
- రెండో ప్రాధాన్య ఓట్ల లెక్కింపుతో శ్రీపాల్‌రెడ్డి గెలుపు
- కరీంనగర్లో స్లోగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓట్ల కౌంటింగ్
- సోమవారం అర్ధరాత్రికి కూడా పూర్తవని ఓట్ల కట్టలు కట్టడం
- ఇయ్యాల ఉదయం వరకు కొనసాగే చాన్స్.. ఆ తర్వాతే లెక్కింపు
- గ్రాడ్యుయేట్ ఓట్లలో వేలాదిగా ఇన్ వ్యాలిడ్!
కరీంనగర్ / నల్గొండ, వెలుగు:రాష్ట్రంలో జరిగిన రెండు టీచర్, ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కరీంనగర్, నల్గొండలోని కౌంటింగ్ కేంద్రాల్లో సోమవారం ఉదయం ప్రారంభమైంది. కరీంనగర్- – మెదక్ – నిజామాబాద్ -– ఆదిలాబాద్ టీచర్స్ ఎమ్మెల్సీగా బీజేపీ అభ్యర్థి మల్క కొమరయ్య విజయం సాధించారు. వరంగల్– ఖమ్మం– నల్గొండ టీచర్ ఎమ్మెల్సీగా పీఆర్టీయూ అభ్యర్థి పింగళి శ్రీపాల్‌రెడ్డి గెలుపొందారు. మల్క కొమరయ్య మొదటి ప్రయార్టీ ఓట్లతోనే గెలిచారు. వరంగల్–ఖమ్మం-–నల్గొండ టీచర్ ఎమ్మెల్సీ స్థానంలో మొదటి ప్రయార్టీ ఓట్లతో ఫలితం తేలకపోవడంతో రెండో ప్రయార్టీ ఓట్ల కౌంటింగ్‌తో శ్రీపాల్‌రెడ్డి విజయం సాధించారు.
మరోవైపు కరీంనగర్--–మెదక్-–నిజామాబాద్--–ఆదిలాబాద్ గ్రాడ్యుయేట్ఎమ్మెల్సీ ఓట్ల కౌంటింగ్ జరుగుతున్నది. కరీంనగర్లో సాగుతున్న ఈ కౌంటింగ్స్లోగా నడుస్తున్నదని విమర్శలు వస్తున్నాయి. సోమవారం ఉదయం ఎనిమిది గంటలకే కౌంటింగ్ మొదలైనప్పటికీ.. రాత్రి పొద్దుపోయే దాకా ఓట్ల కట్టలు కట్టడం పూర్తికాలేదు. మంగళవారం ఉదయం వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుందని అంచనా వేస్తున్నారు.
సునాయాసంగా మల్క..
కరీంనగర్-–మెదక్–నిజామాబాద్–ఆదిలాబాద్ టీచర్స్ ఎమ్మెల్సీ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన మల్క కొమరయ్య మొదటి ప్రయార్టీ ఓట్లతోనే విజయం సాధించారు. ఈ టీచర్ ఎమ్మెల్సీ నియోజకవర్గంలో మొత్తం 25,041 ఓట్లు పోల్ కాగా ఇందులో 24,144 ఓట్లు చెల్లుబాటు అయ్యాయి. 897 ఓట్లు చెల్లకుండా పోయాయి. గెలుపు కోటా ఓట్లు 12,073 రావాల్సి ఉండగా..- 12,959 ఫస్ట్ ప్రయార్టీ ఓట్లతో మల్క కొమరయ్య విజయం సాధించారు.
తన సమీప పీఆర్టీయూ అభ్యర్థి వంగ మహేందర్ రెడ్డికి 7,182 ఓట్లు, యూటీఎఫ్ టీపీటీఎఫ్ అభ్యర్థి అశోక్ కుమార్ కు- 2,621 ఓట్లు వచ్చాయి. సిట్టింగ్ ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డికి 428 ఓట్లు మాత్రమే రావడం గమనార్హం. అయితే బ్యాలెట్ బాక్స్ లు ఓపెన్ చేసి ఫస్ట్ ప్రయార్టీ ఓట్లను కట్టలు కట్టేటప్పుడే మల్క కొమరయ్య విజయం ఖాయమైందని కొందరు అభ్యర్థులు, ఏజెంట్లు అంచనాకు వచ్చారు.
ఉత్కంఠ పోరులో శ్రీపాల్
వరంగల్–ఖమ్మం–నల్గొండ టీచర్ ఎమ్మెల్సీ నియోజకవర్గంలో మొత్తం 24,135 ఓట్లు పోలయ్యాయి. ఇందులో 494 ఓట్లు చెల్లలేదు. మొత్తం 23,641 ఓట్లు చెల్లుబాటు అయ్యాయి. గెలుపు కోటా ఓట్లు 11,231 గా తేలింది. ఫస్ట్ ప్రయార్టీ ఓట్లలో శ్రీపాల్ రెడ్డికి 6,035, అలుగుబెల్లి నర్సిరెడ్డికి 4,820, హర్షవర్ధన్ రెడ్డికి 4,437, మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్ కు 3,115, సరోత్తం రెడ్డికి 2,289, సుందర రాజ్ యాదవ్ కు 2,040 ఓట్లు వచ్చాయి.
దీంతో ఎలిమినేషన్ పద్ధతిలో రెండో ప్రాధాన్యత ఓట్ల కౌంటింగ్ప్రారంభించారు. మొత్తం 19 మందిలో అభ్యర్థులలో 17 మంది ఎలిమినేట్ అయిన తర్వాత శ్రీపాల్ రెడ్డికి 11,099 ఓట్లు, అలుగుబెల్లి నర్సిరెడ్డికి 8,448 ఓట్లు వచ్చాయి. దీంతో శ్రీపాల్ రెడ్డి 2,651 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు.
స్లోగా గ్రాడ్యుయేట్ ఓట్ల కౌంటింగ్..
కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కౌంటింగ్ ప్రక్రియ స్లోగా సాగింది. సోమవారం రాత్రి పొద్దుపోయే వరకు కూడా ఓట్లు కట్టలు కట్టడం పూర్తి కాలేదు. మంగళవారం ఉదయం వరకు ఈ ఓట్లను కట్టలు కట్టే ప్రక్రియ కొనసాగే పరిస్థితి కనిపిస్తున్నది. వ్యాలిడ్ ఓట్లు, ఇన్ వ్యాలిడ్ ఓట్లను వేరు చేస్తున్న సందర్భంలో అధికారులతో పలువురు అభ్యర్థులు వాగ్వాదానికి దిగినట్లు తెలిసింది. కౌంటింగ్ కోసం మొత్తం 800 మంది సిబ్బందిని నియమించినప్పటికీ.. తీవ్ర జాప్యం జరుగుతున్నది. ఎన్నికల సంఘం, కలెక్టర్ పనితీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
లక్ష ఓట్లలోనే సుమారు ఎనిమిది వేల ఓట్ల వరకు చెల్లకుండా పోయాయని తెలిసింది. ఓటింగ్ విధానంపై అవగాహన కల్పించడంలో కలెక్టర్, ఎన్నికల సంఘం విఫలమయ్యారని.. అలాగే చిన్న చిన్న కారణాలు చూపి ఓట్లను ఇన్ వ్యాలిడ్ చేశారని అభ్యర్థులు విమర్శించినట్టు సమచారం. గ్రాడ్యుయేట్ ఓట్ల కట్టలు కట్టే ప్రక్రియ మంగళవారం మధ్యాహ్నం వరకు కొనసాగే పరిస్థితి కనిపిస్తోందని బీజేపీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి అన్నారు. మరోవైపు బ్యాలెట్ పేపర్లో ఓటేసినప్పుడు అంకె ముందు సున్నా పెట్టిన వారి ఓట్లను ఇన్‌వాలీడ్ చేయకుండా గుర్తించాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి ఆర్వోకు వినతిపత్రం సమర్పించారు.
ఉపాధ్యాయుల విజయం: శ్రీపాల్ రెడ్డి
ఇది పూర్తిగా ఉపాధ్యాయుల విజయం. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా, టీచర్ల ఆత్మగౌరవాన్ని దెబ్బ తీయాలని చూసినా.. అంతిమంగా ఉపాధ్యాయులు విజయం సాధించారు. ఎమ్మెల్సీగా భవిష్యత్తులో విద్యారంగంలో తెలంగాణ దేశానికి ఆదర్శంగా ఉండేలా సూచనలిస్తూ
కృషి చేస్త.