గల్లీకే పనికిరావ్.. ఢిల్లీకి పోతవా?

గల్లీకే పనికిరావ్.. ఢిల్లీకి పోతవా?
  • కేసీఆర్​..! నీకు కౌంట్​డౌన్​ స్టార్టయింది: బండి సంజయ్​
  • ఫామ్​హౌస్​ దాటి రాని నిన్ను చూసి ఎవరు భయపడ్తరు?
  • హైదరాబాద్​ చుట్టూ ఏటా రూ. 10వేల కోట్ల భూములమ్ముతున్నవ్​
  •  ఆరున్నర లక్షల మందికి వరద సాయం చేస్తే ప్రజలెందుకు నిలదీస్తున్నరు?

హైదరాబాద్‌‌, వెలుగు: గల్లీకే పనికిరాని కేసీఆర్​ ఢిల్లీకి పోతానంటున్నారని బీజేపీ స్టేట్​ చీఫ్​ బండి సంజయ్​ విమర్శించారు. ‘‘ఫాం హౌస్‌‌ దాటి బయటకు రాని వ్యక్తిని చూసి ఎవరు భయపడుతారో చెప్పాలి? గల్లీకే పనికిరానోడు ఢిల్లీకి పనికొస్తడా..? గల్లీలనే కేసీఆర్‌‌ను ఎవరు దేకుతరు?” అని ఆయన అన్నారు. కేసీఆర్​కు కౌంట్‌‌డౌన్‌‌ స్టార్ట్‌‌  అయిందని, అందుకే ఆయన గజగజ వణికిపోతున్నారని విమర్శించారు. శనివారం రాత్రి బీజేపీ స్టేట్‌‌ ఆఫీస్‌‌లో బండి సంజయ్​ మీడియాతో మాట్లాడారు.

ప్రభుత్వరంగ సంస్థలను కేంద్రం అమ్ముతున్నట్లు కేసీఆర్‌ అబద్ధాలు చెప్తున్నారని, కేసీఆరే ఏటా హైదరాబాద్‌ చుట్టుపక్కలా రూ. 10 వేల కోట్ల విలువైన భూములను అమ్ముతున్నారని సంజయ్​ అన్నారు. కేసీఆర్‌వి తుపాకీ రాముని మాటలని, గత మేనిఫెస్టోలో హామీలు నెరవేర్చి ఉంటే వాటిని ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు. బీజేపీ గల్లీ నుంచి ఢిల్లీ వరకు విస్తరించిన పార్టీ అని.. టీఆర్‌ఎస్‌ గల్లీ పార్టీ కూడా కాదు గడీల పార్టీ అని కామెంట్​ చేశారు. కేంద్రం వరద సాయం ఇవ్వలేదని కేసీఆర్​ అనడం సరికాదన్నారు. వరద నష్టం అంచనాలను  ఇంతవరకు ఎందుకు కేంద్రానికి పంపలేదో చెప్పాలని నిలదీశారు. ఆరున్నర లక్షల మందికి వరద సాయం చేస్తే టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు ఎందుకు ధైర్యంగా ప్రజలకు ఆ విషయం చెప్పలేకపోతున్నారని నిలదీశారు.

మహిళలకు కేసీఆర్​ క్షమాపణ చెప్పాలి

సభలో కేసీఆర్‌ సంస్కారహీనంగా మాట్లాడారని, తెలంగాణ మహిళలను కించ పరిచేలా ‘‘మంది మాటలు పట్టుకొని మారుమానం పోతే’’ అని వ్యాఖ్యానించారని, దీనిపై వెంటనే మహిళలకు క్షమాపణ చెప్పాలని సంజయ్​ డిమాండ్‌ చేశారు.  ఎంఐఎం ఆధిపత్యం చెలాయిస్తోంది కాబట్టే పాతబస్తీలో ఇంటిపన్ను, నల్లా బిల్లు కడుతలేరని ఆరోపించారు.

ప్రగతిభవన్​కు ఒవైసీ ఎందుకెళ్లారు?

‘‘మేయర్‌ సీటును ఎంఐఎం పార్టీకి ఇవ్వాలని టీఆర్​ఎస్​ చూస్తోంది. ఇదే విషయం మేం మొదటి నుంచీ చెప్తున్నాం. అందుకే ప్రచార సభలో మేయర్‌ అంశాన్ని కేసీఆర్‌ ప్రస్తావించలేదు. మేం చెప్పింది నిజం కాకుంటే ఎన్నికల షెడ్యూల్​కు ముందు ఒవైసీ  ప్రగతి భవన్‌కు ఎందుకు వెళ్లారో చెప్పాలి. ఇద్దరూ కలిసే ఎన్నికల డేట్‌ ప్రకటించారు” అని బండి సంజయ్​ అన్నారు. ఎంఐఎంతో సంబంధం లేకుంటే ఓల్డ్‌ సిటీలో పోటీ చేస్తున్న టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు ఎందుకు ప్రచారం చేయడం లేదని నిలదీశారు.  మేయర్‌ ఎంఐఎంకు ఇవ్వడంతోపాటు ప్రభుత్వంలోనూ ఎంఐఎం భాగస్వామి కాబోతున్నదని, దీంతో రాష్ట్రానికి ఇద్దరు ముఖ్యమంత్రులు రాబోతున్నారని ఆయన చెప్పారు. హైదరాబాద్‌ ఇమేజీని దెబ్బతీసే ప్రయత్నం కేసీఆర్‌ చేస్తున్నరన్నారు. ఇప్పుడు కూడా హైదరాబాద్‌ ప్రశాంతంగా లేదని, అంబర్‌పేట్‌ వరకు ఎంఐఎం విస్తరించిందని, అక్కడి నుంచి హిందువులను వెళ్లగొడుతున్నారని చెప్పారు. రానున్న రోజుల్లో మిగతా సిటీకి విస్తరించాలని ఎంఐఎం చూస్తోందని ఆరోపించారు. ప్రశాంతమైన భాగ్యనగరం బీజేపీతోనే సాధ్యమని చెప్పారు. బీజేపీ అధికారంలోకి వస్తేనే సంఘ విద్రోహ శక్తులు తోకముడిచి పారిపోతాయన్నారు.

తరిమికొట్టడానికి నషంతో ప్రజలు రెడీ

హైదరాబాద్‌లో విధ్వంసం జరుగుతుందనే పక్కా సమాచారం ఉంటే ఎందుకు అరెస్టు చేయడం లేదని కేసీఆర్​ను బండి సంజయ్​ ప్రశ్నించారు. కేసీఆర్‌ నిజమైన హిందువు అయితే భాగ్యలక్ష్మీ టెంపుల్‌కు ఎందుకు రాలేదన్నారు. ప్రజలు దుబ్బాకలో టీఆర్‌ఎస్‌ను దెబ్బకొట్టారని.. జీహెచ్‌ఎంసీ ప్రజలు నషం, జెండూబామ్‌, రోకలిబండతో తరమి కొట్టడానికి రెడీగా ఉన్నారని పేర్కొన్నారు.

ప్రభుత్వాన్ని కూల్చాలనే ఆలోచన మాకు లేదు

ప్రభుత్వాన్ని కూల్చాలనే ఆలోచన బీజేపీకి ఏమాత్రం లేదని సంజయ్​ స్పష్టం చేశారు.  రజాకార్ల, గడీల పాలనకు వ్యతిరేకంగా టీఆర్‌ఎస్‌ నేతల్లోనే తిరుగుబాటు రాబోతుందని చెప్పారు. మంత్రులు, ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేయబోతున్నారని అన్నారు.

నా మీద  ఎన్ని కేసులు పెట్టినా భయపడ

పీవీ, ఎన్టీఆర్​ ఘాట్లపై చెయ్యేస్తే దారుస్సలాంను కూల్చేస్తామని సంజయ్​ మరోసారి స్పష్టం చేశారు. తనపై రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని కేసులు పెట్టినా భయపడబోనని, ఇప్పటికే అనేకసార్లు చావు అంచుల వరకు వెళ్లి వచ్చానని అన్నారు. బరాబర్ తెలుగు ప్రజలు, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కోసం మాట మీద నిలబెడుతానని చెప్పారు. టీఆర్​ఎస్​ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని, ఈ అవినీతి ప్రభుత్వం గ్రేటర్ ఎన్నికల తర్వాత ఎప్పుడైనా దానంతట అదే కూలిపోవచ్చన్నారు. సీఎం కేసీఆర్ జైలుకు పోవటం ఖాయమన్నారు. శనివారం గ్రేటర్లోని పలు డివిజన్లలో సంజయ్​ ప్రచారం చేశారు.  భారత్ బయోటెక్ కు ఇప్పటి వరకు కేసీఆర్  ఎందుకు పోలేదని.. కార్పొరేట్​ హాస్పిటల్స్ తో కేసీఆర్ కుమ్మక్కవడమే దీనికి కారణమని ఆరోపించారు. ‘‘కేసీఆర్ హైదరాబాద్ లో ఉండి కూడా వరద బాధితులను పరామర్శించడానికి రాలేదు. కేటీఆరేమో మోడీ ఎందుకు రాలేదని అడుగుతున్నరు.  మరి మీ అయ్య కేసీఆర్ ఎక్కడ ఉన్నారు కేటీఆర్” అని సంజయ్​ నిలదీశారు. ప్రతి డివిజన్ కు టీఆర్​ఎస్ రూ. 5 కోట్లు పంచుతోందని ఆరోపించారు. ‘‘తాగి బండి నడిపితే కేసు పెడుతున్నరు. మరి, తాగి రాష్ట్రాన్ని నడిపితే నేరం కాదా..? కేసీఆర్ ను జైల్ కు  పంపొద్దా” అని ప్రశ్నించారు.