న్యూఢిల్లీ: బీజేపీ, ఆర్ఎస్ఎస్ దేశంలోనే అతిపెద్ద తుక్డే–తుక్డే గ్యాంగ్ అని కాంగ్రెస్ అభివర్ణించింది. కమ్యూనలిజం విషాన్ని అవి దేశమంతా వ్యాప్తి చేస్తున్నాయని విమర్శించింది. ఆర్థిక వ్యవస్థను అస్థిరపరిచేందుకు బీజేపీ నేతలు ప్రయత్నిస్తున్నారని అది నిజమని కాంగ్రెస్ మండిపడింది. ఇండియాను అస్థిరపరిచేందుకు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కుట్రపన్నుతారని, ఆయన దేశ ద్రోహి అని బీజేపీ విమర్శించడంతో కాంగ్రెస్ ఈ వ్యాఖ్యలు చేసింది. శుక్రవారం కాంగ్రెస్ అధికార ప్రతినిధి రాగిణి నాయక్ విలేకర్లతో మాట్లాడారు. “గురువారం దురదృష్టకర ఘటన చోటు చేసుకుంది.
కాంగ్రెస్ అనేది దేశంలోనే పురాతన పార్టీ. పార్టీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీని ద్రోహిగా పిలవడానికి బీజేపీకీ ఎంత ధైర్యం. ఆ పార్టీ నేతలు ఈ స్థాయికి ఎలా దిగజారుతున్నారో దేశ ప్రజలు తెలుసుకోవాలనుకుంటున్నారు. హింస, ద్వేషం, కమ్యూనలిజం విషాన్ని బీజేపీ వ్యాప్తి చేస్తుంది. భారత్‌ను ఐక్యంగా ఉంచాలనే లక్ష్యంతో రాహుల్ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, మణిపూర్ నుంచి మహారాష్ట్ర వరకు యాత్రలు చేపట్టారు.
కార్మికులు, రైతులు, వడ్రంగులు, కార్పెంటర్లు, డ్రైవర్లు అన్ని వర్గాల ఇబ్బందులు అర్థం చేసుకున్నారు. మహిళలు, వెనుకబడిన వర్గాలు, దళితుల గొంతుక వినిపిస్తున్నారు. అటువంటి వ్యక్తిని దేశద్రోహి అంటున్నారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ దేశంలోనే అతిపెద్ద తుక్డే తుక్డే గ్యాంగ్” అని ఆమె పేర్కొన్నారు.