మీరే ఇటలీకి గులాములు:కేంద్రమంత్రి కిషన్​రెడ్డి

  • సీఎం రేవంత్​రెడ్డిపై కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి ఫైర్​
  •  గాంధీ, పటేల్, మోదీ పుట్టినగుజరాత్ గడ్డకు నేను గులాంనే
  • అక్రమాలపై ప్రశ్నిస్తే వ్యక్తిగతంగాబురదజల్లుతున్నరు
  • గత బీఆర్ఎస్ సర్కార్​లాగే కాంగ్రెస్​ పాలన ఉందని విమర్శ

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వ అక్రమ వ్యవహారాలు, వైఫల్యాలపై ప్రశ్నిస్తే జవాబు చెప్పలేక వ్యక్తిగతంగా బురదజల్లుతున్నరని బీజేపీ స్టేట్ చీఫ్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. సీఎం రేవంత్​రెడ్డి మాటలతో కాలం గడుపుతున్నారని ఆయన విమర్శించారు. 

“నేను గుజరాత్​కి గులాం అంటూ సీఎం రేవంత్ అంటున్నాడు. గాంధీ, పటేల్, ప్రధాని మోదీ పుట్టిన గడ్డ గుజరాత్​కు గులామ్​నే. నేను భారతీయులకు మాత్రమే గులాంను. మీలా నకిలీ గాంధీ కుటుంబానికి గులాంను కాదు. మీరు ఇటలీకి గులాములు” అని అన్నారు. సోమవారం హైదరాబాద్ శివారులోని బొంగులూరులో బీజేపీ స్టేట్ లెవెల్ వర్క్ షాప్ జరిగింది. చీఫ్ గెస్టుగా హాజరైన కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో గత బీఆర్ఎస్ ​ప్రభుత్వం మాదిరిగానే కాంగ్రెస్ పాలన నడుస్తున్నదన్నారు.

 కాంగ్రెస్, బీఆర్ఎస్ తీరుపై ప్రజలు విసిగిపోయారన్నారు. సమస్యలపై చర్చ చేయడం లేదని, వ్యక్తులను విమర్శించడమే రాజకీయంగా మారిపోయిందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు, భూదందాలను ప్రశ్నిస్తే జవాబు చెప్పే సత్తాలేక.. వ్యక్తిగతంగా తనపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ అంటేనే అబద్ధాలకు కేరాఫ్ అని ఆరోపించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులు వ్యక్తిగత ఆరోపణలతో రాజకీయాలను కలుషితం చేస్తున్నారని మండిపడ్డారు. 

ప్రజలను రెచ్చగొట్టి ఎక్కువ కాలం రాజకీయాలు చేయలేరని, రాష్ట్రంలో ఉన్న దిగజారుడు రాజకీయాలు దేశంలో ఎక్కడా లేవని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి మాటలతో కాలం గడుపుతున్నారని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేసి ఢిల్లీకి డబ్బులు పంపుతూ ఏడాది పాలన సాగించారని ఆరోపించారు. సమావేశంలో ఎంపీలు డీకే అరుణ, ఈటల రాజేందర్, బీజేఎల్​పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి, పార్టీ నేతలు రాంచందర్ రావు, కాసం వెంకటేశ్వర్లు, ప్రభాకర్, చింతల రాంచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

వచ్చే నెల 1 నుంచి ఆందోళనలు..

రాష్ట్రంలో కాంగ్రెస్ ఏడాది పాలన వైఫల్యాలపై బీజేపీ ఆందోళన బాట పడుతోంది. డిసెంబర్ 1 నుంచి 5 వరకూ రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని స్టేట్ వర్క్​ షాప్ లో నిర్ణయించింది. డిసెంబర్1న మండలస్థాయిలో బైక్ ర్యాలీలు నిర్వహించనుంది. 2న అసెంబ్లీ నియోజకవర్గాల్లో నిరసన కార్యక్రమాలు, 3న అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో భారీ బహిరంగ సభలు నిర్వహించాలని డిసైడ్ అయింది. వచ్చేనెల 5న రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుచేయలేదని చార్జిషీట్ విడుదల చేయాలని నిర్ణయించింది.

మండల కమిటీల్లో 30 శాతం కొత్తవాళ్లకు 

రాష్ట్రంలో ఇప్పటివరకూ సుమారు 35 లక్షల సభ్యత్వాలు నమోదైనట్టు కిషన్ రెడ్డి చెప్పారు. ఈ నెల చివరికల్లా పోలింగ్ బూత్ కమిటీల సిద్ధం చేయాలని సూచించారు. ఈ నెల 22న ఢిల్లీలో పార్టీ సంస్థాగత ఎన్నికల సమావేశం ఉందన్నారు. అందులో మండల, జిల్లా కమిటీల ఎన్నికల తేదీలను ప్రకటిస్తారని పేర్కొన్నారు. బూత్ అధ్యక్షుల్లో మహిళలు ఎస్సీ, ఎస్టీలకు సభ్యత్వం కల్పించాలని సూచించారు. బీజేపీ మండల కమిటీల్లో 30 నుంచి 35 శాతం కొత్త రక్తం ఉండాలని ఆదేశించారు.