పథకాల అమలుపై మంత్రి జగదీష్ వ్యాఖ్యలు సరికాదు : వివేక్ వెంకటస్వామి

ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా మునుగోడులో కూడా ఇండ్లు మంజూరు చేపిస్తామని మునుగోడు బైపోల్ బీజేపీ స్టీరింగ్ కమిటీ చైర్మన్, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి అన్నారు. ఈ పథకం ద్వారా ఇప్పటివరకు దేశవ్యాప్తంగా ప్రధాని మోడీ 4 కోట్ల ఇండ్లు కట్టించారని ఆయన చెప్పారు. మహిళలు, యువత తమ సొంతంగా ఏదైనా పనిచేసుకునేందుకు కేంద్రం ముద్ర లోన్ ద్వారా రుణాలు ఇస్తోందని చెప్పారు. ఇప్పుడు మునుగోడులో బీజేపీ గెలిస్తే.. కేంద్రంతో మాట్లాడి ఇక్కడి మహిళలు, యువతకు ముద్ర లోన్ ఇప్పిస్తామని వివేక్ హామీ ఇచ్చారు. 

ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు విషయంలో మంత్రి జగదీష్ రెడ్డి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై వివేక్ వెంకటస్వామి ఘాటుగా స్పందించారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని గెలిపిస్తే సంక్షేమ పథకాలు రద్దు చేస్తామని జగదీష్ రెడ్డి మాట్లాడటం సరైంది కాదన్నారు. పథకాలు మీ ఇంటి నుంచి ఇవ్వడం లేదన్నారు. వడ్లు కొనను అని చెప్పినప్పుడు కేసీఆర్ మెడలు వంచి ఎలా కొనుగోలు చేపించామో.. అలాగే కేంద్ర ప్రభుత్వ పథకాలను కూడా తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయించి తీరుతామని చెప్పారు. ఇండ్లు లేని పేదలకు తన సొంత డబ్బులతో ఇండ్లు కట్టించి ఇచ్చిన వ్యక్తి రాజగోపాల్ రెడ్డి అని ఆయన గుర్తు చేశారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం గొల్ల కురుమలకు ఇచ్చే డబ్బులు ఆపినా తన సొంత డబ్బులు ఇస్తానని రాజగోపాల్ ముందుకు వచ్చారని వివేక్ చెప్పారు. మునుగోడులో రాజగోపాల్ రెడ్డిని గెలిపించి కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా ప్రజలు అభివృద్ధి చెందాలని వివేక్ వెంకటస్వామి ఆకాంక్షించారు.