- ఇసుక, డ్రగ్స్, ల్యాండ్ మాఫియాగా మారి కోట్లు సంపాదిస్తున్నరు
- ఈడీని ప్రయోగిస్తే టీఆర్ఎస్ లో ఒక్కరూ మిగలరు
- మంత్రి కాల్పులతో రజాకార్ల పాలన గుర్తుకొస్తోంది
యాదాద్రి, వెలుగు: టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు లైసెన్స్ ఉన్న గూండాల్లా వ్యవహరిస్తున్నారని బీజేపీ స్టేట్ చీఫ్ సంజయ్ ఆరోపించారు. ‘‘సీఎం కేసీఆర్ బరితెగించిండు. చీకటి వ్యాపారాలు చేసుకొమ్మని అనుమతిచ్చిండు. దీంతో మంత్రులు, ఎమ్మెల్యేలు రెచ్చిపోతున్నరు. లైసెన్స్ఉన్న గూండాల్లా తయారయ్యారు. వాళ్ల అనుచరులు హత్యలు, అత్యాచారాలకు పాల్పడుతున్నరు” అని మండిపడ్డారు. పాదయాత్రలో భాగంగా ఆదివారం యాదాద్రి జిల్లా మోత్కూర్, గుండాలలో మీడియాతో.. తుర్కలషాపూర్ లో నిర్వహించిన రచ్చబండలో సంజయ్ మాట్లాడారు. టీఆర్ఎస్ పాలన చూస్తుంటే రజాకార్ల రాజ్యం గుర్తుకొస్తోందని ఆయన విమర్శించారు. ‘‘75 ఏండ్ల స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుగుతుంటే, బాధ్యత గల మంత్రి కాల్పులు జరిపి సమజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు. ఆయన కాల్పులు చూస్తుంటే రజాకార్ల పాలన గుర్తుకొస్తోంది” అని అన్నారు. ‘‘టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు చీకటి వ్యాపారాలు చేస్తున్నారు. ఇసుక, డ్రగ్స్, ల్యాండ్ మాఫియాగా మారి రూ.కోట్ల సంపద దోచుకుంటున్నరు. 2014, 2018 ఎన్నికల అఫిడవిట్లు చూస్తే ఎంత దోచుకున్నరో తెలుస్తుంది. టీఆర్ఎస్ ఆరోపిస్తున్నట్టుగా కేంద్రం ఈడీని ప్రయోగిస్తే మంత్రులు, ఎమ్మెల్యేలందరూ జైలుకు పోతరు. పార్టీలో ఒక్కరు కూడా మిగలరు. కానీ మేం ఈడీ విషయంలో జోక్యం చేసుకోం” అని అన్నారు. కాగా, కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై సంజయ్ ప్రశంసలు కురిపించారు. ‘‘మంచిని మంచి, చెడును చెడు అని చెప్పే మంచి పొలిటీషియన్ వెంకట్ రెడ్డి. అభివృద్ధి పనుల కోసం ప్రధాని మోడీ సహా కేంద్ర మంత్రులను కలిసేవారు. మేం ఏనాడూ రాజకీయాలు చర్చించుకోలేదు. ఆయన టచ్‌లో ఉన్నారని నేను అనలేదు” అని చెప్పారు.
కేసీఆర్ ఫామ్ హౌస్ కు 30 గ్రామాల కరెంట్..
అర్హులైన రైతులకు రైతుబంధు ఇవ్వని కేసీఆర్.. ఫామ్హౌస్ఉన్నోళ్లకు మాత్రం ఇస్తున్నారని సంజయ్ విమర్శించారు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ పేరుతో 30 గ్రామాలకు ఇవ్వాల్సిన కరెంట్‌ను తన ఫామ్‌హౌస్ కే సరఫరా చేయించుకుంటున్నారని ఆరోపించారు. ఆ బిల్లు తానే ఇస్తున్నానని గొప్పలు చెప్పుకుంటున్న కేసీఆర్.. ఇప్పటి వరకు కట్టలేదని అన్నారు. టీఆర్ఎస్ సర్కార్ సర్పంచ్‌లను పట్టించుకోకపోవడం లేదని, వాళ్లు కూలీలుగా మారి ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం ఇస్తున్న నిధులతోనే పంచాయతీల్లో అభివృద్ధి జరుగుతోందన్నారు. ‘‘ఉచిత పథకాలు వద్దని ప్రధాని చెప్పలేదు. పేదల కోసం ఎన్ని సంక్షేమ పథకాలనైనా మోడీ అమలు చేస్తారు. కేటీఆర్ కావాలనే మోడీపై ఆరోపణలు చేస్తున్నరు” అని సంజయ్ అన్నారు.
మునుగోడులో బీజేపీదే విజయం..
మునుగోడులో ఓటమి తప్పదని కాంగ్రెస్, టీఆర్ఎస్ పారిపోయాయని విమర్శించారు. అమ్ముడుపోయే కమ్యూనిస్టు లీడర్లు ఎప్పుడు ఎవరితో ఉంటారో తెలియదని కామెంట్ చేశారు. లీడర్లు అమ్ముడుపోతున్నా.. కమ్యూనిస్టు కార్యకర్తలు మాత్రం మంచోళ్లన్నారు. కేసీఆర్ బొమ్మ పెట్టుకొని తిరిగితే ఓట్లు పడే రోజులు పోయాయని.. టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేల రాజకీయ భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారిందని అన్నారు. ఎంత మంది మంత్రులను దింపినా, ఎంత డబ్బు పంచినా గెలిచేది తామేనని అన్నారు.
దేశ విభజనకు కాంగ్రెస్సే కారణం..
దేశ విభజనకు కాంగ్రెస్సేకారణమని సంజయ్ ఆరోపించారు. ఆ టైమ్ లో మోడీ, అమిత్ షా ఉండి ఉంటే.. విభజన జరగకపోయేదన్నారు. ఎంఐఎం పుట్టకపోయేదన్నారు. స్వాతంత్ర్యోద్యమ చరిత్రను కాంగ్రెస్ కనుమరుగు చేసిందని.. గాంధీ కుటుంబం గురించి తప్ప, దేశం కోసం ప్రాణాలర్పించిన మహనీయుల గురించి ఏనాడూ చెప్పలేదన్నారు. దేశానికి కాంగ్రెస్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కాగా, తుర్కలషాపూర్ లో సంజయ్ ని గౌరవెల్లి ప్రాజెక్టు బాధితులు కలిశారు. వారికి అండగా ఉంటామని, పరిహారం కోసం పోరాటం చేస్తామని ఆయన భరోసా ఇచ్చారు. ఇక్కడ పాదయాత్రలో బీజేపీ అధికార ప్రతినిధి విఠల్ పాల్గొన్నారు.