కరీంనగర్లో బీజేపీ బహిరంగ సభ

బండి సంజయ్ 5వ విడత ప్రజాసంగ్రామ యాత్ర ముగింపు సభ కరీంనగర్ ఎస్ఆర్ఆర్ కాలేజీలో జరగుతోంది. ఈ సభకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరయ్యారు. ఇప్పటికే పార్టీ శ్రేణులు భారీగా తరలివచ్చారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి, ఎంపి అరవింద్,   మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ఇతర బీజేపీ ముఖ్య నేతలు హాజరయ్యారు.

కవితను దర్యాప్తు సంస్థలు ఎందుకు విచారిస్తున్నయ్: నడ్డా

 

సీఎం కేసీఆర్ కు కొడుకు, కూతురు, అల్లుడు తప్ప ఎవరూ కనిపించడం లేదని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. కుటుంబవాదాన్ని వ్యాపింపజేసే ప్రయత్నంలో భాగంగానే కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ పెట్టారని వ్యాఖ్యానించారు. కరీంనగర్ లో జరిగిన ప్రజాసంగ్రామ యాత్ర ముగింపు సభ లో నడ్డా మాట్లాడారు. క్షేత్ర స్థాయిలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రులు అవినీతి, అక్రమాలకు తెగబడ్డారని ఆరోపించారు. ధరణి పోర్టల్ ను వాడుకొని టీఆర్ఎస్ వాళ్లు అక్రమ సంపాదన పోగేస్తున్నారని మండిపడ్డారు. దర్యాప్తు సంస్థలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఎందుకు విచారిస్తున్నయ్ అని నడ్డా ప్రశ్నించారు. టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులంతా కలిసి తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారని చెప్పారు. తెలంగాణ సాధన కోసం అమరులైన వారి ఆశయాలకు కేసీఆర్ తూట్లు పొడుస్తున్నారని కామెంట్ చేశారు.

వెల్ నెస్ సెంటర్ల పేర్లను బస్తీ దవాఖానాలుగా మార్చేసిండు

‘‘ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వెల్ నెస్ సెంటర్ల పేర్లను బస్తీ దవాఖానాలుగా కేసీఆర్ మార్చేసిండు.. ఒరిజినల్ ను డూప్లికేట్ గా మార్చడం కేసీఆర్ కు వెన్నతో పెట్టిన విద్య..  డూప్లికేట్ ఎవరో , ఒరిజినల్ ఎవరో తెలంగాణ ప్రజలకు బాగా తెలుసు..’’ అని నడ్డా పేర్కొన్నారు. ‘‘సెప్టెంబరు 17న తెలంగాణ విమోచన దినోత్సవం జరగాలని కేసీఆర్ భావించడు.. ఎందుకంటే ఆయన ఓవైసీతో చేతులు కలిపాడు’’ అని అన్నారు.

విమోచన దినోత్సవాన్ని జరిపి తీరుతం

రజాకార్ల అరాచకాలను ప్రపంచానికి తెలియజేసేందుకు సెప్టెంబరు 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని మేం ఘనంగా జరిపి తీరుతమని స్పష్టం చేశారు. రూ.3,106 నిరుద్యోగ భృతి ఇస్తానని కేసీఆర్ ఇచ్చిన హామీ కాగితానికే పరిమితమైందన్నారు. ‘‘కేసీఆర్ ను కూకటి వేళ్లతో పెకిలించి పారేయగలిగేది బీజేపీ మాత్రమే. కుటుంబవాదాన్ని వ్యతిరేకంచే వాళ్లంతా తెలంగాణలో బీజేపీతో కలిసిరావాలి’’ అని నడ్డా పిలుపునిచ్చారు.

బీఆర్ఎస్ కు త్వరలోనే వీఆర్ఎస్: జేపీ నడ్డా

బీఆర్ఎస్ రానున్న రోజుల్లో వీఆర్ఎస్గా మారిపోయి అంతరించిపోతుందని బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా విమర్శించారు. చాలు దొర.. సెలవు దొర నినాదంతో జనంలోకి వెళ్తం.. కేసీఆర్ ప్రభుత్వానికి స్వస్తి పలుకుతామన్నారు. కరీంనగర్లో జరిగిన ప్రజాసంగ్రామ యాత్ర ముగింపు సభలో ఆయన ప్రసంగించారు. ఉట్టికి ఎగరలేనమ్మ.. స్వర్గానికి ఎగురుతాను అన్నట్లుగా కేసీఆర్ అతిగా ఆలోచిస్తుండన్నారు. ఒకప్పుడు మిగులు బడ్జెట్ రాష్ట్రంగా ఉన్న తెలంగాణను అప్పుల ఊబిలోకి నెట్టింది కేసీఆరే అని విమర్శించారు. 3.92 లక్షల కోట్ల లోటులో ప్రస్తుతం తెలంగాణ ఉందన్నారు.

రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు బీజేపీ వెంటే ఉంటారని నడ్డా అన్నారు.గత ఐదేళ్లలో కేంద్ర ప్రభుత్వం నిధులతో  తెలంగాణలో 4,996 కిలోమీటర్ల రహదారుల నిర్మాణం జరిగిందని తెలిపారు. ‘‘బీజేపీ యాత్రను అడ్డుకునేందుకు టీఆర్ఎస్ వాళ్లు ప్రయత్నించారు. వాళ్లకు నేనొకటి చెప్పదల్చుకున్న.. ఇది ప్రజాస్వామ్యం.. దీనిలో ఇతరుల గొంతు నొక్కే ప్రయత్నం జరగకూడదు.. ఒకవేళ గొంతు నొక్కే ప్రయత్నం చేస్తే ప్రజలు నిలువుగా బొందపెడ్తరని కేసీఆర్ తెలుసుకోవాలి’’ అని అన్నారు.

 

తెలంగాణకు బీఆర్ఎస్ తో సంబంధం లేదు: బండి సంజయ్

గడీల పాలనను బద్దలు కొట్టేందుకే పాదయాత్ర చేపట్టినట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెలిపారు. కేసీఆర్ పాలనలో ఏ వర్గానికి మేలు జరిగిందని ప్రశ్నించారు. కేసీఆర్ కుటుంబం భూమి, గ్రానైట్, సాండ్ స్కాంలకు పాల్పడుతోందని ఆరోపించారు. కేసీఆర్ జగన్ కలిసి రాష్ట్రాన్ని దోచుకుంటున్నారన్నారు. తెలంగాణ తల్లికి ద్రోహం చేసిన మూర్ఖుడు కేసీఆర్ అని విమర్శించారు.  బీఆర్ఎస్ పేరుతో తెలంగాణను పక్కనబెట్టారని..బీఆర్ఎస్ అంటే బందిపోట్ల రాష్ట్ర సమితి అని అన్నారు.

కేంద్రం ఇచ్చిన నిధులను కేసీఆర్ దారి మళ్లిస్తున్నారని బండి సంజయ్ అన్నారు. డబుల్ బెడ్రూమ్ లతో ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. బీజేపీ వచ్చాక ప్రతి పేదోడికి ఇల్లు కట్టిస్తామన్నారు. కేసీఆర్ పాలనలో ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని.. బీజేపీ అధికారంలోకి రాగానే ప్రతి నెల ఒకటో తారీఖు జీతాలు ఇస్తామని తెలిపారు.ధరణి పేరుతో ప్రభుత్వ భూములను కబ్జా చేస్తున్నారని అన్నారు.

కార్యకర్తల కష్టంతోనే ఈ స్థాయికి ఎదిగా: బండి సంజయ్

కరీంనగర్ గడ్డ తనకెంతో ఇచ్చిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. హిందూ ధర్మ రక్షణ కోసం నిరంతరం పనిచేస్తానని తెలిపారు. కరీంనగర్ లో జరుగుతున్న ప్రజాసంగ్రామయాత్ర ముగింపుసభలో ఆయన భావోద్వేగంతో మాట్లాడారు. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో  తాను ఓడిపోతే కార్యకర్తలు ఏడ్చారని..దానిపై దేశం అంతా చర్చ జరిగిందన్నారు.

కరీంనగర్ గడ్డ బీజేపీ అడ్డా అని..కార్యకర్తల కష్టం వల్లే తాను గెలిచానని చెప్పారు.  అవమానాలకు తాను భయపడనని చెప్పారు.  కరీంనగర్ ప్రజలకు ఎల్లవేళలా రుణపడి ఉంటానని స్పష్టం చేశారు. పింక్ జెండాతో అపవిత్రమైన తెలంగాణను కాషాయ జెండాతో పవిత్రం చేయమని జాతీయ నాయకత్వం సూచించిందని తెలిపారు. పింక్ జెండాతో అపవిత్రమైన తెలంగాణను కాషాయ జెండాతో పవిత్రం చేయమని జాతీయ నాయకత్వం సూచించిందని తెలిపారు. అందుకే ప్రజాసంగ్రామ యాత్ర చేపట్టినట్లు తెలిపారు

కరీంనగర్ లో బండి సంజయ్ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు

కరీంనగర్ పార్లమెంటరీ పరిధిలో బండి సంజయ్ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని బీజేపీ అధికార ప్రతినిధి రాణి రుద్రమ తెలిపారు. కరోనా సమయంలో ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్, వైద్య పరికరాల కోసం 3కోట్లు అందజేశారన్నారు. కరీంనగర్ పార్లమెంటరీలో జాతీయ రహదారుల నిర్మాణానికి  5వేల 751 కోట్ల నిధులు తీసుకొచ్చారని తెలిపారు. సీఆర్ఐఎఫ్ ద్వారా 216 కోట్లతో పాటు 30 కోట్లతో గ్రామీణ రహదారులను అభివృద్ధి చేశారన్నారు. కరీనంగర్ చొప్పదండి మార్గంలో రైల్వేగేట్ వద్ద రోడ్ ఓవర్ బ్రిడ్జికు కేంద్రం నుంచి 100 కోట్లు తీసుకొచ్చారని చెప్పారు. 

ఎస్ఆర్ఆర్ డిగ్రీ కాలేజీకి అటానమస్ హోదా తీసుకొచ్చినట్లు తెలిపారు. రుక్మాపూర్లో సైనిక స్కూల్ ఏర్పాటుకు కృషి చేశారని తెలిపారు. పాఠశాలల్లో భవన నిర్మాణాలు, మౌలిక సదుపాయాల కోసం సర్వశిక్షఅభియాన్ కింద 46 కోట్లు తీసుకొచ్చారన్నారు. మధ్యాహ్న భోజనం పథకం కోసం 19కోట్ల నిధులు, ఉపాధిహామి కోసం 612 కోట్ల నిధులు కేంద్రం నుంచి తీసుకొచ్చారని తెలిపారు

ఎన్నికల కంటే ముందే టీఆర్ఎస్ ఖతమైంది : ఎంపీ అర్వింద్

 

ఎన్నికల కంటే ముందే టీఆర్ఎస్ ఖతమైందని ఎంపీ  ధర్మపురి అరవింద్  అన్నారు. హామీల అమల్లో కేసీఆర్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. బీజేపీకి, మోడీకి వ్యతిరేకంగా కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీని పెట్టారన్నారు.  కరీంనగర్ లో బండి సంజయ్ ఐదో ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభలో అరవింద్  మాట్లాడారు.  బీఆర్ఎస్ కు సిద్దాంతం, ఎజెండా అంటూ ఏమీ లేదని, కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకునేందుకే బీఆర్ఎస్ ఏర్పాటని ఆరోపించారు. ఈ విషయం కార్యకర్తలకు తెలిసింది కానీ..నాయకులే మేల్కోవాలన్నారు. 

బీఆర్ఎస్ తో కేసీఆర్... దేశమంతా తిరుగుతూ కేటీఆర్ కు రాష్ట్రం అప్పగిస్తాడట.. సినీ నటులతో, రాత్రి మ్యూజిక్ లు వినడం తప్ప కేటీఆర్ ప్రజల్లోకి రాడని అరవింద్ అన్నారు.  ఇక మొన్నటి దాకా తనని వేటాడి, వెంటాడ ఓడిస్తానన్న కవిత.. ఇప్పుడు తన తండ్రి చెప్పిన చోట పోటీ చేస్తుందట..  కవిత  తన మీద పోటీ చేయాలని,  దైర్యం లేకపోతే కేసీఆర్ ను ఇందూరు నుంచి పోటీకి దిగామని చెప్పాలని అరవింద్  డిమాండ్ చేశారు. బీజేపీ వస్తేనే అవినీతి రహిత పాలన వస్తుందని, డబుల్ ఇంజన్ సర్కారు లక్ష్యంగా పని చేద్దామని ప్రజలకు పిలుపునిచ్చారు. 

 

నిధులు ఇవ్వకపోయినా బీసీలు ఓటు వేస్తారని కేసీఆర్ ధీమా: బూర

కరీంనగర్: బీసీలు ఆర్థికంగా ఎదిగితే తన మాట వినరని సీఎం కేసీఆర్  అనుకుంటున్నారని మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ వ్యాఖ్యానించారు. నిధులు ఇవ్వకపోయినా బీసీలు ఓటు వేస్తారనే ధీమాలో కేసీఆర్ ఉన్నారని..బీసీల సంక్షేమం కోసం రాష్ట్ర బడ్జెట్లో కేసీఆర్ కేటాయించింది కేవలం రూ.239 కోట్లేనని గుర్తు చేశారు. ఇటువంటి దురుద్దేశంతో ఉన్న కేసీఆర్ కు బీసీలు ఓటు ఎందుకు వేయాలని ప్రశ్నించారు. కరీంనగర్ లో ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభలో మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో ఓట్ల కోసం వెళ్తే పాత హామీలపై ప్రజలు ప్రశ్నిస్తారనే భయంతోనే.. తన పార్టీ పేరును బీఆర్ఎస్ గా కేసీఆర్ మార్చుకున్నారని తెలిపారు. ఒకవేళ ప్రజలు గత హామీల గురించి అడిగితే.. రద్దయిపోయిన టీఆర్ఎస్ పార్టీనే ఆ హామీలు అడగాలని, తమను అడగొద్దని కేసీఆర్ చెబుతారని పేర్కొన్నారు.

కోటి ఓట్లు... 90 సీట్లు..

కోటి ఓట్లు... 90 సీట్లు.. ప్రగతి భవన్ లో బీజేపీ స్లాటు నినాదంతో పార్టీ శ్రేణులు ముందుకు పోవాలన్నారు. ‘‘ అందరి తెలంగాణ.. అభివృద్ధి తెలంగాణ.. ఆత్మ గౌరవ తెలంగాణ కోసం మేం ఆనాడు తెలంగాణ ఉద్యమం చేశాం.కానీ ఇప్పుడు కేసీఆర్ సర్కారు బీసీలను విస్మరిస్తుంటే బాధేస్తోంది. కుల వృత్తులంటే కేసీఆర్ కు ఎందుకంత వివక్ష... రాష్ట్రంలో కుల వృత్తులపై ఆధారపడి 6 లక్షల కుటుంబాలు నడుస్తున్నాయి.. వారిని ఆదుకునే కార్పొరేషన్ పెట్టాలనే సోయి కూడా కేసీఆర్ కు లేదు’’ అని బూర నర్సయ్య గౌడ్ చెప్పారు. రాష్ట్ర ప్రజలను అడుక్కునే స్థితిలో ఉంచాలనే దుర్భుద్ధితో కేసీఆర్ ఉన్నారని కామెంట్ చేశారు. మోడీ వ్యాక్సిన్ తోనే దేశానికి బీఆర్ఎస్ పీడ విరగడ అవుతుందన్నారు.