
దండేపల్లి, వెలుగు: కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకిచ్చిన హామీలను నెరవేర్చాలని బీజేపీ నాయకులు దండేపల్లిలో ధర్నా చేపట్టారు. ఎన్నికలకు ముందు రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని, సన్న వడ్లకు క్వింటాల్ కు రూ.500 బోనస్ చెల్లిస్తామని చెప్పి ఇప్పటివరకు ఇవ్వలేదని, వాటిని వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ధర్నాకు బీజేపీ పిలుపునివ్వడంతో మంచిర్యాల అసెంబ్లీ వ్యాప్తంగా పలువురు బీజేపీ నేతలను ముందుగానే అదుపులోకి తీసుకున్నారు.
పోలీసుల నిర్బంధాన్ని ఛేదించుకొని పలువురు బీజేపీ నేతలు దండేపల్లిలో ధర్నా చేశారు. కిసాన్ మోర్చా నేత గాదె శ్రీనివాస్ మాట్లాడుతూ.. రైతుల పక్షాన బీజేపీ పోరాడుతుంటే ప్రభుత్వం అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ తమ పోరాటాన్ని అణచివేస్తూ అక్రమంగా అరెస్ట్ చేయిస్తున్నారని మండిపడ్డారు.
రైతులు తలచుకుంటే ప్రభు త్వాలు కూలిపోతాయని, ఈ విషయాన్ని అధికార పార్టీ నాయకులు గుర్తుంచుకోవాలని హితవు పలికారు. రైతులకిచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. రాస్తారోకోతో రోడ్డుకు ఇరువైపులా ట్రాఫిక్ భారీగా నిలిచిపోవడంతో ఎస్ఐ తహిసినుద్దీన్ వారిని బలవంతంగా లేపి ట్రాఫిక్ క్లియర్ చేశారు.