కేజ్రీవాల్​ను లోపలేయడానికి..మాగుంటతో వాంగ్మూలం

 కేజ్రీవాల్​ను లోపలేయడానికి..మాగుంటతో వాంగ్మూలం

న్యూఢిల్లీ : ఢిల్లీ లిక్కర్  స్కామ్ కు బీజేపీదే బాధ్యత అని బెయిల్ పై విడుదలైన ఆప్  రాజ్యసభ సభ్యుడు సంజయ్  సింగ్ ఆరోపించారు. ఢిల్లీ సీఎం అర్వింద్  కేజ్రీవాల్ ను జైలుకు పంపించడానికి బీజేపీ సీనియర్  నేతలందరూ కలిసి కుట్రపన్నారని అన్నారు. శుక్రవారం ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సంజయ్ మాట్లాడారు. బీజేపీ లీడర్లు, మాగుంట శ్రీనివాసులు రెడ్డి (ఢిల్లీ లిక్కర్ స్కామ్​లో అప్రూవర్​గా మారిన రాఘవ రెడ్డి తండ్రి) మధ్య లింక్  ఉన్నట్లుగా చూపిస్తున్న ఫొటోను ఈ సందర్భంగా ఆయన విడుదల చేశారు. ‘‘ఢిల్లీ లిక్కర్  స్కామ్​లో మాగుంట శ్రీనివాసులు రెడ్డి వాంగ్మూలాన్ని ఈడీ అధికారులు మూడుసార్లు, ఆయన కొడుకు రాఘవ రెడ్డి వాంగ్మూలాన్ని ఏడుసార్లు రికార్డు చేశారు.

 మొదటిసారిగా శ్రీనివాసులు రెడ్డిని ప్రశ్నించినపుడు తనకు కేజ్రీవాల్ తెలుసని ఆయన చెప్పారు. అయితే చారిటబుల్  ట్రస్ట్ ల్యాండ్ విషయంలో కేజ్రీవాల్​ను ఆయన కలిశారు. ఆ తర్వాత ఆయన కొడుకు రాఘవను ఈడీ అధికారులు అరెస్టు చేశారు. తనను 5 నెలలు జైలులో ఉంచడంతో వేధింపులకు తట్టుకోలేక రాఘవ తన వాంగ్మూలాన్ని మార్చుకున్నారు” అని సంజయ్ పేర్కొన్నారు. నిరుడు ఫిబ్రవరి 10 నుంచి జులై 16 వరకు ఏడుసార్లు రాఘవ స్టేట్ మెంట్​ను తీసుకున్నారని చెప్పారు. అధికారుల వేధింపులు తట్టుకోలేక ఏడోసారి కేజ్రీవాల్​కు వ్యతిరేకంగా ఆయన స్టేట్ మెంట్  ఇచ్చారని సంజయ్  చెప్పారు. కాగా, సంజయ్​కు ఇటీవలే సుప్రీంకోర్టు బెయిల్  ఇవ్వడంతో ఆయన విడుదలయ్యారు. అయితే, లిక్కర్  స్కామ్ పై మాట్లాడకూడదంటూ సుప్రీంకోర్టు విధించిన షరతును ఆయన అతిక్రమించారు.

పార్టీని సునీత నడపగలదు: సౌరభ్

ప్రస్తుత పరిస్థితుల్లో సీఎం అర్వింద్  కేజ్రీవాల్  భార్య సునీత పార్టీని నడపగలరని, ఇందుకు ఆమెనే బెస్ట్  పర్సన్  అని ఆప్  మంత్రి సౌరభ్  భరద్వాజ్  అన్నారు. పార్టీ క్యాడర్​పై ఆమె ఉనికి సానుకూల ప్రభావం చూపుతుందన్నారు. కేజ్రీవాల్ సందేశాలను ప్రజలు, కార్యకర్తలకు ఆమె చేరవేస్తున్నారని, దీంతో పార్టీ క్యాడర్ పై సానుకూల ప్రభావం పడుతోందన్నారు. 

తర్వలో మిమ్మల్ని కలుస్త :  సిసోడియా

త్వరలోనే తన నియోజకవర్గ ప్రజలను కలుస్తానని ఆప్ లీడర్ మనీశ్  సిసోడియా అన్నారు. శుక్రవారం తీహార్  జైలు నుంచి ప్రజలకు ఆయన లేఖ రాశారు. స్వాతంత్ర్య సంగ్రామం సమయంలో మన జాతీయ నాయకులపై తప్పుడు ఆరోపణలు మోపి బ్రిటిష్  పాలకులు జైలుకు తరలించారని, తనను కూడా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అలాగే  జైల్ లో పెట్టిందని విమర్శించారు. త్వరలోనే తాను విడుదలవుతానని ఆశాభావం వ్యక్తం చేశారు.