న్యూఢిల్లీ: ఆప్ చీఫ్ అర్వింద్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నివసించిన బంగ్లా ఎదుట బీజేపీ నిరసనలు చేపట్టింది. కేజ్రీవాల్ తాను ఉండేందుకు ఈ బంగ్లా రెనోవేషన్, రిపేర్లు, ఫర్నిచర్ కోసం రూ.45 కోట్లు ఖర్చు చేసి ‘శీష్ మహల్’ (అద్దాల మహల్)గా మార్చుకున్నారని బీజేపీ ఆరోపిస్తున్నది. ఇందులో భాగంగా గురువారం ఢిల్లీ బీజేపీ ఛీప్వీరేంద్ర సచ్‌దేవా, సోమవారం బీజేపీలో చేరిన ఆప్ నేత కైలాష్ గెహ్లాట్ ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళనలో పెద్దసంఖ్యలో పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లపైకి ఎక్కి మరి నినాదాలు చేశారు.
దీంతో పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకొని.. నిరసన కారులను అక్కడి నుంచి పంపేశారు. ఈ సందర్భం సచ్‌దేవా మాట్లాడుతూ.. కోట్లాది రూపాయల ప్రజాధనంతో కేజ్రీవాల్ తన కోసం శీష్ మహల్రూపొందించుకున్నారని ఆరోపించారు. అందులో బంగారు పూత పూసిన టాయిలెట్ సీట్లు, వాష్ బేసిన్‌లు అమర్చారని. రూ.27 లక్షల ఖర్చుతో కూడిన టీవీ సెట్ పెట్టించుకున్నారని ఆరోపించారు. తమది సామాన్యుడి పార్టీ అనే కేజ్రీవాల్ ఈ విషయాలన్ని ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు.