ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ​29 మంది అభ్యర్థులతో బీజేపీ రెండో లిస్ట్

న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కోసం 29 మంది అభ్యర్థులతో బీజేపీ రెండో జాబితాను విడుదల చేసింది. దీంతో ఢిల్లీలోని మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకుగానూ బీజేపీ ఇప్పటిదాకా 58 స్థానాలకు తన అభ్యర్థులను ప్రకటించింది. ఈ జాబితా ప్రకారం..ఢిల్లీ మాజీ సీఎం మదన్‌‌లాల్ ఖురానా కొడుకు హరీశ్ ఖురానాకు మోతీ నగర్ అసెంబ్లీ స్థానం నుంచి టికెట్ ఇచ్చారు. 

అలాగే.. కరావాల్ నగర్ సిట్టింగ్ ఎమ్మెల్యే మోహన్ సింగ్ బిష్త్ స్థానంలో ఢిల్లీ బీజేపీ వైస్ ప్రెసిడెంట్, ఆప్‌‌ మాజీ మంత్రి అయిన కపిల్ మిశ్రా టికెట్ దక్కించుకున్నారు. షాకుర్ బస్తీలో ఆప్ మాజీ మంత్రి సత్యేంద్ర జైన్‌‌పై కర్నైల్ సింగ్ పోటీ చేయనున్నారు. 

అలాగే.. కొండ్లీ నుంచి ప్రియాంక గౌతమ్‌‌, ద్వారకా నుంచి ప్రద్యుమ్‌‌ రాజ్‌‌పుత్‌‌, ఉత్తమ్‌‌ నగర్‌‌ నుంచి పవన్‌‌ శర్మ, కిరారీ నుంచి బజరంగ్‌‌ శుక్లా, సదర్‌‌ బజార్‌‌ నుంచి మనోజ్‌‌ జిందాల్‌‌ సహా పలువురికి అవకాశం దక్కింది. బీజేపీ రెండో జాబితాలో ఐదుగురు మహిళలకు స్థానం కల్పించింది. 

జనవరి 4న బీజేపీ తన తొలి జాబితాను విడుదల చేసింది. ఇందులో 29 మంది పేర్లను వెల్లడించింది. వచ్చే నెల 5న ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అదే నెల 8న ఫలితాలు వెలువడనున్నాయి.