లిక్కర్ కుంభకోణంపై దర్యాప్తు చేయాలి

సీఎం కేసీఆర్ కుటుంబం రాష్ట్రాన్ని దోచుకున్నది చాలదన్నట్టు ఇప్పుడు దేశంపై పడిందని బీజేపీ అధికార ప్రతినిధి రాణి రుద్రమ మండిపడ్డారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఎమ్మెల్సీ కవిత, ఆమె భర్త, బంధువుల ప్రమేయం ఉన్నట్టు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయని..దీనికి ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. లిక్కర్ కుంభకోణంలో కవిత ప్రధాన సూత్రధారి అని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారని...కోట్ల రూపాయల లావాదేవీలు జరిగాయని చెబుతున్నారని తెలిపారు. దీనిపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. 

మరోవైపు ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ స్కాం వెనుక తెలంగాణ సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యుల హస్తం ఉందని వెస్ట్ ఢిల్లీ బీజేపీ ఎంపీ పర్వేశ్ సాహిబ్ సింగ్ వర్మ చేసిన ఆరోపణలపై ఎమ్మెల్సీ కవిత స్పందించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ తో తనకు ఏ మాత్రం సంబంధం లేదని చెప్పారు. తనను ఇబ్బంది పెట్టి సీఎం కేసీఆర్ ను భయపెట్టాలని చూస్తున్నారని అన్నారు. లిక్కర్ స్కామ్ పై ఏ దర్యాప్తు సంస్థతో అయినా విచారణ చేయించినా తాము సహకరిస్తామన్నారు. ఇటువంటి ఆరోపణలకు, విమర్శలకు తాము భయపడే ప్రసక్తే లేదన్నారు. 

ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ స్కామ్ లో తన పాత్ర ఉందని ఆరోపణలు చేసిన బీజేపీ ఎంపీ పర్వేశ్ వర్మ, మాజీ ఎమ్మెల్యే మంజిందర్ సింగ్ సిర్సాపై పరువు నష్టం దావా వేస్తానని ప్రకటించారు. న్యాయ నిపుణులతో దీనిపై చర్చిస్తున్నట్లు ఎమ్మెల్సీ కవిత తెలిపారు.  ప్రశ్నించే వాళ్లపై నిరాధారమైన ఆరోపణలు చేయడం సరికాదన్నారు. బీజేపీ ఎంపీ తనపై చేసిన ఆరోపణలన్నీ నిరాధారమైనవని చెప్పారు. తమను మానసికంగా ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు ఎప్పటికీ సఫలం కావన్నారు. బీజేపీ పాలసీలను ప్రశ్నిస్తున్నందుకే తమను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ప్రస్తుతం దేశంలో కక్షపూరిత రాజకీయాలు నడుస్తున్నాయని ఆరోపించారు.