చతికిలపడ్డ బీజేపీ..ఆ పార్టీ ఓట్లు బీఆర్​ఎస్​, కాంగ్రెస్‌‌‌‌కు డైవర్ట్

  •     గత ఎన్నికల్లో నల్గొండ లో 20 వేలు, మునుగోడు లో 87 వేల ఓట్లు 
  •     ఈ ఎన్నికల్లో డిపాజిట్​ కోల్పోయిన అభ్యర్థులు 
  •     కనిపించని అమిత్ షా రోడ్ షో, బహిరంగ సభల ప్రభావం

నల్గొండ, వెలుగు : అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటుతామని చాలెంజ్​ చేసిన బీజేపీ చతికిలపడింది. ఉమ్మడి జిల్లాలో పార్టీ బలంగా ఉన్న నియోజకవర్గాలోనూ కనీసం డిపాజిట్​ దక్కలేదు. బీఆర్​ఎస్​, బీజేపీ ఒక్కటేనని ప్రచారం చేసిన కాంగ్రెస్​ఆరోపణలు తిప్పికొట్టడంలో ఆపార్టీ నాయకత్వం విఫలమైనట్టు కనిపిస్తోంది. ఎన్నికల హడావిడి ఊపందుకున్న టైంలో ఆపార్టీ నాయకులు మెత్తపడటంతో అభ్యర్థుల మధ్యలోనే చేతులెత్తేశారు.

పార్టీ కార్యకర్తలను, నాయకులను సమన్వయం చేయాల్సిన కోఆ ర్డినేటర్లు, పరిశీలకులు కూడా అంటీముట్టనట్టుగానే వ్యవహరించారని విమర్శలు ఉన్నాయి.  2 019 పార్లమెంట్, ​మునుగోడు ఉప ఎన్నికల్లో సత్తా చాటిన పార్టీ డిపాజిట్​కోల్పోవడంపై పార్టీ నాయకత్వం విశ్లేషణ చేసినట్లు తెలిసింది. త్రిముఖ పోరులో పార్టీ అభ్యర్థులు గట్టిపోటీ ఇవ్వడంలో వెనకబడినందునే  ఆశించిన స్థాయిలో ఫలితాలు రాలేదనే ఏకాభిప్రాయానికి వచ్చినట్టు సమాచారం. 

4.22 శాతం ఓట్లే

ఉమ్మడి జిల్లాలో 11 స్థానాల్లో బీజేపీ పోటీ చేయగా, కోదాడలో పొత్తులో భాగంగా జనసేనకు కేటాయించింది. 11 చోట్ల పార్టీ అభ్యర్థులకు 1,22,55 6  ఓట్లు (4.22 శాతం) పోలయ్యాయి.  కోదాడలో జనసేన పార్టీకి 2,151 ఓట్లు మాత్రమే వచ్చాయి. సూర్యాపేట, నల్గొండ, భువనగిరి, ఆలేరు, మునుగోడులో అభ్యర్థులు బీఆర్​ఎస్​, కాంగ్రెస్​ పార్టీలకు ధీటుగా నిలబడ్డారు. కానీ,  సూర్యాపేటలో మాత్రమే  40 వేల పైచిలుకు ఓట్లు పడ్డాయి.  మునుగోడు ఉప ఎన్నికల్లో 87 వేల ఓట్లు సాధించిన బీజేపీ ఈ ఎన్నికల్లో 22 వేల ఓట్లకు మించి రాబట్ట లేకపోయింది.  

2019లో జరిగిన ఎంపీ ఎన్నికల్లో బీజేపీకి నల్గొండ పట్టణంలో 20 వేల ఓట్లు పడ్డాయి. మున్సిపాలిటీలో ఐదుగురు కౌన్సిలర్లు, రాష్ట్ర స్థాయిలో కీలక పదవుల్లో ఉన్న నాయకులు పట్టణంలోనే ఉన్నారు. అయినప్పటికీ  ఈ సారి 7,828 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. ఇక సూర్యాపేటలో గెలుస్తామని ధీమా వ్యక్తం చే సిన మాజీ ఎమ్మెల్యే సంకినేని వెంకటేశ్వరరావు మాత్రం 40 వేల ఓట్లు సాధించారు.

భువనగిరిలో 9 వేలు, ఆలేరులో 9 వేల పైచిలుకు ఓట్లు మాత్రమే పోలయ్యాయి.  త్రిముఖ పోరులో ప్రభుత్వ వ్యతిరేకత ఓటు చీలి బీఆర్ఎస్​కు లాభం చేకూరుతుందని నల్గొండ, ఆలేరు, సూర్యాపేట, భువనగిరి అభ్యర్థులు భావించారు. సూర్యాపేటలో మాత్రమే అది సక్సెస్​ అయినట్లు కనిపిస్తోంది.   

అంతంతే అమిత్​ షా ప్రభావం 

కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్​షా నల్గొండ, సూర్యాపేట, భువనగిరి బహిరంగ సభల్లో పాల్గొన్నారు. చౌటుప్పుల్​లో రోడ్​ షో నిర్వహించారు. కానీ అమిత్​ షా పర్యటన ఎలాంటి ఫలితాన్ని రాబట్టలేకపోయింది. అమిత్​ షా బహిరంగ సభలను సక్సెస్​ చేయడంలో అభ్యర్థులు ఫెయిలైనట్టు పార్టీ గుర్తించింది. నల్గొండలో 20 వేల మంది జనాన్ని తరలించేందుకు రూ.20 లక్షలు ఖర్చు పెడితే సభకు 7 వేలకు మించి రాలేదని పార్టీ నేతలే చెబుతున్నారు.   సూర్యా పేటలో మాత్రమే అమిత్​షా మీటింగ్​ ఓ మోస్తారు పబ్లిక్​ వచ్చారని ఇంటిలిజెన్స్​ నివేదిక ఇచ్చినట్లు తెలిసింది.

ఎన్నికల ఖర్చు కోసం పంపిన పార్టీ ఫండ్​ను కూడా పూర్తిస్థాయిలో ఖర్చు పెట్టలేదని,  కొన్ని చోట్ల అభ్యర్థులు జేబుల్లోంచి నయాపైసా కూడా ఖర్చు పెట్టలేదని పార్టీ హైకమాండ్​కు రిపోర్ట్​ చేరినట్టు సమాచారం. కొన్ని చోట్ల అభ్యర్థులు పోలింగ్​ జరగడానికి రెండు రోజుల ముందు చేతులెత్తేశారని, బీఆర్​ఎస్​తో చేతులు కలిపారనే ఫిర్యా దులు కూడా హైకమాండ్​కు వెళ్లినట్లు ప్రచారం జరిగింది. ఇవన్నీ కలిసి బీజేపీ కొంపముంచాయని ఆ పార్టీ గ్రామస్థాయి క్యాడర్ మండిపడుతోంది.