ఇది నయా కమలం
హోరాహోరీగా జరిగిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) ఎన్నికల రిజల్ట్స్ బీజేపీకి పాజిటివ్‌గా ఉన్నాయి. 2016లో టీఆర్ఎస్ 99, ఎంఐఎం 44, బీజేపీ 4, కాంగ్రెస్ 2, టీడీపీ 1 సీట్లలో గెలుపొందాయి. ఇప్పుడు రిజల్ట్స్‌లో భారీ మార్పులే కనిపించాయి. టీఆర్ఎస్ ఇప్పుడు 55 సీట్లకే పరిమితం కాగా, గణనీయంగా పుంజుకున్న బీజేపీ 48 సీట్లు సాధించింది. ఎంఐఎం ఎప్పటిలాగే తన సీట్లను నిలబెట్టుకోగా, కాంగ్రెస్2 చోట్ల గెలిచి తన ఉనికిని కాపాడుకుంది.
హైదరాబాద్ చరిత్రలోనే ఇటువంటి ఎన్నికలు ఇంతకుమునుపెన్నడూ చూడలేదు. జీహెచ్ఎంసీలోనే కాదు, అసెంబ్లీ, లోక్‌సభ ఎలక్షన్లలోనూ ఇంత హోరాహోరీ పోరాటం జరగలేదు. ఈ పోరాటంతో తెలంగాణలో బీజేపీ తన స్టామినాను అనుహ్యంగా పెంచుకుంది. 24 ఎమ్మెల్యేలు, 5 ఎంపీ స్థానాలున్న జీహెచ్ఎంసీ పరిధిలోనూ తను ఇప్పుడు పట్టు సాధించింది. అదొక్కటే కాదు, ఇప్పుడు జీహెచ్ఎంసీలో ఏం జరిగినా దాని ప్రభావం చుట్టుపక్కల జిల్లాలపైనా పడుతుంది. దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికలో అనూహ్య విజయం సాధించిన తర్వాత బీజేపీలో కాన్ఫిడెన్స్ బాగా పెరిగింది. అదే ఇప్పుడు ఆ పార్టీని గ్రేటర్లో ముందుకు నడిపించింది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ దారుణమైన పరిస్థితుల్లోకి వెళ్లిపోయింది.
తెలంగాణలో బీజేపీ ఫ్యూచర్ ఏంటి?
ఎ. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం తామేనని నిరూపించుకోవడానికి బీజేపీ జీహెచ్ఎంసీ ఎలక్షన్లను బాగా యూజ్ చేసుకుందనే విషయంలో ఎలాంటి అనుమానం లేదు. గతంలో టీఆర్ఎస్కు ప్రధాన ప్రత్యర్థిగా కాంగ్రెస్ ఉండేది. ఇప్పుడు ఆ ప్లేస్‌ను బీజేపీ ఆక్రమించుకుంది. ఇప్పుడు టీఆర్ఎస్ను వ్యతిరేకించే వారు ఎవరైనా బీజేపీకి మద్దతుగా నిలబడుతున్నారు.
బి. రాష్ట్రంలో బీజేపీ కూడా కొత్త లీడర్షిప్కు చాన్స్ ఇచ్చింది. అలాగే చాలామంది వేరే పార్టీల నాయకులు కూడా ఇప్పుడు బీజేపీలో చేరారు. వారికి పార్టీ గౌరవం ఇస్తోంది. కానీ బీజేపీ పవర్‌ను మాత్రం మొదటి నుంచి పార్టీని అంటిపెట్టుకుని ఉన్న వారికే అప్పగించింది. గతంలో నాయకత్వం లేని వారికి పగ్గాలు ఇచ్చింది. బీసీలు, దళితులు, గిరిజనులు బీజేపీలో కంఫర్టబుల్‌గా ఉండటానికి ఇది మేజర్ స్టెప్‌గా పనిచేసింది. పార్టీలో కులాలకు, వారసత్వానికి, భూస్వాములకు లేదా స్వార్థ ప్రయోజనాలకు అవకాశం ఇవ్వలేదు. కొత్త లీడర్లలో ఎనర్జీ ఉంది. అది దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో స్పష్టంగా కనిపించింది.
సి. ఇక బీజేపీ ప్రతి ఎన్నికను చాలా సీరియస్‌గా తీసుకుంటోంది. జీహెచ్ఎంసీ మున్సిపల్ ఎలక్షన్ అయినా పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు హైదరాబాద్‌కు వచ్చారు. ఒక ప్రముఖ లీడర్ తర్వాత మరో ప్రముఖ లీడర్ వెంటవెంటనే రాష్ట్రానికి వచ్చారు. దీనినే కార్పెట్ బూమింగ్ అంటారు. భవిష్యత్తులో తెలంగాణపై బీజేపీ సెంట్రల్ లీడర్లు మరింత ఫోకస్ పెడతారని మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు.
కొత్త రక్తానికే పవర్
పార్టీ కార్యకర్తలకు బీజేపీ ప్రాధాన్యత ఇచ్చింది. దాంతో పార్టీలో జవాబుదారీతనం పెరిగింది. పార్టీ ఎదగడానికి కొత్త రక్తం తప్పనిసరిగా కావాలని బీజేపీ ఈ పంథా ద్వారా తెలియజెప్పింది. ఉన్న ట్యాలెంట్ సరిపోకపోతే, కొత్త లీడర్లను తెచ్చుకోవడానికి బీజేపీ సిద్ధంగా ఉంది. కొత్తగా పార్టీలో చేరే వారికి సత్తా ఉందా లేదా అనేదానిపై బీజేపీ లీడర్షిప్ జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంది. ఇదే రూట్‌ను ఫాలో అయ్యింది కాబట్టే బెంగాల్, ఒడిశా, అస్సాంలో బీజేపీ అద్భుతమైన ప్రగతి సాధించింది. కొత్త రక్తం అనే సేమ్ ఫార్ములాను తెలంగాణలోనూ అమలు చేసింది.
తెలంగాణలో బీజేపీ చేస్తున్న సోషల్ ఇంజనీరింగ్‌ను ప్రత్యర్థి పార్టీలు ఇప్పటికైనా గుర్తించాలి. అప్పుడే తెలంగాణలోని బీసీలు, దళితులు, గిరిజనుల నుంచి బీజేపీ నాయకులను తయారు చేసినా వారు ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఉండదు. జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలను బీజేపీ సాధించిన విజయంగా ఇప్పుడు దేశం మొత్తం చూస్తోంది. బీహార్ తర్వాత, హైదరాబాద్‌లో సాధించిన ఈ విజయం వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న బెంగాల్, అస్సాం, తమిళనాడులో పార్టీకి మరింత బూస్ట్ ఇస్తుంది. తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో మార్పు అనే నినాదంతో బీజేపీ ఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధమవుతోంది. అందువల్ల ప్రత్యర్థి పార్టీలు దానికి సిద్ధంగా ఉండాలి.
1. ప్రస్తుతం తెలంగాణలో టీఆర్ఎస్ పాలన కొనసాగుతోంది. మళ్లీ అసెంబ్లీ ఎన్నికలకు మరో మూడేండ్ల సమయం ఉంది. ఎక్కువ సమయం ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలను ఓటర్లు అంత త్వరగా రిజెక్ట్ చేయరు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కొంత ప్రభుత్వ వ్యతిరేకత కనిపించింది. అయితే అది ఇంకా తీవ్రమైన స్థాయికి చేరలేదు. ప్రజల్లో వ్యతిరేకత తీవ్ర స్థాయికి చేరినట్లయితే ఆ ప్రభుత్వం ప్రమాదంలో పడినట్లే. ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన హామీలు వచ్చే మూడేండ్లలో ఆ పార్టీకి మోయలేని భారంగా మారవచ్చు.
2. ఎంఐఎం పార్టీ నేషనల్ ముస్లిం పార్టీగా మారేందుకు ప్రయత్నిస్తోంది. బీజేపీ ఈ విషయాన్ని ముందే గుర్తించింది. అందువల్లే జీహెచ్ఎంసీ ఎలక్షన్లను టీఆర్ఎస్కు మాత్రమే కాకుండా ఎంఐఎంకు వ్యతిరేకంగా కూడా బీజేపీ తీసుకుంది. అయితే తెలివిగా ఆలోచించిన ఎంఐఎం తనకు పట్టున్న ప్రాంతాలకే పరిమితమై అక్కడ విజయం సాధించింది. మిగతాచోట్ల మైనార్టీలు టీఆర్ఎస్ కు ఓటు వేసేలా ప్రోత్సహించింది. హైదరాబాద్‌లో బీజేపీ సత్తా చాటడం ఇప్పుడు ఎంఐఎంకు ఆందోళన కలిగించే విషయమే.
3. కాంగ్రెస్ పార్టీ నుంచి చాలా మంది లీడర్లు బీజేపీ, టీఆర్ఎస్లో చేరారు. ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మూడో స్థానానికి పడిపోయింది. ఆ పార్టీని వెనక్కి నెట్టిన బీజేపీ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీగా అవతరించింది. కాంగ్రెస్ పార్టీ బలహీనపడటంతో మైనార్టీలు ఇప్పుడు టీఆర్ఎస్ కు సపోర్ట్ చేస్తున్నారు.
4. ఈ ఎన్నికల్లో ఎక్కువగా లాభపడింది బీజేపీనే. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉండటంతో ఎన్నికల ప్రచారంలో బీజేపీ దూకుడు చూపించింది. దానికి తగ్గట్టుగానే ఫలితాలను సాధించింది. దుబ్బాక ఉప ఎన్నిక రిజల్ట్‌ను కూడా బీజేపీ బాగా వాడుకుంది. బీజేపీ ప్రధానంగా టీఆర్ఎస్ ను రీప్లేస్ చేయడంపైనే దృష్టి పెట్టింది. దాంతో యాంటీ టీఆర్ఎస్ ఓటర్లంతా బీజేపీ వైపు టర్న్ అయ్యారు. వారంతా కాంగ్రెస్‌ను పక్కనపెట్టేశారు. సోషల్ మీడియా ఎన్నికలను గెలిపించదని ఇప్పటికైనా రాహుల్ గాంధీ గుర్తించాలి.