దేశంలో సెమీఫైనల్గా భావిస్తున్న ఐదు రాష్ట్రాల ఎన్నికలకు బీజేపీ సిద్ధమవుతోంది. ఈ ఏడాది చివర్లో తెలంగాణతో పాటు మధ్యప్రదేశ్, చత్తీస్ ఘడ్, రాజస్థాన్, మిజోరం రాష్ట్రాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఐదు రాష్ట్రాలకు సంబంధించిన అభ్యర్థుల జాబితాలపై బీజేపీ అధిష్టానం కసరత్తు మొదలు పెట్టింది. ఇందులో భాగంగా మధ్యప్రదేశ్, ఛత్తీస్ గడ్ రాష్ట్రాల్లో తొలి జాబితాను ప్రకటించింది.
ఐదు రాష్ట్రాలకు గాను రెండు రాష్ట్రాల్లో తొలి జాబితాను బీజేపీ అధిష్టానం ప్రకటించింది. మధ్య ప్రదేశ్ లో 39 స్థానాలకు, ఛత్తీస్ గఢ్ లో 21 స్థానాలకు అభ్యర్థులను వెల్లడించింది. ఛత్తీస్‌గఢ్‌లో 21 మంది అభ్యర్థుల్లో ఐదుగురు మహిళలున్నారు. మధ్యప్రదేశ్ 39 మంది అభ్యర్థుల్లో ఐదుగురు మహిళలు ఉన్నారు. ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో బీజేపీ బలంగా ఉన్న ప్రాంతాల్లో అభ్యర్థులను ముందుగానే ప్రకటించాలని ప్రధాని మోదీ ఆయా రాష్ట్రాల బీజేపీ అధ్యక్షులను ఆదేశించినట్టుగా తెలుస్తోంది. అందుకే కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ రాకముందే ఈ రెండు రాష్ట్రాల్లో బీజేపీ అభ్యర్థుల తొలి జాబితాను రిలీజ్ చేసింది.
మరి తెలంగాణ ఎప్పుడు..
తెలంగాణ, రాజస్తాన్ రాష్ట్రాలలో బీజేపీ అధికారంలో లేదు. పైగా ఈ రాష్ట్రాల్లో బీజేపీ బలహీనంగా ఉంది. ఈ నేపథ్యంలో అభ్యర్థుల ఎంపికపై ఆచితూచి అడగులు వేస్తోంది బీజేపీ అధిష్టానం. తెలంగాణ విషయానికి వస్తే బీజేపీ ఇటీవలే కొంత బలం పుంజుకుంటోంది. అందుకే ఇక్కడ అభ్యర్థుల విషయంలో బీజేపీ పెద్దలు ఇంకా ఓ నిర్ణయానికి రాలేకపోతోంది. అభ్యర్థుల ఎంపికపై బీజేపీ ఎన్నికల కమిటీ సమీక్షలు, చర్చలు జరుపుతున్నప్పటికీ..తొలి జాబితా విడుదలకు మరింత సమయం పట్టే అవకాశం ఉంది. అయితే రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న వార్తల ప్రకారం సెప్టెంబర్ తొలి వారంలో తెలంగాణ బీజేపీ తొలి జాబితాను ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.