- దీపావళి, రక్షా బంధన్‌కు 2 సిలిండర్లు ఉచితం
- బీజేపీ జార్ఖండ్ అసెంబ్లీఎన్నికల మేనిఫెస్టో రిలీజ్
- వితంతువులు,దివ్యాంగులకు 2,500 పెన్షన్
- అధికారంలోకి వస్తే యూనిఫాం సివిల్ కోడ్ అమలు: అమిత్‌షా
- ఏటా రెండు సిలిండర్లు ఉచితం
- గర్భిణులకు రూ.21 వేలు
- గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్‌కు రూ.2 వేల స్టైఫండ్
రాంచీ: జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బీజేపీ ఉచిత హామీల జల్లు కురిపించింది. రూ. 500 కే సిలిండర్‌తోపాటు ఏటా దీపావళి, రక్షాబంధన్‌కు ఉచితంగా రెండు సిలిండర్లు అందజేస్తామని హామీ ఇచ్చింది. జార్ఖండ్‌లో తమ పార్టీని ప్రజలు ఆదరిస్తే నిరుద్యోగ యువత కోసం 2.87 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీసహా 5 లక్షల ఉద్యోగ అవకాశాలను సృష్టిస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా వెల్లడించారు. జేఎంఎం నేతృత్వంలోని ప్రభుత్వం రద్దు చేసిన మహిళల పేరిట రూ.50 లక్షల వరకు ఆస్తికి రూ. 1 స్టాంప్ డ్యూటీ స్కీమ్‌ను పునరుద్ధరిస్తామని తెలిపారు. 25వేల కిలోమీటర్ల మేర హైవేలను నిర్మిస్తామని, ప్రతి జిల్లా ప్రధాన కార్యాలయాన్ని రాంచీతో అనుసంధానం చేసేందుకు రైల్వే నెట్‌వర్క్‌ను విస్తరిస్తామని హామీ ఇచ్చారు.
ఆదివారం రాంచీలో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న అమిత్ షా ‘సంకల్ప్ పత్ర’ పేరుతో బీజేపీ అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. “రూ.500కే సిలిండర్ ఇస్తం. ఏటా రెండు ఉచితంగా అందజేస్తం. రాష్ట్రంలో 10 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తం. 70 ఏండ్లు దాటిన వృద్ధులకు ఆయుష్మాన్ భారత్జీవన్ధార యోజన కింద లభించే కవరేజీని రూ.5లక్షల నుంచి రూ.10 లక్షలకు, పీహెచ్‌సీలు, సీహెచ్‌సీల్లో బెడ్ల సంఖ్యను 25వేలకు పెంచుతాం. పీఎం ఆవాస్ యోజనా కింద 21 లక్షల ఇండ్లను నిర్మిస్తం.
వితంతువులు, దివ్యాంగులకు రూ.2,500 పెన్షన్ ఇస్తాం. మాతృత్వ సురక్షా యోజన కింద గర్భిణులకు ఆరు న్యూట్రిషన్ కిట్స్, రూ.21వేలు సాయం అందజేస్తం. పేదలు, వెనుకబడిన తరగతుల్లోని బాలికలకు కేజీ టు పీజీ వరకు ఉచిత విద్య అందిస్తం. ‘గోగో దీదీ’ స్కీమ్ కింద మహిళలకు ప్రతినెలా రూ.2,100 సాయం చేస్తం. ప్రతినెలా 11వ తారీఖునే మహిళల అకౌంట్లలో డబ్బులు జమచేస్తం. గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్‌కు రెండేండ్ల వరకూ రూ.2 వేలు స్టైఫండ్ అందజేస్తం” అని అమిత్ షా వివరించారు.
జార్ఖండ్‌లో యూసీసీ కోడ్..
తమ పార్టీ అధికారంలోకి వస్తే జార్ఖండ్‌లో యూనిఫాం సివిల్‌కోడ్(యూసీసీ) అమలు చేస్తామని అమిత్ షా వెల్లడించారు. దీనికి గిరిజనులను దూరంగా ఉంచుతామని తెలిపారు. రాష్ట్రంలోకి అక్రమంగా చొరబడుతున్నవారిని తరిమికొడ్తామని అన్నారు. పరిశ్రమలు, గనుల వల్ల నిర్వాసితులుగా మారిన ప్రజల పునరావాసం కోస డిస్ప్లేస్మెంట్ కమిషన్‌ను ఏర్పాటు చేస్తామన్నారు.
సోరెన్ పాలనలో నేరాలు పెరిగినయ్
సోరెన్ పాలనలో రాష్ట్రంలో ఐదేండ్లలో నేరాల సంఖ్య 29 శాతం పెరిగిందని, అవినీతి గణనీయంగా పెరిగిపోయిందని అమిత్ షా తెలిపారు. ఈ కాలంలోనే రేప్ కేసులు 42% పెరగడం ఆందోళన కలిగిస్తున్నదని చెప్పారు. హిందువులపై దాడులు జరుగుతున్నాయని, బుజ్జగింపులు తారాస్థాయికి చేరాయని, జార్ఖండ్ అత్యంత అవినీతి రాష్ట్రంగా ఉందని ఆరోపించారు.
రెండేండ్లలో నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలిస్తం
రాబోయే రెండేండ్లలో రాష్ట్రం నుంచి నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలిస్తామని, 2027 నాటికి మానవ అక్రమ రవాణాను అంతం చేస్తామని అమిత్‌షా తెలిపారు. ఇందుకోసం 'ఆపరేషన్ సురక్ష' అనే కార్యక్రమాన్ని ప్రకటించారు. ాష్ట్రంలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పేపర్ లీక్‌లపై సీబీఐ, సిట్ విచారణ జరిపిస్తామని, దోషులను కటకటాల్లోకి పంపుతామని పేర్కొన్నారు.