బీజేపీకి ఢిల్లీ ఈ సారైనా అందేనా?

బీజేపీకి ఢిల్లీ ఈ సారైనా అందేనా?

దేశ రాజధాని ఢిల్లీలో బీజేపీ 1998 తర్వాత మళ్లీ అధికారంలోకి రాలేదు. ఆ తర్వాత జరిగిన అనేక రాష్ట్రాల ఎన్నికల్లో నేరుగానో, మిత్రులతో కలిసో గవర్నమెంట్లు ఏర్పాటు చేయగలిగింది. 2013 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో సింగిల్​ లార్జెస్ట్​ పార్టీగా నిలిచినా ఆప్​–కాంగ్రెస్​ పొత్తు వల్ల ప్రభుత్వ ఏర్పాటు కలగానే మిగిలిపోయింది. ప్రస్తుతం తెలంగాణ, ఏపీ, తమిళనాడు, ఒడిశా వంటి ఏడెనిమిది రాష్ట్రాలు మినహా దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాలూ  కమలనాథుల ఖాతాలో ఉన్నాయి. కానీ, ఢిల్లీని కైవసం చేసుకోవటమే కొంచెం కష్టసాధ్యంగా ఉంది. కేంద్రంలో వరుసగా రెండోసారి బీజేపీ పవర్​లోకి రాగలిగింది. అదే జోష్​లో ఈసారి ఎలాగైనా ఢిల్లీని హస్తగతం చేసుకోవాలని ఆశిస్తోంది.

ఈ క్రమంలో స్టేట్​ బీజేపీకి కొన్ని ఆటంకాలు ఎదురవుతున్నాయి. అధికార ఆమ్​ ఆద్మీ పార్టీ (ఆప్​) పడినట్టే పడి మళ్లీ పైకి లేస్తోంది. అసెంబ్లీ ఎలక్షన్​ దృష్ట్యా ఈ ప్రాంతీయ పార్టీ ప్రజలకు రోజుకొక ఉచిత వరం ప్రకటిస్తోంది. ఆప్ వరాలకు కౌంటర్​ ఎలా వేయాలో రాష్ట్ర బీజేపీ లీడర్లకు అంతుచిక్కటం లేదు. గైడెన్స్​ కోసం హైకమాండ్​ వైపు చూస్తున్నారు. పర్మిషన్​లేని కాలనీల్లోని జనాన్ని ఆకట్టుకోవటానికి ప్రత్యేకంగా ఏదైనా స్కీం పెట్టాలని కేంద్రాన్ని కోరుతున్నారు. మోడీ సర్కారు మాత్రం ఈ విషయంలో ఇంకా ఏమీ తేల్చడం లేదు.

జిల్లాల నేతలతో కేంద్ర మంత్రుల భేటీ

ఢిల్లీ జనాల ఓట్లు కావాలంటే కేంద్రంలో మోడీ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను పబ్లిక్​లోకి తీసుకెళ్లాలని లోకల్​ లీడర్లకు సూచిస్తున్నారు. ఈ విషయంలో మరింత క్లారిటీ ఇవ్వడానికి ఢిల్లీ బీజేపీ ఎన్నికల ఇన్​చార్జి, కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి ప్రకాశ్​ జవదేకర్​ జిల్లా స్థాయి నాయకులతో ఇటీవల సమావేశమయ్యారు. ఇటీవల జరిగిన లోక్​సభ ఎన్నికల్లో ఢిల్లీలోని ఏడు ఎంపీ సీట్లనూ బీజేపీయే గెలుచుకుంది. లోకల్​ లీడర్​షిప్​ ఎక్కువగా సెంట్రల్​ గవర్నమెంట్​ స్కీమ్స్​ గురించే ప్రచారం చేసి లబ్ధి పొందింది. త్వరలో జరగబోయేవి అసెంబ్లీ ఎన్నికలు కాబట్టి, లోకల్​గా తాము ఏం చేస్తామో ప్రచారం చేసుకోవాలి. సెంట్రల్​ స్కీమ్​ల ప్రభావం పెద్దగా ఉండదంటున్నారు. అధికార పార్టీ (ఆప్​) మాత్రం సిటీలోని సమస్యలపైనే దృష్టి సారిస్తోంది.

పర్మిషన్​ లేని​ కాలనీలపైనే ఆశలు

ఢిల్లీలో గుర్తింపులేని కాలనీల సంఖ్య చాలా ఎక్కువ. అక్కడి ప్రజలు వివిధ రాజకీయ పార్టీలకు​ మేజర్​ ఓట్​ బ్యాంక్​. సిటీ మొత్తం పాపులేషన్​లో 30–35 శాతం మంది జనాలు ఈ కాలనీల్లోనే ఉంటారు. అందువల్ల వాళ్లను ప్రసన్నం చేసుకోవాలంటే ఆ కాలనీలకోసం స్పెషల్​గా ఒక పథకం కావాలని బీజేపీ సెంట్రల్ లీడర్​షిప్​ను అడుగుతున్నారు. దీనిపై ఏదోక నిర్ణయం తీసుకొని ప్రకటించేవరకు ఎవరూ పబ్లిక్​గా కామెంట్లు చేయొద్దని హైకమాండ్​ సూచిస్తోంది. దీన్నిబట్టి ఢిల్లీ ఎన్నికలనాటికి మోడీ సర్కారు ఏదైనా ఒక స్కీం రూపొందించే ఛాన్స్​ ఉంది.