మునుగోడు నియోజకవర్గంపై బీజేపీ స్పెషల్ ఫోకస్ పెట్టింది. త్వరలో జరగబోయే ఉప ఎన్నికలో విజయం సాధించాలని వ్యూహాలు రచిస్తోంది. అందులో భాగంగా ఈ నెల 22వ తేదీ నుంచే మునుగోడులో మకాం వేయాలని బీజేపీ నేతలకు హై కమాండ్ ఆదేశాలు జారీ చేసింది. ఈనెల 21వ తేదీన కేంద్ర మంత్రి అమిత్ షా మునుగోడుకు రానున్నారు. అమిత్ షా సభను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. షా సమక్షంలో కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి బీజేపీ కండువా కప్పుకోనున్నారు. రాజగోపాలరెడ్డి చేరిక తర్వాత ఉప ఎన్నిక ప్రచారం ముమ్మరం చేయాలని పార్టీ నేతలు నిర్ణయించారు.
బహిరంగ సభ తర్వాత మునుగోడు బైపోల్స్ కోసం ఎన్నికల కమిటీని బీజేపీ వేయనుంది. బైపోల్స్ ప్రచారానికి కేంద్ర మంత్రులు, పలువురు జాతీయ నేతలను ఆహ్వానించే పనిలో ఉంది. మరోవైపు... ఉప ఎన్నికలో భారీగా ఓట్లు రాబట్టాలని ఇప్పటి నుంచే వ్యూహాలకు పదును పెడుతోంది. 2018 సాధారణ ఎన్నికల్లో కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డికి 97వేలకు పైగా ఓట్లు వచ్చాయి. ఇప్పుడు జరిగే బై పోల్ లో దాదాపు లక్ష ఓట్లు సాధించాలని కమలం పార్టీ టార్గెట్ పెట్టుకుంది. పాత, కొత్త నేతలు సమన్వయంతో పనిచేస్తే లక్ష ఓట్లు కష్టం కాదని భావిస్తోంది.