ఓట్ల కోసమే టీఆర్ఎస్ పై దుష్ప్రచారం: హరీశ్ రావు 

చండూరు(నాంపల్లి), వెలుగు: మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ మునిగిపోవడం ఖాయమని మంత్రి హరీశ్ రావు అన్నారు. ఓడిపోతామన్న ఫ్రస్ట్రేషన్ తోనే ఆ పార్టీ నాయకులు మునుగోడు మండలం పలివెలలో ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారని, టీఆర్ఎస్ దాడులు చేసిందని ప్రచారం చేస్తూ ఓట్లు పొందాలని చూస్తున్నారని ఆరోపించారు. మంగళవారం నాంపల్లి, చండూరు మండలాల్లో జరిగిన రోడ్ షోల్లో హరీశ్ రావు మాట్లాడారు. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి  నీళ్లు ఇచ్చిన సీఎం కేసీఆర్ వెంటే అందరూ నడవాలన్నారు. టీఆర్ఎస్ ను ఆశీర్వదిస్తే ప్రాజెక్టులను పూర్తిచేసి ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తామన్నారు.

మహిళా సంఘాలకు భవనాలను నిర్మిస్తామన్నారు. ప్రధాని మోడీ ప్రభుత్వం గ్యాస్, పెట్రోల్ ధరలను పెంచి సామాన్యుల జీవితాలను ఆగం చేసిందన్నారు. బోరు బావులకు మీటర్లు పెట్టాలని చూస్తోందన్నారు. బీజేపీకి ఓటు వేస్తే మోసపోయి గోసపడతామని హెచ్చరించారు. ఉచితాలు వద్దు అని చెప్తున్న బీజేపీని రాజకీయంగా సమాధి చేయాలన్నారు. కాంగ్రెస్ కు వేస్తే ఆ ఓటు మురిగిపోతుందన్నారు. వందల కోట్లతో ఎమ్మెల్యేలను కొనాలని చూసిన బీజేపీని సీఎం కేసీఆర్ దెబ్బ కొడితే దిమ్మ తిరిగిందన్నారు. ప్రజలను మోసం చేసిన రాజగోపాల్ రెడ్డిని ఓడించి బుద్ధి చెప్పాలన్నారు. కార్యక్రమంలో మునుగోడు టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే ఆరూరి రమేష్ తదితరులు పాల్గొన్నారు.