ఎన్నికల ప్రచారాస్త్రంగా అయోధ్య రాముడు

  •     ఇయ్యాళ్టి నుంచి ఇంటింటా రాముడి ఫొటోలు పంచేందుకు బీజేపీ రెడీ 
  •     రంగాపూర్ లో రాత్రి బస చేయనున్న బండి సంజయ్

కరీంనగర్, వెలుగు:  లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో అయోధ్య రాముడిని ప్రచారాస్త్రంగా మలుచుకునేందుకు బీజేపీ సిద్ధమైంది. రాముడి ఫొటోలను ఇంటింటికీ పంపిణీ చేసేందుకు ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్  సన్నాహాలు చేస్తున్నారు. తన పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని 4 .21 లక్షల కుటుంబాలకు ఈ ఫొటోలను చేరవేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

మంగళవారం నుంచే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నారు.  అధిష్టానం పిలుపు మేరకు పల్లెకు పోదాం(గావ్ చలో) కార్యక్రమంలో భాగంగా బండి సంజయ్ మంగళవారం రాత్రి హుజూరాబాద్ నియోజకవర్గంలోని రంగాపూర్​లో పర్యటిస్తున్నారు. పార్టీకి చెందిన ఓ కార్యకర్త ఇంట్లో స్థానికులతో కలిసి భోజనం చేయనున్నారు. రాత్రి అక్కడే బస చేసి గ్రామస్తుల సమస్యలను, వాటి పరిష్కార మార్గాలపై చర్చించనున్నారు.