తెలంగాణ బీజేపీలో తీవ్ర విషాదం నెలకొంది. ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే చందుపట్ల జంగారెడ్డి (87) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న జంగారెడ్డి.. శనివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఆయన ఆకస్మిక మృతికి పలువురు నాయకులు సంతాపం తెలిపారు. జంగారెడ్డి వరంగల్ జిల్లాలో నవంబర్ 18, 1935న జన్మించారు. ఆయన 1953లో సుదేష్మాను పెండ్లి చేసుకున్నారు. ప్రస్తుతం ఆయన హన్మకొండలో నివాసం వుంటున్నారు. జంగారెడ్డి రాజకీయాల్లోకి రాకముందు ప్రభుత్వ పాఠశాలలో హయ్యర్ సెకండరీ టీచర్‌గా పనిచేశారు.
జంగారెడ్డి 1967లో భారతీయ జనసంఘ్ పార్టీ నుండి పరకాల నియోజకవర్గ శాసనసభ్యునిగా పోటీచేసి.. ఇండిపెండెంట్ అభ్యర్థి బి. కైలాసంపై గెలిచారు. అనంతరం అదే నియోజకవర్గం, అదే పార్టీ నుంచి 1972లో పోటీచేసి పింగళి ధర్మారెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. తదుపరి 1978 ఎన్నికల్లో పరకాల అసెంబ్లీ నియోజకవర్గం S.C రిజర్వ్ కావడంతో ఇద్దరు కూడా శాయంపేట అసెంబ్లీ నియోజకవర్గం నుండి తలపడ్డారు. ఆ ఎన్నికల్లో మళ్ళీ పింగళి ధర్మారెడ్డిపై పోటీచేసి జంగారెడ్డి విజయం సాధించారు.
అనంతరం 1984లో ఎన్నికల్లో జంగారెడ్డి బీజేపీలో చేరి హనుమకొండ నుంచి లోక్ సభకు పోటీచేశారు. ఆ ఎన్నికల్లో బీజేపీ 543 నియోజకవర్గాలలో కేవలం రెండింటిని మాత్రమే గెలుపొందింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని హనుమకొండ సీటు ఒకటి కాగా.. మరోకటి గుజరాత్‌లోని మెహ్సానా నియోజకవర్గం నుంచి ఏకే పాటిల్ అనే బీజేపీ నేత గెలుపొందారు. ఆ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి లోక్ సభలో బీజేపీకి ప్రాతినిధ్యం వహించిన ఏకైక వ్యక్తి చందుపట్ల జంగారెడ్డి కావడం గమనార్హం. ఈ ఎన్నికల్లో వాజ్ పాయ్, అద్వానీ వంటి బీజేపీ అగ్రనాయకులందరూ పరాజయం పాలయినా.. జంగారెడ్డి మాత్రం విజయం సాధించారు. భారతీయ జనతా పార్టీ నుంచి పోటీకి దిగిన జంగారెడ్డి.. స్థానికుడు కావడంతో ప్రజలు ఆయనకు పట్టం కట్టారు. ఈ ఎన్నికల్లో జంగారెడ్డి.. మాజీ ముఖ్యమంత్రిగా, కాంగ్రెస్‌లో కీలక నేతగా దేశంలోనే ఆర్థిక సంస్కరణలకు శ్రీకారం చుట్టిన దివంగత మాజీ ప్రధాని పీవీ నర్సింహారావుపై 54వేల పైచిలుకు ఓట్లతో విజయం సాధించి దక్షిణ భారతదేశం నుంచి బీజేపీ తొలి పార్లమెంటు సభ్యుడుగా చరిత్రకెక్కారు. అనంతరం 1989,1991,1996లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కమాలుద్దీన్ అహ్మద్ చేతిలో జంగారెడ్డి ఓటమి చవిచూశారు.
జంగారెడ్డి మృతి పట్ల బీజేపీ నేతలు తీవ్ర సంతాపం తెలిపారు. ఆయన మరణంతో జిల్లా బీజేపీ కార్యకర్తలు, నాయకులు విషాదంలో ఉన్నారు.