బీజేపీ సౌత్​ ర్యాలీ

బీజేపీ సౌత్​ ర్యాలీ

తమిళులకు ఆర్ట్స్​ అండ్​ కల్చర్​ అంటే చాలా ఇష్టం. తమ ఇష్టాన్ని పేర్లలోనూ చూపిస్తారు. తెలంగాణకు కొత్త గవర్నర్​గా రాబోతున్న తమిళిసై (తమిళ సంగీతం) పేరుకూడా అలాంటిదే. తమిళనాడు బీజేపీ స్టేట్​ ప్రెసిడెంట్​గా పనిచేసి, రాష్ట్రమంతా సుడిగాలిలా చుట్టేశారు. బీజేపీకి సూది మొనంత సందు లేని తమిళనాడులో ఆమె 43 లక్షలమందిని పార్టీలో చేర్చగలిగారు. 2014లో కన్యాకుమారి నుంచి మొట్టమొదటి బీజెపీ ఎంపీని లోక్​సభకు గెలిపించగలిగారు. పార్టీలో పనిచేసి గుర్తింపు పొందారు. దత్తాత్రేయ, తమిళిసైలా పార్టీకి అంకితభావంతో పనిచేసే వాళ్లకు ప్రమోషన్లు ఖాయమన్న సిగ్నల్​ని బీజేపీ హైకమాండ్​ ఇతర రాష్ట్రాలకు పంపించింది.

తెలంగాణకు ఒక మహిళా నాయకురాలిని గవర్నర్​గా పంపిస్తారనగానే… అందరి దృష్టీ అప్పట్లో సుష్మా స్వరాజ్​ వైపు, మాజీ స్పీకర్​ సుమిత్ర మహాజన్​వైపు మళ్లింది. ఇప్పుడు ఊహించని వ్యక్తిగా తమిళిసై సౌందరరాజన్​ రాజ్​భవన్​కి వచ్చారు. సౌతిండియాలో బీజేపీని బలోపేతం చేసే వ్యూహంలో భాగంగానే తమిళిసైని తెలంగాణ గవర్నర్​గా కేంద్రం నియమించినట్లు భావిస్తున్నారు. దక్షిణాదిన పార్టీ  రాష్ట్ర శాఖ చీఫ్ లుగా ఉన్న లీడర్లకు గవర్నర్ పోస్టు దక్కడం కొత్తేమీ కాదు. ఉమ్మడి ఏపీలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేసిన వి.రామారావు, సిహెచ్​.విద్యాసాగరరావు, కేరళ బీజేపీ ప్రెసిడెంట్​గా పనిచేసిన కుమన్నం రాజశేఖరన్… వీరంతా వేర్వేరు రాష్ట్రాలకు గవర్నర్లుగా పనిచేశారు. తాజా అపాయింట్​మెంట్లలో తమిళిసైతోపాటు గవర్నర్​ పోస్టు పొందిన బండారు దత్తాత్రేయకూడా ఆ కేటగిరీకి చెందినవారే.

బీజేపీకి ఉత్తరాది పార్టీ అనే పేరు చాలా ఏళ్ల నుంచి ఉంది. దీనిని చెరిపేసుకోవడానికి ఆ పార్టీ ప్రయత్నిస్తోంది. సౌత్ లో కూడా పాగా వేయాలని ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే సౌత్ లీడర్లకు గుర్తింపు ఇవ్వాలని బీజేపీ హై కమాండ్ డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. సౌతిండియా నాయకులను కీలక పోస్టుల్లో నియమిస్తోంది. లెఫ్ట్ పార్టీలకు అడ్డాగా ఉన్న కేరళలో బీజేపీ బలం బాగా తక్కువ. అయినప్పటికీ ఇక్కడ పార్టీని విస్తరింపచేయడానికి ఈ రాష్ట్రానికి చెందిన వి.మురళీధరన్​ని మహారాష్ట్ర నుంచి రాజ్యసభకు తీసుకువచ్చి కేంద్ర సహాయ మంత్రి  పోస్టు ఇచ్చింది బీజేపీ హైకమాండ్. నరేంద్ర మోడీ రెండో టర్మ్  ప్రభుత్వంలో కేరళవాసి  మురళీధరన్ ఒక్కరే. మురళీధరన్ కేరళ బీజేపీ ప్రెసిడెంట్​గా 2010 నుంచి 2015 వరకు పనిచేశారు. మురళీధరన్​కి తమిళిసైకు ఒక పోలిక ఉంది. తమిళిసై కుటుంబంలానే మురళీధరన్​ది కూడా కాంగ్రెస్ కుటుంబమే. కానీ, మురళీధరన్ కాంగ్రెస్​కి దూరంగా ఉన్నారు. ఏబీవీపీలో స్టూడెంట్​ లీడర్​గా ఉన్న రోజుల్లో ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాటం చేశారు.

సౌత్​లో లోకల్ పార్టీలదే హవా

సౌత్​లో ఒక్క కర్ణాటక మినహా ఇప్పటివరకు మరే రాష్ట్రంలోనూ బీజేపీ సర్కార్ ఏర్పాటు చేయలేకపోయింది. దీనికి చాలా కారణాలున్నాయి. సౌత్​లో ప్రాంతీయ పార్టీల హవా ఎక్కువగా ఉండటం పెద్ద కారణమంటున్నారు ఎనలిస్టులు. తమిళనాడులో డీఎంకే, అన్నా డీఎంకే, ఆంధ్రప్రదేశ్​లో టీడీపీ, వైసీపీ, తెలంగాణలో టీఆర్ఎస్ వంటి లోకల్ పార్టీలదే హవా. వీటిని తట్టుకోవడానికి బీజేపీ కొత్త ఎత్తుగడలతో ముందుకుపోతోంది. సౌత్ లీడర్లకు కీలక పోస్టులు ఇవ్వడం ద్వారా ఆయా రాష్ట్రాల్లో పార్టీ విస్తరించే అవకాశాలున్నాయని బీజేపీ హైకమాండ్ నిర్ణయించుకున్నట్లు ఎనలిస్టులు చెబుతున్నారు.

తమిళనాడు బీజేపీకి కొత్త నాయకత్వం

తమిళిసై తమిళనాడు బీజేపీ ప్రెసిడెంట్​గా పనిచేసి పార్టీలో మంచి గుర్తింపు పొందారు. ఆమె స్థానంలో తమిళనాడుకు కొత్త చీఫ్ ఎంపికలో చాలా కసరత్తు చేస్తోంది. లోక్​సభ ఎన్నికల్లో రామనాథపురం నుంచి బీజేపీ టికెట్​పై పోటీ చేసి ఓడిపోయిన అన్నా డీఎంకే మాజీ నాయకుడు నైనర్ నాగేంద్రన్​ పేరు బాగా వినిపిస్తోంది. తమిళనాడు అసెంబ్లీకి 2021లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈలోగా అక్కడ పార్టీ ని బలోపేతం చేయడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకునే మూడ్​లో పార్టీ హైకమాండ్ ఉంది. తమిళనాడు, కేరళ వంటి రాష్ట్రాలకు చెందిన పార్టీ నాయకులకు కేంద్రంలో పదవులు ఇవ్వడానికి పెద్దగా వీలు కాదు. ఆ రాష్ట్రాల్లో పార్టీ అధికారంలో లేదు. దీంతో గవర్నర్ వంటి పోస్టులలో సర్దుబాటు చేస్తున్నారని బీజేపీ హైకమాండ్ భావించినట్లు రాజకీయ పండితుల కథనం. తమిళిసైని తెలంగాణకు గవర్నర్​గా పంపించి, తమిళనాడుకు ఎంతో ఇంపార్టెన్స్ ఇచ్చినట్లుగా సిగ్నల్స్ ఇచ్చింది.

కాంగ్రెస్ ఫ్యామిలీ టు బీజేపీ

తమిళిసైది కాంగ్రెస్ కుటుంబం. ఆమె తండ్రి కుమరి అనంతన్ తమిళనాడు కాంగ్రెస్ కమిటీ (టీఎన్​ పీసీసీ) ప్రెసిడెంట్​గా పనిచేశారు. ఆమె ఫ్యామిలీ మెంబర్స్ అంతా కాంగ్రెస్​లోనే పనిచేశారు. తమిళిసై మాత్రం బీజేపీ వైపు మొగ్గారు. 1999లో ఆమె బీజేపీలో చేరి, అనేక హోదాల్లో పనిచేశారు. 2014 లోక్​సభ ఎన్నికల్లో తమిళనాట ఆమె పార్టీకి స్టార్ క్యాంపెయినర్​గా ఉన్నారు. చక్కటి వాగ్ధాటితో ప్రత్యర్థులపై విమర్శలు కురిపించారు. ఆమె సొంత జిల్లా అయిన కన్యాకుమారి నుంచి మొదటిసారిగా బీజేపీ కేండిడేట్​ (రాధాకృష్ణన్​ పొన్ను) గెలిచారు. దీంతో పార్టీ పట్ల ఆమె చిత్తశుద్ధిని గమనించిన బీజేపీ హైకమాండ్ ఆమెకు పార్టీ  రాష్ట్ర శాఖ పగ్గాలు  అప్పగించింది. తమిళనాడు బీజేపీకి తొలి మహిళా ప్రెసిడెంట్​గా ఆమె రికార్డుకెక్కారు. తమిళనాట బీజేపీకి బలమైన వాయిస్​లా నిలిచారు. రాష్ట్రమంతా తిరిగి లోకల్ కేడర్​లో జోష్ నింపారు. సభ్యత్వ నమోదును సవాల్​గా తీసుకున్నారు. తమిళనాడులో 43 లక్షల మంది బీజేపీ సభ్యత్వం తీసుకున్నారంటే అది తమిళిసై నాయకత్వ ప్రతిభే అంటున్నారు ఎనలిస్టులు. కాగా, తమిళిసై రెండుసార్లు లోక్​సభకు, రెండుసార్లు అసెంబ్లీకి పోటీ చేసి ఓడిపోయారు. ఓటమితో ఆమె ఏ రోజూ డీలా పడలేదు. పార్టీ వాయిస్ వినిపిస్తూనే ఉన్నారు.

బీసీలకు అండగా బీజేపీ

తమిళిసై బీసీ నాయకురాలు. తమిళనాడులో రాజకీయంగా పవర్ ఫుల్ అయిన నాడార్ కులానికి చెందినవారు. సౌత్ లో బీసీలు పెద్ద సంఖ్యలో ఉంటారు. తమిళిసై నియామకం ద్వారా బీసీలను ఆకట్టు కోవాలన్నది బీజేపీ ప్లా నులాగా కనిపిస్తుందని ఎనలిస్టులు చెబుతున్నారు. ఒకప్పటి తమిళనాడు సీఎం కామరాజ్ కూడా నాడార్ కులస్తుడే. తమిళిసై నియామకంతో పార్టీకోసం కష్టపడి పనిచేసే నాయకులకు తప్పకుం డా గుర్తింపు
ఉంటుం దన్న సంకేతాలు బీజేపీ హైకమాండ్ పంపదలచింది. దీనివల్ల నాయకులు పార్టీ పట్ల మరింత అంకితభావంతో పనిచేస్తారన్నది వారి ఆలోచనగా కనిపిస్తుంది.