బీసీ రిజర్వేషన్ల బిల్లుకు అసెంబ్లీలో మద్దతివ్వలే :  బీజేపీ నేతలు

బీసీ రిజర్వేషన్ల బిల్లుకు అసెంబ్లీలో మద్దతివ్వలే :  బీజేపీ నేతలు
  • ముస్లింలను బీసీల్లో చేర్చడాన్ని వ్యతిరేకిస్తున్నం: బీజేపీ ఎమ్మెల్యేలు 

న్యూఢిల్లీ, వెలుగు: బీసీలకు విద్యా, ఉద్యోగాలు, స్థానిక ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించేలా తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన రెండు బిల్లులకు తాము మద్దతివ్వలేదని బీజేపీ నేతలు చెప్పారు. మత పరమైన రిజర్వేషన్లను ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునేది లేదని కోర్టులు చెప్పాయని గుర్తు చేశారు. కులం లేని ముస్లింలకు ఏ ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇస్తారో సీఎం సమాధానం చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు. బుధవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌‌‌‌ రెడ్డి, ఎమ్మెల్యేలు పాల్వాయి హరీశ్​, పాయల్‌‌‌‌ శంకర్‌‌‌‌ మీడియాతో మాట్లాడారు.

కాంగ్రెస్‌‌‌‌ పార్టీ తీరు, బీసీ రిజర్వేషన్లపై నిర్వహించిన ధర్నాలో సీఎం రేవంత్‌‌‌‌ రెడ్డి వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీ రిజర్వేషన్ల పేరుతో కేవలం రాజకీయ ప్రకటనకే పరిమితమయ్యారన్నారు. ఎంఐఎం పార్టీ, కాంగ్రెస్‌‌‌‌ కలిసి బీసీల మీద కుట్ర పన్నుతున్నాయని మండిపడ్డారు. ఇందుకు ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌‌‌‌ ఒవైసీ మాట్లాడిన మాటలే నిదర్శనం అని పేర్కొన్నారు.   బీజేపీపై బురద జల్లాలనే ఆలోచనతో ఉన్నారని మండిపడ్డారు.  సీఎం రేవంత్‌‌‌‌ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే తాము ఆ రోజే ఇచ్చిన రిప్రజెంటేషన్‌‌‌‌కు సమాధానం చెప్పాలని డిమాండ్‌‌‌‌ చేశారు.