తెలంగాణపై బీజేపీ స్పెషల్ ఫోకస్

  • 5 రాష్ట్రాల ఎన్నికల వ్యూహాలపై కీలక భేటీ 
  • ఆయా రాష్ట్రాల సెక్రటరీలతో పార్టీ చీఫ్ నడ్డా మీటింగ్ 
  • తెలంగాణ నుంచి చుగ్, సునీల్ బన్సల్, సంజయ్ హాజరు  

న్యూఢిల్లీ, వెలుగు: త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఐదు రాష్ట్రాలపై బీజేపీ స్పెషల్ ఫోకస్ పెట్టింది. ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంపై ప్రత్యేకంగా గురి పెట్టింది. రాష్ట్రంలో తొలిసారి కాషాయ జెండా ఎగురవేసేందుకు వ్యూహాలకు పదును పెట్టింది. ఇందులో భాగంగా శుక్రవారం ఢిల్లీలోని బీజేపీ హెడ్ ఆఫీసులో పార్టీ చీఫ్ జేపీ నడ్డా కీలక సమావేశం నిర్వహించారు. 

త్వరలోఎన్నికలు జరగనున్న ఐదు రాష్ట్రాలకు చెందిన పార్టీ నేషనల్ జనరల్ సెక్రటరీలతో ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ భేటీలో పార్టీ నేషనల్ జనరల్ సెక్రటరీ (ఆర్గనైజేషన్) బీఎల్ సంతోష్, అరుణ్ సింగ్, సునీల్ బన్సల్, దుష్యంత్ గౌతమ్, వినోద్ తావ్డే, కైలాష్ విజయవర్గీయ, బి. సంజయ్ కుమార్, తరుణ్ చుగ్, రాధా మోహన్ దాస్ అగర్వాల్ పాల్గొన్నారు. దాదాపు నాలుగు గంటలకు పైగా సాగిన ఈ భేటీలో తెలంగాణ, రాజస్థాన్, చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, మిజోరం అసెంబ్లీ ఎన్నికల వ్యూహాలపై చర్చించినట్లు తెలిసింది. 
 

ALSO READ: సీటివ్వకుంటే రెబల్​గా దిగుడే! .. సిద్ధమవుతున్న కాంగ్రెస్ బీసీ లీడర్లు

త్వరలో తెలంగాణలో ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఇతర పార్టీ సీనియర్ నాయకుల ఎన్నికల పర్యటనలపై మేధోమథనం నిర్వహించారు. మోదీ, అమిత్ షా తెలంగాణకు రానున్న నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహాలు, సభల్లో లేవనెత్తాల్సిన విషయాలపై చర్చించారు. ఇతర రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారాలపై కూడా పలు నిర్ణయాలు తీసుకున్నారు. లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల కోసం దేశవ్యాప్తంగా ఏర్పాటు చేస్తున్న కాల్ సెంటర్లపై సమీక్ష నిర్వహించారు. అలాగే గత లోక్‌సభ ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓడిపోయిన170 కంటే ఎక్కువ సీట్లపై కూడా స్పెషల్ ఫోకస్ పెట్టాలని నిర్ణయించారు.