- హామీల అమలు నుంచి తప్పించుకుంటున్నది
- హైదరాబాద్ ప్రజలు కాంగ్రెస్కు ఓటు వేయలేదన్న అక్కసుతోనే కూల్చివేతలు చేపట్టారని కామెంట్
న్యూఢిల్లీ, వెలుగు: ప్రజలకు ఇచ్చిన హామీల అమలు నుంచి తప్పించుకునేందుకే కాంగ్రెస్ సర్కారు హైడ్రా పేరుతో డ్రామాలు ఆడుతోందని బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ విమర్శించారు. ఎన్నికల టైంలో ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపించడం, అధికారంలోకి వచ్చాక మొండిచేయి చూపడం కాంగ్రెస్ కు కొత్త కాదని ఆయన అన్నారు. హిమాచల్ ప్రదేశ్, కర్నాటక, తెలంగాణలో ఇచ్చిన గ్యారంటీలను అమలు చేయకుండా ప్రజల దృష్టి మరల్చే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. మంగళవారం ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో మీడియాతో లక్ష్మణ్ మాట్లాడారు.
అవినీతి, కుటుంబ పాలన, బంధుప్రీతి, మైనారిటీ బుజ్జగింపు రాజకీయాలు, రాష్ట్రాన్ని దేశాన్ని విచ్చిన్నం చేసే శక్తులకు కాంగ్రెస్ గ్యారంటీగా మారిందని ఆరోపించారు. ఓట్ల కోసం ప్రజలను ఎలా దగా చేశారో చెప్పేందుకు తెలంగాణ ఒక ఉదాహరణ అని చెప్పారు. ‘‘రైతుబంధుతో పాటు అన్ని స్కీములను రేవంత్ సర్కారు బంద్ పెట్టింది. రేవంత్ రెడ్డి ఇంకా ప్రతిపక్ష నాయకుడిగా వ్యవహరిస్తున్నారు. అధికారంపై సీఎం పట్టు సాధించలేకపోతున్నారు. అధికారంలోకి వచ్చిన తొమ్మిది నెలల్లోనే కాంగ్రెస్ సర్కారుపై ప్రజల్లో వ్యతిరేకత మొదలైంది” అని లక్ష్మణ్ అన్నారు.
మూసీ సుందరీకరణ పేరుతో ఢిల్లీకి కప్పం
మూసీ సుందరీకరణ పేరుతో ఢిల్లీకి కప్పం కట్టే ప్రయత్నం జరుగుతున్నదని లక్ష్మణ్ ఆరోపించారు. రూ.లక్ష కోట్లతో మూసీ సుందరీకరణ చేపట్టాల్సిన అవసరం ఏం వచ్చిందని ప్రశ్నించారు. అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్ ప్రజలు కాంగ్రెస్ కు ఓటు వేయలేదనే అక్కసుతోనే కూల్చివేతలు చేస్తున్నారని ఆరోపించారు.