
- కీలక పోస్టులన్నీ నార్త్, సెంట్రల్ జిల్లాల నేతలకే
- తమకు ప్రాధాన్యత ఇవ్వక పోవడంపై ‘సౌత్’ లీడర్లు నారాజ్
- నామినేటెడ్ పోస్టులు కూడా ఇవ్వకపోవడంపై అలక
- ఇలాగైతే అధికారంలోకి ఎలా వస్తామంటున్న కేడర్
- స్టేట్ ప్రెసిడెంట్ పోస్టు ఇవ్వాలని దక్షిణ తెలంగాణ నేతల పట్టు
హైదరాబాద్, వెలుగు: బీజేపీలో ప్రాంతీయ విభేదాలు మొదలయ్యాయి. తెలంగాణ నార్త్, సెంట్రల్ జిల్లాలకు మాత్రమే హైకమాండ్ ప్రాధాన్యం ఇస్తున్నదంటూ సౌత్ జిల్లాలకు చెందిన లీడర్లు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. పార్టీ పదవులతోపాటు నామినేటెడ్ పోస్టుల్లోనూ తమకు అన్యాయం జరుగుతున్నదని ఆ ప్రాంతానికి చెందిన కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ జిల్లాలను పట్టించుకోకపోతే.. వచ్చే జనరల్ ఎన్నికల్లో అధికారంలోకి ఎలా వస్తామని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా దిద్దుబాటు చర్యలు ప్రారంభించాలని డిమాండ్ చేస్తున్నారు.
రాష్ట్రంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి, ఎలాగైనా అధికారంలోకి రావాలని బీజేపీ హైకమాండ్ భావిస్తున్నది. దీంట్లో భాగంగా అన్ని విభాగాలను యాక్టివ్ చేస్తున్నది. రాష్ట్రంలో 8 అసెంబ్లీ, 8 ఎంపీ స్థానాలను బీజేపీ గెలుచుకున్నది. అయితే, ఇందులో ఏడు ఎమ్మెల్యే స్థానాలు ఉత్తర తెలంగాణలో ఉండగా, కేవలం ఒకటి హైదరాబాద్ లో ఉంది. ఉత్తర తెలంగాణలోని నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాలతో పాటు సికింద్రాబాద్, మల్కాజ్ గిరి, మహబూబ్ నగర్, చేవెళ్ల పార్లమెంట్ స్థానాల్లో బీజేపీ విజయం సాధించింది. తాజాగా, రెండు ఎమ్మెల్సీ స్థానాలనూ ఉత్తర తెలంగాణ పరిధిలోనే గెలుచుకోగా, సిటీలో ఓ టీచర్ ఎమ్మెల్సీ ఉన్నారు. ఈ లెక్కన నల్గొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాలకు ఎక్కడా స్థానాల్లోనూ ప్రాతినిథ్యం లేదు.
ఆ జిల్లాల కేడర్లో నిరాశ
నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఉమ్మడి జిల్లాలను రాష్ట్ర నాయకత్వం పెద్దగా పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి. పార్లమెంట్ ఎన్నికల సమయంలో ఆయా జిల్లాలపై ఫోకస్ పెట్టాలని బీజేపీ జాతీయ నాయకత్వం ఆదేశించింది. దీంట్లో భాగంగానే హైకమాండే రంగంలోకి దిగి.. కేడర్లో ఉత్సాహం నింపేందుకు అమిత్ షా సహా కీలక నేతలు ప్రచారంలో పాల్గొన్నారు. ఆ తర్వాత మళ్లీ కేంద్ర, రాష్ట్ర నాయకత్వాలు పెద్దగా పట్టించుకోలేదు. ఆయా జిల్లాల్లో ప్రజాప్రతినిధులు లేకపోవడంతో ముఖ్యనేతలు కూడా అటు వైపు చూడడం లేదని అక్కడి కేడర్ ఆవేదన వ్యక్తం చేస్తున్నది.
కేంద్రం నుంచి వచ్చే గవర్నర్ పోస్టులు, రాజ్యసభ స్థానాలు, కేంద్ర మంత్రి పదవులు, ఇతర నామినేటెడ్ పోస్టులూ ఆ జిల్లాలకు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పార్టీ నుంచి ప్రజాప్రతినిధులు లేకపోయినా బలమైన కేడర్ ఉందని, కనీసం కొన్ని పోస్టులు ఇస్తే కేడర్లో ఉత్సాహం వస్తుందని ఆ ప్రాంతానికి చెందిన నేతలు అంటున్నారు. ఈ 3 జిల్లాల పరిధిలో 34 ఎమ్మెల్యే స్థానాలు, 5 ఎంపీ స్థానాలు ఉన్నాయి. ఈ ప్రాంతంపై ఫోకస్ చేయకపోతే సొంతంగా అధికారంలోకి రావడం కష్టమేనని కేడర్ లో అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
రాష్ట్ర అధ్యక్ష పదవి ఇవ్వాలని పట్టు
త్వరలోనే స్టేట్ బీజేపీకి కొత్త ప్రెసిడెంట్ రానున్నారు. దీనికి సంబంధించిన కసరత్తు జరుగుతున్నది. ప్రజాప్రతినిధుల కోటాలో ధర్మపురి అర్వింద్, ఈటల రాజేందర్, డీకే అరుణ, రఘునందన్ రావు, పాయల్ శంకర్, వెంకట రమణారెడ్డి ఉండగా, పార్టీ నేతల కోటాలో రాంచందర్ రావు, గంగిడి మనోహర్ రెడ్డి, గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, కాసం వెంకటేశ్వర్లు పేర్లు హైకమాండ్ పరిశీలనలో ఉన్నాయి.
ప్రస్తుతం తెలంగాణపై బీజేపీ ఫోకస్ పెంచిన నేపథ్యంలో, పార్టీకి టైమ్ ఇచ్చే వారికే అవకాశం ఇవ్వాలనే డిమాండ్ వస్తున్నది. ప్రతిసారి గ్రేటర్ హైదరాబాద్, ఉత్తర తెలంగాణ వారికే కాకుండా.. ఈసారి బీజేపీ దక్షిణ జిల్లాలకు చెందిన వారికి ప్రెసిడెంట్ పోస్టు ఇవ్వాలని కేడర్ కోరుతున్నది.