కేటీఆర్ ఇలాకాలో బలపడేందుకు బీజేపీ ప్రయత్నం

  • సెస్ ఎన్నికల్లో 30 శాతానికి పైగా ఓట్లు సాధించి మంచి జోష్​లో..
  • చేరికలపై బీజేపీ ప్రత్యేక దృష్టి
  • త్వరలో కాషాయ కండువా కప్పుకోనున్న సీనియర్ నేత లగిశెట్టి
  • అదే వరుసలో ఇంకొంత మంది 

రాజన్న సిరిసిల్ల, వెలుగు : మినిస్టర్​ కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్లపై బీజేపీ స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఇటీవల జరిగిన సెస్ ఎన్నికల్లో 15 డైరెక్టర్ స్థానాల్లో అధిక ఓట్లు సాధించిన పార్టీ కేటీఆర్ ఇలాకాలో బలపడేందుకు గట్టి ప్రయత్నాలు మొదలుపెట్టింది. బీఆర్ఎస్ కు దూరంగా ఉన్న కొందరు నేతలతో బీజేపీ లీడర్లు చర్చలు జరిపి పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. సిరిసిల్లలో పద్మశాలి సామాజికవర్గానికి చెందిన లగిశెట్టి శ్రీనివాస్ త్వరలో బీజేపీలో చేరనున్నారు. ఇటీవల బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ శ్రీనివాస్ ఇంటికి వెళ్లి పార్టీలోకి ఆహ్వానించారు. లగిశెట్టి రాకతో సిరిసిల్లలో బీజేపీ బలం పెరగనుందని పార్టీవర్గాలు అంచనా వేస్తున్నాయి. కేటీఆర్ ప్రధాన అనుచరులైన కొందరు.. బీఆర్ఎస్ సీనియర్ లీడర్ల తీరుతో అసంతృప్తి గా ఉన్నట్లు తెలుస్తోంది. కేటీఆర్ కు సన్నిహితంగా మెదిలిన లగిశెట్టి శ్రీనివాస్ కొంతకాలంగా ఆ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు.

సెస్ ఎన్నికల్లో బీజేపీ సత్తా..

ఇటీవల జరిగిన సెస్ ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటి అధికార పార్టీకి ముచ్చెమటలు పట్టించింది. మొత్తం 15 డైరెక్టర్ స్థానాలలో బీజేపీ దాదాపు 7 స్థానాలలో మంచి ఓట్లు సాధించింది. 
4 స్థానాల్లో కేవలం వంద ఓట్ల తేడాతో అభ్యర్థులు ఓడిపోయారు. ఎన్నికల్లో అధికార పార్టీకి మొత్తం 40వేల ఓట్లు వస్తే బీజేపీ 23వేల ఓట్లతో(32శాతం) ప్రజల విశ్వాసం చూరగొంది. దీంతో సిరిసిల్లలో కమలం పార్టీకి ఆశాజనక పరిస్థితులు ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. రెండు స్థానాలలో బీజేపీ అభ్యర్థులు గెలిచినట్టు మొదట ప్రకటించిన సెస్ ఎన్నికల అధికారి రూలింగ్​ పార్టీ నాయకుల ఒత్తిడికి తలొగ్గి మళ్లీ టీఆర్ఎస్ అభ్యర్థులే గెలిచినట్టు ప్రకటించారని ఆరోపణలు వచ్చాయి. వేములవాడ రూరల్, చందుర్తి, రుద్రంగి, ఎల్లారెడ్డిపేట, ముస్తాబాద్, సిరిసిల్ల టౌన్ 1 స్థానాలలో బీజేపీ సత్తా చాటింది. 

పార్టీ కమిటీల్లో మార్పులు?

సిరిసిల్ల బీజేపీ కమిటీల్లో మార్పులు చేర్పులు చేయనున్నట్లు సమాచారం. కొంత కాలంగా పార్టీ బలోపేతానికి పనిచేసిన వారికి ముఖ్యమైన పదవులు అప్పజెప్పేందుకు ప్లాన్ రెడీ చేస్తున్నారు. సంక్రాంతి తర్వాత వివిధ కమిటీల్లో యాక్టివ్ గా పనిచేసే వారికి చోటు కల్పిస్తారని సమాచారం. అసెంబ్లీ ఎన్నికల సమీపిస్తున్న నేపథ్యంలో జిల్లాలో బీజేపీ నాయకులను యాక్టివ్ చేసేందుకు లీడర్లు సమాయాత్తమవుతున్నారు. ప్రతి నెలలో బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ కార్యకర్తలను కరీంనగర్ పిలుపించుకుని మాట్లాడుతున్నారు. పార్టీని మరింత బలోపేతం చేయడంపై దృష్టి సారించాలని సిరిసిల్ల నేతలకు చెబుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల నాటికి సిరిసిల్లలో బీజేపీని బలోపేతం చేసేలా పావులు కదుపుతున్నారు.