నిజామాబాద్/నిజామాబాద్ టౌన్/మాక్లూర్, వెలుగు: స్వాతంత్ర్యం కోసం భగత్‌సింగ్ చేసిన పోరాటం మరువలేనిదని, ఆయనను స్ఫూర్తిగా తీసుకుని యువత ముందుకు సాగాలని బీజేపీ రాష్ట్ర కమిటీ సభ్యుడు ధన్‌పాల్ సూర్యనారాయణ పిలుపునిచ్చారు. భగత్‌సింగ్ జయంతి సందర్భంగా బుధవారం దేవీ రోడ్ చౌరస్తాలో ఉన్న ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ధన్‌పాల్ మాట్లాడుతూ టీఆర్ఎస్ పాలనలో అన్నివర్గాల ప్రజలు దోపిడీకి గురువుతున్నారని ఆరోపించారు. భగత్ సింగ్ పోరాట పటిమను ఆదర్శంగా తీసుకుని కేసీఆర్ నియంతృత్వ వైఖరిపై ఉద్యమించాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో బీజేపీ నేతలు మాస్టర్ శంకర్, బురుగుల వినోద్, నాగోళ్ల లక్ష్మీనారాయణ, భాస్కర్‌రెడ్డి, అమంద్ విజయ్, రోషన్ బోర, కుమార్, భరత్ భూషణ్ పాల్గొన్నారు. పీడీఎస్‌యూ, పీవైఎల్ ఆధ్వర్యంలో కూడా భగత్ సింగ్ జయంతిని నిర్వహించారు. కార్యక్రమంలో పీవైఎల్ రాష్ట్ర అధ్యక్షుడు సాయిరెడ్డి, పీడీఎస్‌యూ లీడర్లు సాయి కృష్ణ, రాజేశ్వర్, భాస్కర్, సాయిలు, గంగాధర్ పాల్గొన్నారు. మాక్లూర్ మండలం బోర్గాంకేలో పీవైఎల్ ఆధ్వర్యంలో భగత్ సింగ్ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమలో కుతాడి గంగాధర్, రాధ, సరోజ, నర్సక్క పాల్గొన్నారు.
హమాలీల సమస్యలు పరిష్కరించాలి
బోధన్, వెలుగు: తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బోధన్ ఆర్డీవో ఆఫీసు ముందు హమాలీలు బుధవారం నిరసన చేపట్టి ఏవో ముంతాజుద్దీన్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఐఎఫ్టీయూ జిల్లా సహాయ కార్యదర్శి బి.మల్లేష్ మాట్లాడుతూ హమాలీలకు ఉపాధి భద్రతతో కూడిన చట్టాన్ని తీసుకు రావాలని డిమాండ్ చేశారు. దేశంలోని అసంఘటిత కార్మికులు 42 కోట్ల మంది ఉన్నారన్నారు. హమాలీలకు ప్రతి నెల రూ.26 వేల వేతనం ఇవ్వాలని, కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, ఫీఎఫ్, ఈఎస్ఐ అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఐఎఫ్టీయూ నాయకులు ప్రవీణ్, గంగాధర్, హనుమంతు, పోశెట్టి, గంగాధర్, రాములు, శ్రీనివాస్, శంకర్ పాల్గొన్నారు.
పిట్లంలో రెండు హాస్పిటళ్లకు నోటీసులు
పిట్లం, వెలుగు: పిట్లంలోని ప్రైవేట్ హాస్పిటళ్లు, ల్యాబ్‌లను కామారెడ్డి నుంచి వచ్చిన ప్రత్యేక బృందాలు తనిఖీ చేశాయి. కలెక్టర్ ఆదేశాల మేరకు డాక్టర్ ప్రవీణ్‌కుమార్, డాక్టర్ వెంకటేశ్వర్లు, సాయన్న పిట్లంలోని పలు హాస్పిటళ్లలో తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా ఆరోగ్య హాస్పిటల్‌లో డాక్టర్ హరిణిరెడ్డి పేరున లైసెన్స్ తీసుకుని నిబంధనలకు విరుద్ధంగా ఆయుర్వేద డాక్టర్ కళ్యాణిగౌడ్ ట్రీట్‌మెంట్ చేయడం గుర్తించారు. అలాగే ల్యాబ్కూడా రూల్స్‌కు విరుద్ధంగా ఉండడంతో నోటీసులు ఇచ్చారు. వారం లోపు అల్లోపతి డాక్టర్హరిణిరెడ్డి ఉండేలా చర్యలు తీసుకోవాలని, లేదంటే హాస్పిటల్‌ను సీజ్ చేస్తామన్నారు. దీంతో పాటు ఆన్లైన్లో డీడీలు చెల్లించి డీఎంహెచ్‌వో పర్మిషన్ తీసుకోకపోవడంపై ట్రైడెంట్ హాస్పిటల్ డాక్టర్ పూజితకు నోటీసులు ఇచ్చారు.
తీర్మానం చేయడమేనా.. పనులు చేసేది ఉందా!
పిట్లం, వెలుగు: రాంపూర్‌లో సొసైటీ బిల్డింగ్ శిథిలావస్థకు చేరుకుందని కొత్త భవనం నిర్మించాలని గత కొంత కాలంగా ప్రతి మీటింగ్‌లో తీర్మానం చేస్తున్నా పట్టించుకోవడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం రాంపూర్‌లో చిల్లర్గి విండో మహాజన సభ సొసైటీ ప్రెసిడెంట్ శపథంరెడ్డి అధ్యక్షతన జరిగింది. సంఘం బిల్డింగ్ కూలి పోతుందని ప్రతి మీటింగ్‌లో చెబుతున్నా ఇప్పటి వరకు ఎందుకు నిర్మించడం లేదని రైతులు సీఈవో సంతోష్‌రెడ్డిని ప్రశ్నించారు. రాంపూర్‌లో కాకుండా మరో చోట బిల్డింగ్ నిర్మిస్తే మరో సారి మీటింగ్ కానివ్వమని స్పష్టం చేశారు. వచ్చే మీటింగ్వరకు పనులు ప్రారంభించాలని తీర్మానం చేశారు. చిల్లర్గిలో కొత్తగా నిర్మించిన గోదాం చుట్టూ ఉన్న సొసైటీ భూమిని ధాన్యం ఆరబెట్టుకోవడానికి వీలుగా మొరం పోసి చదును చేయాలని కోరారు. సమావేశంలో సంఘం వైస్ ప్రెసిడెంట్ రాములు, రాంపూర్ సర్పంచ్ నారాయణరెడ్డి, వైస్ ఎంపీపీ లక్ష్మారెడ్డి, శంకర్, రైతులు పాల్గొన్నారు.
కేంద్రీయ విద్యాలయం కోసం నిరాహార దీక్ష
పిట్లం, వెలుగు: మండల కేంద్రంలో కేంద్రీయ విద్యాలయం ప్రారంభించాలని కోరుతూ గ్రామస్తులు బుధవారం నిరాహార దీక్ష చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మూడేళ్ల కింద మంజూరైన కేంద్రీయ విద్యాలయాన్ని ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని ఆరోపించారు. కొందరు దానిని మార్చేందుకు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ఎంపీ బీబీ పాటిల్ మాత్రం విద్యాలయాన్ని ఎక్కడికి వెళ్లనివ్వమని చెబుతున్నా.. పనులు ఎందుకు ప్రారంభించడం లేదని ప్రశ్నించారు. మొదటి రోజు 13 మంది దీక్షలో పాల్గొనగా కాంగ్రెస్ నాయకులు గడుగు గంగాధర్ వారికి మద్దతు ప్రకటించారు. ఆఫీసర్లు స్పష్టమైన హామీ ఇచ్చే వరకు దీక్ష కొనసాగుతుందని తెలిపారు.
బీజేపీ మండల మాజీ ప్రెసిడెంట్ మృతి
ఆర్మూర్, వెలుగు: బీజేపీ మాజీ మండల ప్రెసిడెంట్ ఆలూర్ గ్రామానికి చెందిన వేల్పూర్ భూమేశ్ బుధవారం గుండెపోటుతో చనిపోయారు. గ్రామంలో జరిగిన అంత్యక్రియలకు పార్టీ ప్రొద్దుటూరి వినయ్‌రెడ్డి హాజరై భూమేశ్‌కు నివాళులర్పించారు. భూమేశ్ మృతి పార్టీకి తీరని లోటన్నారు. ఆయన కుటుంబానికి పార్టీ అండగాఉంటుందని
భరోసా ఇచ్చారు.
డిచ్‌పల్లిలో కాంకర్డ్ డ్రైపోర్ట్
నిజామాబాద్ టౌన్, వెలుగు: రైల్వే శాఖ సహకారంతో నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లిలో కాంకర్డ్ డ్రైపోర్ట్‌ను ఏర్పాటు చేయనున్నట్లు కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా హైదరాబాద్ డివిజన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జి.ఆర్ శేషగిరిరావు తెలిపారు. నగరంలోని కపిల హోటల్‌లో బుధవారం నిజామాబాద్ చాంబర్ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రి ప్రతినిధులతో బుధవారం సమావేశమయ్యారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ డిచ్‌పల్లిలో డ్రైపోర్ట్ ఏర్పాటుకు గ్రౌండ్ వర్క్ పూర్తి చేశామని, త్వరలోనే పనులు ప్రారంభమవుతాయని చెప్పారు. దీంతో పరిశ్రమలు, భారీ ఫ్యాక్టరీలు వస్తాయని ఉద్యోగం, ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. సమావేశంలో చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు దినేశ్‌రెడ్డి, కాంకర్డ్ డివిజన్ ఇన్‌చార్జి హితేన్ బీమాని, సంజయ్ అగర్వాల్ పాల్గొన్నారు.
గంగారెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి
ఆర్మూర్, వెలుగు: ఆర్మూర్ మండలం ఆలూర్ గ్రామానికి చెందిన సీనియర్ నాయకులు ఆలూర్ గంగారెడ్డి కుటుంబాన్ని బుధవారం మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా గంగారెడ్డి చిత్రపటానికి మంత్రి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన వెంట సర్పంచ్ కళ్లెం మోహన్, సొసైటీ చైర్మన్ భోజారెడ్డి, చోటు, నడ్పి గంగారెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.
29 వరకు బీఎడ్ ఎగ్జామ్ ఫీజు గడువు
డిచ్‌పల్లి, వెలుగు: తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోని బీఎడ్ కాలేజీల్లోని 2, 3, 4 సెమిస్టర్ల బ్యాక్లాగ్ ఎగ్జామ్ ఫీజు గడువుని ఈ నెల 29 వరకు నిర్ణయించినట్లు సీవోఈ అరుణ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. రూ.100 లేట్‌ఫీజుతో 30 వరకు చెల్లించవచ్చన్నారు. ఇదిలా ఉండగా బుధవారం ప్రకటన విడుదల చేసి గురువారం చివరి తేదీగా నిర్ణయించడంపై స్టూడెంట్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
నాలుగో రోజూ సాగిన సంబురం
బతుకమ్మ సంబురాలు ఘనంగా కొనసాగుతున్నాయి. నాలుగో రోజైన బుధవారం మహిళలు ఉత్సాహంగా బతుకమ్మలను పేర్చి పూజలు చేసి సాయంత్రం ఉయ్యాల పాటలతో ఆటలాడారు. నిజామాబాద్ నగరంలోని ఎస్ఎస్ఆర్ విద్యాసంస్థల ఆధ్వర్యంలో బతుకమ్మ ఫెస్ట్ ఘనంగా నిర్వహించారు. అలాగే వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో కూడా బతుకమ్మ సంబురాలు జరిగాయి.
- వెలుగు ఫొటోగ్రాఫర్, నిజామాబాద్
శక్కర్‌నగర్‌కు పూర్వవైభవం తెస్తాం
బోధన్, వెలుగు: పట్టణంలోని శక్కర్‌నగర్‌కు పూర్వవైభవం తెస్తామని ఎమ్మెల్యే షకీల్ పేర్కొన్నారు. శక్కర్‌నగర్‌లో ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానాను బుధవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ శక్కర్‌నగర్ వాసులకు బోధన్‌లోని గవర్నమెంట్హాస్పిటల్కు వెళ్లేందుకు రూ.200 ఖర్చు అవుతుండడంతో వారి సమస్యను గుర్తించే బస్తీ దవాఖానాను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. దవాఖానాను త్వరగా పూర్తి చేయించిన నిజామాబాద్డీఎంహెచ్వోను అభినందించారు. అనంతరం పట్టణం పక్కనే ఉన్న చెక్కి చెరువులో చేప పిల్లలను వదిలారు. తర్వాత ఏఆర్ గార్డెన్‌లో ఏర్పాటుచేసిన బతుకమ్మ చీరలు పంపిణీలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ రజిత యాదవ్, ఆర్డీవో రాజేశ్వర్, డీఎంహెచ్‌వో సుదర్శనం, మున్సిపల్ చైర్ పర్సన్ తూము పద్మావతి, ఎంపీపీ బుద్దె సావిత్రి, జడ్పీటీసీ గిర్దావర్ లక్ష్మీబాయి, మార్కెట్ చైర్మన్ వి.ఆర్ దేశాయ్, డీసీసీబీ డైరెక్టర్ గిర్దావర్ గంగారెడ్డి, టీఆర్ఎస్ టౌన్, రూరల్ ప్రెసిడెంట్లు రవీందర్‌యాదవ్, నర్సయ్య పాల్గొన్నారు.
బీజేపీ బూత్ కమిటీల నియామకం
ఆర్మూర్, వెలుగు: బీజేపీ బూత్ కమిటీల నియామకం త్వరగా పూర్తి చేయాలని ఆ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి న్యాలం రాజు సూచించారు. బుధవారం ఆర్మూర్ టౌన్ లోని 4వ, 5వ వార్డులో 23, 24, 25, 26, 27, 28వ బూత్ కమిటీలను నియమించారు. ఈ సందర్భంగా రాజు మాట్లాడుతూ బూత్ స్థాయి నుంచి బీజేపీని పటిష్టం చేస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో బీజేపీ టౌన్ ప్రెసిడెంట్ జెస్సు అనిల్ కుమార్, కిసాన్ మోర్చా టౌన్ ప్రెసిడెంట్ పాలెపు రాజు, బీజేవైఎం మాజీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ప్రవీణ్‌రెడ్డి, బీజేవైఎం నిజామాబాద్ కార్పొరేషన్ ప్రెసిడెంట్ఓం ప్రకాశ్, నాయకులు సాయి కుమార్, మూడా మనోజ్, శక్తి కేంద్ర ఇన్‌చార్జిలు పాల్గొన్నారు.
అప్పులు తీర్చలేక వ్యాపారి పరారీ
నిజామాబాద్ క్రైమ్, వెలుగు: అప్పుల బాధతో ఓ వ్యాపారి భార్యాబిడ్డలను వదిలి ఇంటి నుంచి పారిపోయారు. ఈ ఘటన నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ముబారక్ నగర్‌లో జరిగింది.ఈనెల 25న ఉదయం సామ సందీప్‌రెడ్డి (39) తన సెల్ ఫోను, ద్విచక్ర వాహనం ఇంట్లోనే వదిలి చెప్పా పెట్టకుండా వెళ్లిపోయాడు. వడ్డీ వ్యాపారుల వేధింపులు భరించలేక తన భర్త ఇంటి నుంచి పారిపోయారని భార్య జయలక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ ఎస్సై లింబాద్రి తెలిపారు.
చెరువులో మునిగి మత్స్యకారుడి మృతి
నందిపేట, వెలుగు: మండల కేంద్రానికి చెందిన దుబ్బాక గణేశ్ (43) అనే మత్స్యకారుడు చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు నీటిలో మునిగి చనిపోయాడు. పోలీసులు, బాధిత కుటుంబ సభ్యులు తెలిసిన వివరాల ప్రకారం.. ఈనెల 26న తాళ్ల చెరువులో చేపల వేటకు వెళ్లిన గణేశ్ ఇంటికి తిరిగి రాలేదు. అతడి కోసం గ్రామంలో ఎంత వెతికినా ఆచూకీ దొరకలేదు. మంగళవారం సాయంత్రం తాళ్ల చెరువులో శవం నీటిపై తేలింది. చెరువులోకి దిగిన ఆయన కాళ్లు, చేతులకు వల చుట్టుకోవడంతోనే మృతి చెంది ఉంటాడని భావిస్తున్నారు. మృతుడి భార్య లావణ్య ఫిర్యాదు మేరకు బుధవారం కేసు ఫైల్ చేసినట్లు ఎస్సై చెప్పారు.
వివాహిత ఆత్మహత్య
నందిపేట, వెలుగు: మండలంలోని జిజి నడ్కుడ గ్రామానికి చెందిన గొట్టిముక్కుల మనీషా (30) అనే వివాహిత కుటుంబ కలహాలతో ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై శ్రీకాంత్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. మనీషా భర్తతో గొడవల కారణంగా నాలుగేళ్ల కింద ఆరేళ్ల కొడుకుతో తల్లిగారి ఊరైన నడ్కుడ గ్రామానికి వచ్చింది. ఈ క్రమంలో మనస్తాపానికి గురైన ఆమె మంగళవారం రాత్రి తల్లి బయటకు వెళ్లిన సమయంలో ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి తల్లి రుక్మవ్వ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చెప్పారు.