నిర్మల్/భైంసా, వెలుగు: ఇచ్చిన మాట తప్పడంలో సీఎం కేసీఆర్‌ను మించినోళ్లు ఎవరూ లేరని బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్అన్నారు. జాగా ఉన్నోళ్లందరికీ ఇంటి నిర్మాణం కోసం రూ. 5 లక్షలు ఇస్తానని అసెంబ్లీ సాక్షిగా చెప్పి, మాట తప్పిన కేసీఆర్ అదే అసెంబ్లీలో చెంపలేసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. బుధవారం ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా నిర్మల్ జిల్లా గుండెగాం, మహగాం, కుభీర్ మండలం చాత వరకు 11.8 కిలోమీటర్లు ఆయన పాదయాత్ర చేశారు. గుండెగాం ముంపు బాధితులతో ముఖాముఖిలో, భైంసా మండలం మహగాంలో జరిగిన సమావేశంలో సంజయ్ మాట్లాడారు. ‘‘80 వేల ఉద్యోగాల సంగతేమైంది? ఇప్పటివరకు ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేశావు?” అని సీఎంను ప్రశ్నించారు. ప్రధాని మోడీ ఏడాదిన్నరలో10 లక్షల ఉద్యోగాలను భర్తీ చేశారని, రెండు నెలల్లో 1.45 లక్షల ఉద్యోగాలు కల్పించారన్నారు. తెలంగాణలో ఇండ్ల నిర్మాణం కోసం కేంద్రం రూ. 4 వేల కోట్లకుపైగా నిధులిస్తే.. ఆ సొమ్మును దారి మళ్లించిన ఘనుడు కేసీఆర్ అని విమర్శించారు.
సర్కార్ నిర్లక్ష్యంతోనే రైతు ఆత్మహత్యలు
ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద తెలంగాణకు 2.40 లక్షల ఇండ్లను కేంద్రం మంజూరు చేసిందని సంజయ్ వెల్లడించారు. ఎరువులపై రైతులకు కేంద్రం దాదాపు రూ.36 వేల కోట్ల సబ్సిడీ ఇస్తోందన్నారు. పంటలకు కనీస మద్ధతు ధర కల్పిస్తోందన్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల వడ్ల కుప్పలపై రైతన్నలు ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితిని చూస్తున్నామన్నారు. విద్యార్థులు కూడా ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల ఎవాల్యుయేషన్ లో ప్రభుత్వ నిర్వాకం వల్ల సిరిసిల్లలో ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకుందని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రజలను దోచుకుతింటున్న పెద్దల రాజ్యం పోయి.. పేదల రాజ్యం రావాలని, అది బీజేపీతోనే సాధ్యమన్నారు.
గుండెగాం ప్రజలను ఆదుకోవాలె
గుండెగాం ప్రజలు ఏ పాపం చేశారు? రంగారావు ప్రాజెక్టు బ్యాక్ వాటర్‌తో ఊరు మునిగిపోతున్నా ఎందుకు ఆదుకోవడం లేదు? అని సంజయ్ ప్రశ్నించారు. టీఆర్ఎస్ నేతలను గుండెగాంకు తీసుకొచ్చి రచ్చబండపై కట్టేయాలని పిలుపునిచ్చారు. కమీషన్ల కోసం ప్రగతి భవన్, సెక్రటేరియెట్, కాళేశ్వరం లాంటివి సీఎం కడుతున్నారని, కమీషన్లు రావనే గుండెగాం ప్రజలను గాలికి వదిలేశారన్నారు. కేవలం 250 కుటుంబాలు ఉన్న ఒక గ్రామ పంచాయతీనే ఆదుకోలేనోడు.. తెలంగాణను ఎలా కాపాడతాడు? దేశ సమస్యలను ఎలా పరిష్కరిస్తాడు? అని ప్రశ్నించారు.
సమస్యలు చెప్తే బెదిరింపులా?
'సంజయ్ అన్న.. నేను మా గుండెగాం సమస్యలు ఎప్పుడు పరిష్కరిస్తరని జిల్లా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఎమ్మెల్యే విఠల్ రెడ్డికి మొన్న ఫోన్ చేసిన.. అంతే నన్ను పోలీసులు స్టేషన్ కు పిలిపించి బెదిరించిన్రు.. అయినా బెదరలే.. మన పార్టీ లీడర్లు రమాదేవి, మోహన్ రావు పటేల్, రామారావు పటేల్ ధైర్యం చెప్పిన్రు’ అని బండి సంజయ్ తో గుండెగాం యువకుడు జ్ఞానేశ్వర్ పటేల్ తన గోడు వెళ్లబోసుకున్నాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ ధైర్యం కోల్పోవద్దని, పార్టీ అండగా ఉంటుందని అతనికి సంజయ్ భరోసా ఇచ్చారు.
సమస్యలను పరిష్కరించాలని మంత్రిని, ఎమ్మెల్యేను కోరితే పోలీసులతో బెదిరించడం ఏమిటని ఫైర్ అయ్యారు. కార్యక్రమంలో బీజేపీ ఎంపీ సోయం బాపురావు, పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంగిడి మనోహర్ రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి సంగప్ప, మాజీ ఎమ్మెల్యే బొడిగ శోభ, పార్టీ జిల్లా అధ్యక్షురాలు రమాదేవి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మోహన్‌రావు పటేల్, సుహాసిని రెడ్డి, నేతలు రామారావు పటేల్, నారాయణరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.