- మునుగోడు ప్రచారంలో ఉన్న నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఫామ్‌హౌస్‌లో ప్రత్యక్షం
- పోలీసుల సోదాలు.. అదుపులో ముగ్గురు వ్యక్తులు
- మాకు ఎమ్మెల్యేలే సమాచారం ఇచ్చారు: సీపీ స్టీఫెన్ రవీంద్ర
- ప్రగతిభవన్ కేంద్రంగా కుట్రలన్న బీజేపీ
హైదరాబాద్ / చేవెళ్ల, వెలుగు: మునుగోడు బై పోల్ వేళ రాష్ట్ర రాజకీయాల్లో హైడ్రామాకు తెరలేచింది. హైదరాబాద్ శివారులోని ఫామ్‌హౌస్‌లో తమను కొనేందుకు బేరసారాలు జరుగుతున్నట్లు నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పోలీసులకు సమాచారం ఇవ్వడం, పోలీసులు అక్కడికెళ్లి దాడులు చేయడం సంచలనంగా మారింది. ముగ్గురు మధ్యవర్తులు పట్టుబడ్డట్లు సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. ఇందులో ఇద్దరు స్వామీజీలు ఉన్నారు. ఆ ముగ్గురిని బీజేపీనే రంగంలోకి దింపి, తమ ఎమ్మెల్యేలను వంద కోట్లతో కొనేందుకు ప్రయత్నించిందని టీఆర్ఎస్ ఆరోపిస్తుండగా... ఇదంతా ప్రగతిభవన్ డైరెక్షన్లో టీఆర్ఎస్ నడిపించిన నాటకమని బీజేపీ మండిపడింది. ఎలాంటి దర్యాప్తుకైనా తాము సిద్ధమని సవాల్ చేసింది. ఫామ్‌హౌస్ వేదికగా జరిగిన ఈ పొలిటికల్ హైడ్రామాపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఛాయ్ తాగుతూ, ముచ్చట్లు పెడ్తూ..!
హైదరాబాద్ శివారు మొయినాబాద్ మండలం అజీజ్‌నగర్‌లోని ఫామ్‌హౌస్‌లో బుధవారం సాయంత్రం టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పైలట్ రోహిత్ రెడ్డి (తాండూరు), గువ్వల బాలరాజు (అచ్చంపేట), హర్షవర్ధన్ రెడ్డి (కొల్లాపూర్), రేగా కాంతారావు (పినపాక)తో ముగ్గురు వ్యక్తులు డీల్చేసుకుంటున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. పోలీసులు అక్కడికి వెళ్లే లోపే కొన్ని వీడియోలు బయటకు వచ్చాయి. ముగ్గురు వ్యక్తులతో కలిసి ఎమ్మెల్యేలు ముచ్చట్లు పెడుతున్నట్లు, టీ తాగుతున్నట్లు అందులో ఉంది. మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో పార్టీ ఫిరాయింపుల కోసం రూ.100 కోట్లతో ఎమ్మెల్యేలతో ఆ ముగ్గురు బేరసారాలాడుతున్నట్లు ప్రచారం జరిగింది. పోలీసులు ఫామ్‌హౌస్‌కు చేరుకొని సోదాలు జరిపారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ప్రలోభ పెడుతున్నారనే సమాచారంతో ఫామ్‌హౌస్‌పై దాడులు నిర్వహించినట్టు సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. నగదు దొరికినట్లు ప్రచారం జరుగుతున్నా దాన్ని సీపీ ధ్రువీకరించలేదు.
ఎమ్మెల్యేలే సమాచారం ఇచ్చారు: సీపీ రవీంద్ర
డీల్ వ్యవహారంపై టీఆర్ఎస్ ఎమ్మెల్యేలే సమాచారం ఇచ్చారని సీపీ స్టీఫెన్ రవీంద్ర మీడియాకు తెలిపారు. ‘‘టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ప్రలోభపెడుతున్నారని మాకు సమాచారం వచ్చింది. రామచంద్ర భారతి ఈ సంప్రదింపులు జరిపారని తెలుస్తున్నది. ఫామ్‌హౌస్ లో రైడ్ చేస్తే ముగ్గురు పట్టుబడ్డారు. రామచంద్రభారతి ఢిల్లీలో ఉంటారు. తిరుపతికి చెందిన స్వామీజీ సింహయాజులు వచ్చారు. హైదరాబాద్ కు చెందిన నందకుమార్ ఇక్కడ ఉన్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలే ఈ సమాచారం ఇచ్చారు. పార్టీ ఫిరాయింపుల కోసం ఒత్తిడి, ప్రలోభ పెట్టారని చెప్పారు. డబ్బులు, కాంట్రాక్టులు, పదవులు ఇస్తామని చెప్పారన్నారు” అని ఆయన అన్నారు. లీగల్ ఒపీనియన్ మేరకు చర్యలు తీసుకుంటామని చెప్పారు.
ఎమ్మెల్యేలను ప్రగతి భవన్‌కు పిలిపించుకొని మాట్లాడిన కేసీఆర్
డీల్ వ్యవహారం బయటకు వచ్చాక.. ముగ్గురు ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, రేగా కాంతారావు, హర్షవర్ధన్‌రెడ్డిని బుధవారం రాత్రి సీఎం కేసీఆర్ ప్రగతిభవన్‌కు పిలిపించుకొని మాట్లాడారు. మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, మరికొందరు ముఖ్య నేతలు ఈ భేటీలో పాల్గొన్నారు. తమను బీజేపీ ప్రలోభ పెడుతుందంటూ పోలీసులకు సమాచారం ఇచ్చిన పైలెట్ రోహిత్ రెడ్డిని పోలీసులు ఫామ్‌హౌస్‌లోనే ఉంచి విచారణ చేశారు. ఫామ్ హౌస్ ఎవరిది, నందుతో ఆయనకున్న వ్యాపార భాగస్వామ్యం ఇతర అంశాలపై ఆరా తీసినట్టు తెలిసింది. విచారణ అనంతరం పోలీస్ వాహనంలో పైలట్ రోహిత్ రెడ్డిని ప్రగతి భవన్ లోపలికి తీసుకెళ్లారు.
కేసీఆర్ కుట్రలు: చింతల రామచంద్రారెడ్డి
నలుగురు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బీజేపీ ప్రయత్నించినట్టుగా జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని బీజేపీ నేత చింతల రామచంద్రారెడ్డి అన్నారు. ‘‘జీహెచ్‌ఎంసీలో మా పార్టీ కార్పొరేటర్లనే టీఆర్‌ఎస్ కొనుగోలు చేసింది. ఇప్పుడు వీడియోలో ఉన్న నలుగురిలో పైలెట్ రోహిత్ రెడ్డి, రేగా కాంతారావు, హర్షవర్ధన్ రెడ్డి కాంగ్రెస్‌లో గెలిచి టీఆర్‌ఎస్‌లో చేరిన వాళ్లే. వారిని ముందు పెట్టి బీజేపీపై కేసీఆర్ కుట్రలు చేస్తున్నడు. మా పార్టీలో చేరాలంటే పదవికి రాజీనామా చేసి రావాల్సిందే.. ఇలాంటి వ్యవహారాలను ప్రోత్సహించం.. ప్రగతి భవన్‌లో చేసిన కుట్ర ఇది” అని పేర్కొన్నారు.
ఎన్నో అనుమానాలు
- నలుగురు ఎమ్మెల్యేలున్న ఆ ఫామ్‌హౌస్ ఎవరిది?
- ఎమ్మెల్యేలను నిందితులు ఎప్పుడు కాంటాక్ట్ చేశారు?
- బుధవారం మధ్యాహ్నం నుంచి ఫామ్‌హౌస్ లో ఏం జరిగింది?
- నిందితుల్లో హైదరాబాదీ నందుకు, ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి సంబంధమేంటి?
- నందు చెబుతున్నట్లుగా పూజల కోసమే పూజారులు వచ్చారా?
- డబ్బులతో వచ్చారంటున్నా డబ్బులు ఎందుకు చూపించలేదు?
- ఉత్త బ్యాగులు కనిపిస్తుంటే వందకోట్లని ఎట్లా ప్రచారం జరిగింది?
- రెడ్ హ్యాండెడ్ గా దొరికితే బ్యాగుల్లో డబ్బులు
- పోలీసులు లెక్కించలేదా?
- ముందే బేరాలకు ఆఫర్ వస్తే రికార్డింగ్‌కు ఏర్పాట్లు చేయలేదా?
- ఓటుకు నోటు కేసులో ప్లాన్ చేసినట్లుగా ఇప్పుడెందుకు జరగలేదు?
- డబ్బు తెచ్చినట్లు చెబుతున్న కారు ఎవరిది?
- ఆ ఫామ్‌హౌస్ ఎవరిది?
టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు వెళ్లిన ఫామ్‌హౌస్ ఎవరిది అనే దానిపైనా సందేహాలు నెలకొన్నాయి. తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డికి చెందినదిగా ప్రచారం జరుగుతున్నది. తన ఫ్రెండ్ ఫామ్‌హౌస్ అని గువ్వల బాలరాజు అక్కడికి వెళ్లిన మీడియా ప్రతినిధులతో అన్నారు. టీఆర్‌ఎస్ నేతలకే చెందిన ఫామ్‌హౌస్‌కు స్వామీజీలు, ఇతర వ్యక్తులు ఎట్లా వచ్చారు..? అక్కడ డీల్‌పై ఏం మాట్లాడారు? అనేది తేలాల్సి ఉంది. ఎమ్మెల్యేల కొనుగోళ్లకు ప్రయత్నించినట్టుగా చెప్తున్న నందు అనే వ్యక్తి కేంద్ర మంత్రికి అనుచరుడని టీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తుండగా... నందుతో నలుగురు ఎమ్మెల్యేల్లో ఒకరికి బిజినెస్ పార్ట్నర్షిప్ ఉందని ప్రచారం జరుగుతున్నది.
మీడియాతో స్వామీజీని మాట్లాడనివ్వని పోలీసులు
మీడియాతో మాట్లాడటానికి ప్రయత్నించిన స్వామీజీ సింహయాజులును పోలీసులు అడ్డుకున్నారు. తాను పూజలు చేసేందుకు వచ్చానని ఆయన చెప్పారు. రామచంద్రభారతి, సింహయాజులుతోపాటు నందును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నలుగురు ఎమ్మెల్యేలతో ఎంత కాలం నుంచి టచ్ లో ఉన్నారు అనే విషయంపై వీరిని ఫామ్‌హౌస్‌లోనే ఉంచి అర్ధరాత్రి వరకు విచారించారు.
ప్రచారం నుంచి
సడెన్‌గా ఫామ్‌హౌస్‌కు
మునుగోడు ఉప ఎన్నికను సీరియస్‌గా తీసుకున్న టీఆర్ఎస్ హైకమాండ్.. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు సహా ప్రజాప్రతినిధులందరికీ ప్రచార బాధ్యతలు అప్పగించింది. మునుగోడులో మకాం పెట్టిన ఈ ఎమ్మెల్యేలు ఉన్నట్టుండి మొయినాబాద్ సమీపంలోని గెస్ట్ హౌస్‌లో ఎందుకు ప్రత్యక్షమయ్యారు? వీళ్లను కొనుగోలు చేయాలనుకున్నది ఎవరు? ఎంతకు డీల్ కుదుర్చుకున్నారనే.. వివరాలింకా వెల్లడి కాలేదు. ప్లాన్ ప్రకారమే ఈ నలుగురు ఎమ్మెల్యేలను ఇరికించేందుకు.. ఫిరాయింపుల ప్లాన్ చేసినట్లు కూడా ఆరోపణలు వస్తున్నాయి.
ఇంత దిగజారాలా?
మునుగోడు ఉప ఎన్నిక కోసం ఇంత దిగజారాలా? ప్రగతి భవన్ ప్లాన్‌లో భాగంగానే ఎమ్మెల్యేలకు ప్రలోభాల పేరిట డ్రామాకు తెరతీశారు. ఈ వ్యవహారంపై సీబీఐతోనే కాదు.. సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో కూడా విచారణకు సిద్ధం. బీజేపీలోకి వస్తామనే వారిని రాజీనామా చేయించి చేర్చుకుంటున్నం. ఇందుకు డబ్బులతో అవసరం ఏముంది?
‑ కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
తండ్రీకొడుకుల డ్రామా: అర్వింద్
తండ్రీకొడుకులు కేసీఆర్, కేటీఆర్ పనికిమాలిన హైడ్రామా ఆడారని, ఆ ఫామ్‌హౌస్‌లో బీజేపీ నేతలు ఎవరూ లేరని ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. ‘‘డీల్ డ్రామాను చూసి అందరూ నవ్వుకుంటున్నరు.. తండ్రీకొడుకులు పనికిమాలిన తెలివితేటలు ప్రదర్శిస్తున్నరు. ఇద్దరు కలిసి ఏదో డ్రామా ఆడుతున్నరు. ఆ నలుగురు ఎమ్మెల్యేలు వచ్చే ఎన్నికల్లో గెలిచే వాళ్లు కాదు. వారిని రూ.100 కోట్లు పెట్టి ఎవరు ఎందుకు కొంటరు? పోలీసుల కంటే ముందే కొన్ని మీడియా చానళ్లకు ఎట్ల తెలిసింది. ఇందులో ఎన్నో అనుమానాలు ఉన్నయ్? ఇది చాలా సిల్లీ ఆపరేషన్. ఇష్యూను డైవర్ట్ చేయటానికి తండ్రీకొడుకులు పనికిమాలిన పని చేసిండ్రు” అని మండిపడ్డారు. ఈ ఘటనపై హైకోర్టు ద్వారా జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయాలన్నారు. దొరికిన పైసలు బయటపెట్టాలని, అవి ఎక్కడి నుంచి వచ్చినయో పోలీసులు విచారణ చేసి చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.