
కొమురవెల్లి, వెలుగు: ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్లను ఎత్తివేయాలనే దురాలోచనలో బీజేపీ ఉందని జనగామ డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి విమర్శించారు. శుక్రవారం జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ లో భాగంగా కొమురవెల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మహదేవుని శ్రీనివాస్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. అంతకు ముందు జ్యోతిబాపూలే ఫొటోకు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా ఇచ్చిన హామీలను నెరవేర్చడమే లక్ష్యంగా కొత్త పథకాలను ప్రవేశపెడుతున్న ఘనత కాంగ్రెస్ పార్టీది అన్నారు.
బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని అవమానపరుస్తూ ప్రజల స్వేచ్ఛకు భంగం కలిగించేలా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. పార్లమెంట్ సాక్షిగా కేంద్ర మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై ప్రధాని మోదీ మాట్లాడకపోవడం సిగ్గుచేటన్నారు. మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మహదేవుని శ్రీనివాస్ మాట్లాడుతూ కాంగ్రెస్ప్రభుత్వం దేశంలోనే మొదటిసారిగా కుల గణన చేసి బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేసిందన్నారు. బీసీలను కించపరిచే విధంగా కల్వకుంట్ల కవిత మాట్లాడిందని ముందు జాగృతికి బీసీని అధ్యక్షుడిగా చేయాలని డిమాండ్‌చేశారు. కార్యక్రమంలో కో ఆర్డినేటర్ శ్రీనివాస్ రెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు, మండల, గ్రామాల పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.