![కేటీఆర్.. దమ్ముంటే ఓల్డ్ సిటీలో మసీదులు కూల్చు :బండి సంజయ్](https://static.v6velugu.com/uploads/2023/02/Bandi-Sanjay_cvhx1mUYQp.jpg)
రాష్ట్రంలో రోడ్లకు అడ్డంగా ఉన్న ఆలయాలు, మసీదులు కూలుస్తామన్న మంత్రి కేటీఆర్..ముందు ఓల్డ్ సిటీలో అడ్డంగా ఉన్న మసీదులు కూల్చాలని బండి సంజయ్ సవాల్ విసిరారు. కూల్చివేతలు ఓల్డ్ సిటీ నుంచే ప్రారంభించాలని సూచించారు. బీఆర్ఎస్, ఎంఐఎం ఒక్కటేనని పేర్కొన్నారు. కానీ వేర్వేరు అన్నట్టుగా ఇరు పార్టీల నేతలు నాటకాలు ఆడుతున్నారని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు కలిసి పోటీచేస్తే బీజేపీ సత్తా ఏమిటో చూపిస్తామన్నారు. తెలంగాణలో రజాకార్ల రాజ్యం పోయి.. రామ రాజ్యం రావాలని ఆకాంక్షించారు. దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా బీజేపీదే విజయమని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజల సమస్యలు వినేవాళ్లు ఎవరూ లేరని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారని ఆరోపించారు. బోయినపల్లిలో నిర్వహించిన బీజేపీ కార్నర్ మీటింగ్స్ లో బండి సంజయ్ పాల్గొన్నారు.
బీఆర్ఎస్ గద్దె దించుతాం
వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీఆర్ఎస్ ను గద్దె దించుతామని బండి సంజయ్ అన్నారు. రాష్ట్రంలో ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారని ఫైర్ అయ్యారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన బీజేపీ నేతలపై నాన్ బెయిలబుల్ కేసులు పెడుతున్నారుని మండిపడ్డారు. 10 వ తారీఖు వచ్చినా ఉద్యోగులకు జీతాలు అందడం లేదని పేర్కొన్నారు. అక్బరుద్దీన్ ఒవైసీ కళ్లల్లో ఆనందం చూసేందుకే సీఎం కేసీఆర్ సెక్రటేరియట్ ను తాజ్ మహల్లా నిర్మించారని విమర్శించారు. ఒవైసీ సెక్రటేరియట్ ను తాజ్ మహల్ ఉందనడం అందుకు నిదర్శమన్నారు. తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్ నుంచే 60 శాతం రెవెన్యూ వస్తోందని కానీ ..హైదరాబాద్ అభివృద్ధిని మాత్రం పట్టించుకోవడం లేదన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి పనులకు కేంద్రం డబ్బులు ఇస్తోందని చెప్పుకొచ్చారు. సీఎం కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు చెబుతున్నారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ప్రధాని అవాస్ యోజన కింద ఇండ్లను నిర్మిస్తోందని.. కానీ డబుల్ బెడ్రూం ఇండ్లను కడతామన్న కేసీఆర్.. ఒక్క నియోజకవర్గంలోనైనా ఇండ్లు కట్టారా? అని ప్రశ్నించారు. ఫసల్ భీమా, ఆయుష్మాన్ భారత్ దేశ వ్యాప్తంగా అమలు చేస్తుంటే తెలంగాణ ప్రభుత్వం మాత్రం అడ్డుకుంటోందని విమర్శించారు. రాష్ట్రంలో 24 గంటల కరెంట్ ఇస్తున్నారనడం పచ్చి అబద్ధమన్నారు. రైతులు కరెంట్ అందక ఆందోళన చేస్తున్నారని ఆరోపించారు. విద్యుత్ సకాలంలో లేకపోవడంతో పంటలు ఎండిపోతన్నాయన్నారు.