వన్ నేషన్..వన్ ఎలక్షన్.. రామ్ నాథ్ కోవింద్ తో జేపీ నడ్డా భేటీ

దేశంలో ఒకే దేశం..ఒకే ఎన్నికకు సంబంధించి మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ నేతృత్వంలో ప్రత్యేక కమిటీని కేంద్రం నియమించింది. దేశంలో పార్లమెంటరీ లోక్ సభ ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభ ఎన్నికలను ఒకేసారి నిర్వహించడం సాధ్యమేనా అనే అంశంపై ఈ ప్రత్యేక కమిటీ అధ్యయనం చేసి నివేదిక ఇవ్వనుంది. అయితే ఈ ప్రకటన చేసిన కొన్ని గంటల్లోనే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మాజీ  రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తో భేటీ అవడం ప్రస్తుతం సంచలనంగా మారింది. 

లోక్ సభతో పాటు..అన్ని రాష్ట్రాలకు ఒకే సారి ఎన్నికల నిర్వహించే అంశంపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.  జమిలి ఎన్నికల ప్రతిపాదనపై అధ్యయనానికి సెప్టెంబర్ 1వ తేదీన శుక్రవారం కమిటీని ఏర్పాటు చేసింది. మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను ఈ కమిటీకి అధ్యక్షుడిగా 16 మందిని సభ్యులుగా  నియమించింది. ఈ కమిటీ  జమిలి ఎన్నికల నిర్వహణపై అధ్యయనం చేసి ఆ నివేదికను కేంద్రానికి సమర్పించనుంది. అయితే సెప్టెంబరు 18 నుంచి 22 వరకూ ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు నిర్వహించనున్నట్టు కేంద్రం ప్రకటన చేసిన తర్వాతి రోజే ఈ  జమిలీ ఎన్నికలపై కేంద్రం కమిటీని ఏర్పాటు చేయడం గమనార్హం. 

జమిలీ ఎన్నికలు నిర్వహించాలంటే రాజ్యాంగంలో కనీసం ఐదు అధికరణలను సవరించాల్సి ఉంటుందని  కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌రామ్‌ మేఘ్‌వాల్‌ రాజ్యసభలో వెల్లడించారు. అయితే  ఆ సవరణల కోసమే సెప్టెంబర్ 18 నుంచి 22 వరకు ఐదు రోజుల పాటు  ప్రత్యేక సమావేశాలు నిర్వహించనుందనే టాక్ వినిపిస్తోంది. ఈ సమావేశాల్లో  రాజ్యాంగంలోని ఐదు అధికరణలను సవరించి..జమిలి  బిల్లు తీసుకొచ్చే అవకాశాలున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.   ఈ ప్రత్యేక సమావేశాల్లో మొత్తం 10 కి పైగా కీలక బిల్లులను ప్రవేశపెట్టి వాటికి ఆమోదం తెలిపే అవకాశం ఉందని సమాచారం.

ALSO READ:470 కేజీల వెండితో పవన్ చిత్రం.. పవన్ ఫ్యాన్సా మజాకా!

దేశంలో జమిలి ఎన్నికల నిర్వహణపై కేంద్రంతో పాటు ప్రధాని మోదీ కూడా పలుమార్లు సానుకూలంగా మాట్లాడారు. 2014లో  బీజేపీ జమిలి ఎన్నికల నిర్వహణను తమ మ్యానిఫెస్టోలో కూడా పెట్టింది. ఆ తర్వాత బీజేపీ  అధికారంలోకి వచ్చాక లా కమిషన్ కు జమిలి ఎన్నికలపై అధ్యయనం చేసే బాధ్యత అప్పగించింది. దీంతో లా కమిషన్ తన అధ్యయనం కూడా పూర్తి చేసినట్లు తెలుస్తోంది. ఈ నివేదిక త్వరలో కేంద్రానికి అందబోతోంది. అదే సమయంలో రామ్ నాథ్ కోవింద్ కమిటీ అధ్యయన నివేదికను పరిశీలించి.. పార్లమెంట్ సమావేశాల్లో బిల్లు పెట్టే అవకాశాలున్నాయి సమాచారం. 

ఎన్నికల కమిషన్ ప్రకటించిన  షెడ్యుల్ ప్రకారం ఈ ఏడాది  డిసెంబ‌రులో  తెలంగాణ‌, ఛ‌త్తీస్‌గ‌ఢ్, రాజస్ధాన్, మ‌ధ్యప్రదేశ్, మిజోరం రాష్ట్రాల అసెంబ్లీకి ఎన్నిక‌లు జరగనున్నాయి.  ఆ త‌ర్వాత మరో ఆరు నెలల్లో అంటే 2024 మేలో  సార్వత్రిక ఎన్నిక‌లతో పాటు ఏపీ, ఒడిశా సహా మరో 4 రాష్ట్రాల ఎన్నిక‌లు జరగనున్నాయి. వీటితో పాటే జమ్మూ కశ్మీర్ ఎన్నికలు కూడా నిర్వహిస్తామని తెలుస్తోంది. ఈ లెక్కన పది రాష్ట్రాల ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే  నాలుగు నెలల వ్యవధిలో రెండుసార్ల ఎన్నికల నిర్వహణ ఖర్చు కూడుకున్నది. ఈ క్రమంలో ఎప్పటి నుంచో జమిలి ఎన్నికల ప్రతిపాదన  ఉంది. పైగా బీజేపీ మేనిఫెస్టోలో పెట్టింది. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని  అన్నింటినీ ఒకేసారి పెడితే ఎలా ఉంటుందన్న ఆలోచనలో కేంద్ర పెద్దలో ఉంది.  అటు  మహారాష్ట్రలో రాజకీయాల్లోనూ అనిశ్చితి నెలకుంది. దీంతో  అన్నీ కలిపి పెట్టాలన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.