రెస్ లీడర్లు తెరలేపారు. తెలంగాణలో ఇస్తామన్న రూ.2,500కు దిక్కులేదు. కానీ.. దేశ వ్యాప్తంగా మహిళలకు లక్ష ఇస్తామని ప్రకటించారు. ఆరు గ్యారంటీల అమలుకూ దిక్కులేదు. అయినా, మరోసారి గ్యారంటీల పేరుతో మభ్యపెట్టాలని చూస్తున్నారు’’అని విమర్శించారు.
కాంగ్రెస్ లీడర్లు సామాజిక న్యాయం గురించి మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉంటుందని ఎద్దేవా చేశారు. నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉందో.. కాంగ్రెస్ పార్టీలో సామాజిక న్యాయం కూడా అంతే ఉంటదని విమర్శించారు. అప్పట్లో అంబేద్కర్ను ఓడించేందుకు కాంగ్రెస్ కుట్ర పన్నిందని, ఇప్పుడు మాత్రం ఆయన పేరు వాడుకుంటున్నదని మండిపడ్డారు.