రిజర్వేషన్లు ఎత్తేసేందుకు కాంగ్రెస్ కుట్ర

 రిజర్వేషన్లు ఎత్తేసేందుకు కాంగ్రెస్ కుట్ర
  • అందుకే జీవో 29 తెచ్చారు: ఎంపీ లక్ష్మణ్

న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణలో రిజర్వేషన్లు ఎత్తేసేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కుట్ర చేస్తోందని, అందుకే గ్రూప్–1 పరీక్షల్లో జీవో 29ని తెరపైకి తెచ్చారని బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ ఆరోపించారు. ఈ నిబంధన రూల్ ఆఫ్ రిజర్వేషన్లను ఉల్లఘించి నిరుద్యోగులను మోసం చేయడమేనన్నారు. 

ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలని చెప్పి... ఇప్పుడు ప్రశ్నిస్తున్న అభ్యర్థులపై లాఠీలతో తలలు పగలగొడుతున్నారని ఫైర్ అయ్యారు. ఈ విషయంలో ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు అశోక్ నగర్‌‌‌‌లోని సిటీ లైబ్రరీకి వచ్చి అరచేతిలో వైకుంఠం చూపించిన రాహుల్.. ఇప్పుడు ఈ ఏరియాకు రావాలన్నారు.

చేతిలో రాజ్యాంగం పుస్తకాన్ని పట్టుకుని రాహుల్ చేస్తోంది కొంగ జపం అని ఎద్దేవా చేశారు. ఆదివారం ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో లక్ష్మణ్ మీడియాతో మాట్లాడారు. కాళేశ్వరం పేరుతో బీఆర్ఎస్ పదేండ్ల కాలంలో రూ.వేల కోట్లు దోచుకుంటే.. మూసీ పునరుజ్జీవం పేరుతో కాంగ్రెస్ రూ.1.50 లక్షల కోట్ల అవినీతికి ప్లాన్ చేస్తోందని ఆరోపించారు. 

కర్నాటకలో కాంగ్రెస్ సర్కార్ అవినీతిలో కూరుకుపోతే.. ఏడాదిలోపే తెలంగాణలో ఈ పార్టీ ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకుందన్నారు. గ్రూప్1 అభ్యర్థులు, మూసీ రివర్ ప్రాంత బాధితులు, రైతుల పక్షాన బీజేపీ పోరాడుతుందని ఆయన స్పష్టం చేశారు.