జీహెచ్ఎంసీ బీజేపీ కార్పొరేటర్ల అరెస్ట్ ను ఖండించారు ఆ పార్టీ స్టేట్ చీఫ్ బండి సంజయ్. అరెస్టు చేసిన వారిని బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికలు జరిగి ఏడాదైనా ఇంతవరకు జనరల్ బాడీ మీటింగ్ పెట్టకపోవటమేంటని ప్రశ్నించారు. ప్రజాప్రతినిధులన్న కనీస స్పృహ లేకుండా.. బీజేపీ కార్పొరేటర్ల పట్ల.. పోలీసులు దురుసుగా వ్యవహరించారని అన్నారు. టీఆర్ఎస్ పాలనలో ప్రజాప్రతినిధుల పరిస్థితే ఇలా ఉంటే సామాన్యుల సంగతేంటో చెప్పాల్సిన పనిలేదన్నారు.
గత సాంప్రదాయాలు, నిబంధనలు పట్టించుకోకుండా.. తమ అనుకూల సభ్యులతో.. స్టాండింగ్ కమిటీ ఏర్పాటు చేయటం.. టీఆర్ఎస్ నియంతృత్వానికి నిదర్శనమన్నారు సంజయ్. బీజేపీ కార్పొరేటర్లకు అభివృద్ధి, సంక్షేమ పథకాల్లో భాగస్వామ్యం కల్పించకపోవటం అప్రజాస్వామికమని విమర్శించారు. కరోనా సాకుతో నామమాత్రంగా సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేసి.. GHMC పాలనను గాలికొదిలేశారని మండిపడ్డారు సంజయ్. టీఆర్ఎస్, మున్సిపల్ మంత్రి చెప్పినట్లే జీహెచ్ఎంసీ పనిచేస్తే.. కార్పొరేటర్లు, జీహెచ్ఎంసీ పాలకవర్గం ఎందుకున్నట్టని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వమే జీహెచ్ఎంసీని నడిపించదల్చుకుంటే.. జీహెచ్ఎంసీ ఎన్నికలు ఎందుకు నిర్వహించారని ప్రశ్నించారు. రాజకీయాల పేరుతో అభివృద్ధిని అడ్డుకోవడం సమంజసం కాదన్నారు బండి సంజయ్.