టీఆర్ఎస్ అంటే తెలంగాణ రజాకార్ల సమితి

నల్గొండ, వెలుగు: కేసీఆర్ అంటే ఖాసీం చంద్రశేఖర రజ్వీ అని బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ విమర్శించారు. మనోళ్లను నరికి చంపిన రజాకార్ల పార్టీతో కేసీఆర్ అంటకాగుతున్నారని మండిపడ్డారు. గుండ్రాంపల్లిలో వందలాది మందిని ఉచకోత కోసిన రజాకార్ సయ్యద్ మక్బూల్ తో మంత్రి కేటీఆర్ ను పోల్చారు. గుండ్రాంపల్లి పోరాటాల స్ఫూర్తితో మరో ఆపరేషన్ పోలో చేపట్టి, తెలంగాణ రజాకార్ల సమితిగా మారిన టీఆర్ఎస్​ పాలనను బొందపెట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే పోరాటాల గడ్డ గుండ్రాంపల్లిని తెలంగాణ స్ఫూర్తి కేంద్రంగా చేస్తామని, రజాకార్లపై పోరాడి అమరులైన వారి కుటుంబాలకు ఇండ్లు నిర్మించి ఇవ్వడంతోపాటు అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా ఏడో రోజు మంగళవారం చౌటుప్పల్ నుంచి చిట్యాల మండలం గుండ్రాంపల్లి వరకు సంజయ్ పాదయాత్ర చేశారు. అక్కడ నిర్వహించిన బహిరంగసభలో, చౌటుప్పల్​ మున్సిపాలిటీ పరిధిలోని లింగోజిగూడెంలో నిర్వహించిన రచ్చబండ, తాళ్లసింగారం గ్రామంలో చాయ్ పే చర్చా కార్యక్రమాల్లో ఆయన మాట్లాడారు. పాదయాత్రలో భాగంగా హర్ ఘర్ తిరంగా నినాదంతో చౌటుప్పల్ నుంచి అంకిరెడ్డి గూడెం వరకు వేలాది మందితో కలిసి జాతీయ జెండాలతో ర్యాలీ తీశారు. 

గుండ్రాంపల్లి చరిత్రను పుస్తకాల్లోకి ఎక్కిస్తం.. 

గుండ్రాంపల్లి అంటేనే పౌరుషాల గడ్డ అని సంజయ్ అన్నారు. సొంత సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని ఖాసీం రజ్వీపై తిరగబడ్డ చరిత్ర  గుండ్రాంపల్లికి ఉందన్నారు. ఇక్కడ ఆడవాళ్లపై సయ్యద్ మక్బుల్ సాగించిన దురాగతాలు అన్నీ ఇన్నీ కావన్నారు. పాండవులు నడయాడిన గుండ్రాంపల్లిలో రజాకార్ల అరాచకాలకు ఎందరో బలయ్యారని అన్నారు. అలాంటి గుండ్రాంపల్లి చరిత్ర ఎందుకు తెరమరుగైందో అందరూ గుర్తించాలని సూచించారు. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం వస్తే మొదటిసారి గుండ్రాంపల్లికే వస్తానని అమిత్ షా తనతో చెప్పారని సంజయ్ తెలిపారు. తాము పవర్​లోకి వచ్చాక గుండ్రాంపల్లి వీరుల చరిత్రను పాఠ్యపుస్తకాల్లో పెట్టిస్తామని, అమరవీరుల స్మృతి కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.  తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినోత్సవంగా జరుపుతానన్న కేసీఆర్ హామీ ఏమైందని  ప్రశ్నించారు. 

పేదల భూములు లాక్కున్నరు.. 

పేదల భూములను లాక్కునేందుకే కేసీఆర్ ధరణి తెచ్చారని సంజయ్ విమర్శించారు. బీజేపీ అధికారంలోకి రాగానే ప్రభుత్వం లాక్కున్న భూములను తిరిగి పేదలకు పంచుతామని చెప్పారు. జిల్లాలో కాలుష్యం వెదజల్లే పరిశ్రమలతో జనం ఇబ్బందులు పడుతున్నారని, ఇక్కడి నిరుద్యోగులు బయోడేటాలు తనకు పంపిస్తే ఉద్యోగాలు ఇప్పిస్తానని తెలిపారు. కరెంటు ఇవ్వని కేసీఆర్ పవర్ కట్ చేద్దామని అన్నారు.