మహబూబ్‌నగర్, వెలుగు :మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో బీజేపీ రాష్ర్ట కార్యవర్గ సమావేశాల సందర్భంగా రెండు రోజులుగా సందడి నెలకొంది. ఉమ్మడి జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో పార్టీ కార్యకర్తలు తరలి వచ్చారు. తమ అభిమాన లీడర్లను చూసేందుకు పోటీ పడ్డారు.మంగళవారం పట్టణమంతా కాషాయమయమైంది. బైపాస్, భూత్పూర్ రోడ్డు, మహబూబ్‌నగర్-జడ్చర్ల మెయిన్ రోడ్డు, ప్రధాన కూడళ్లు బీజేపీ జెండాలతో నిండిపోయాయి. ఎక్కడికక్కడ లీడర్ల ఫెక్సీలు కనిపించాయి. సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ రాజకీయ ముసాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దీనిపై మాజీ ఎంపీలు, జాతీయ కార్యవర్గ సభ్యులు జితేందర్ రెడ్డి, జి.వివేక్ వెంకటస్వామి, ఉపాధ్యక్షుడు యెన్నం శ్రీనివాసరెడ్డి మద్దతు తెలిపారు. వ్యవసాయ రంగంపై 'తెలంగాణ రైతు గోస'పై రూపొందించిన ముసాయిదా తీర్మానాన్ని పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మనోహర్ రెడ్డి ప్రవేశపెట్టగా పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ మద్దతిస్తూ ప్రసంగించారు.
ఎల్లేని సుధాకర్‌పై ప్రశంసలు
కొల్లాపూర్ నియోజకవర్గానికి చెందిన బీజేపీ లీడర్ ఎల్లేని సుధాకర్‌ను బండి సంజయ్ ప్రశంసించారు. ఆయన ఇటీవల నియోజకవర్గంలో చేపట్టిన పాదయాత్ర గ్రాండ్ సక్సెస్ అయ్యిందని గుర్తు చేశారు. పార్టీ పిలుపు ఇవ్వకపోయినా.. సొంతంగా పాదయాత్ర నిర్వహించి ప్రజల సమస్యలు తెలుసుకున్నారని అన్నారు. పాదయాత్ర ముగింపు సభకు తాను చీఫ్ గెస్ట్‌గా వెళ్లానని, అక్కడికి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలిరావడం చూసి ఆనందమేసిందని సంజయ్ అన్నారు.
అగ్రనాయకులతో సెల్ఫీలు..
సమావేశాలకు వచ్చిన బీజేపీ అగ్రనాయకులను కలిసేందుకు పార్టీ శ్రేణులు ఉత్సాహం చూపారు. సమావేశంలో ఉమ్మడి జిల్లా నాయకులు టి.ఆచారి, దిలీపాచారి, వీరబ్రహ్మచారి, నాగూరావు నామాజి, పద్మాజారెడ్డి, భరత్‌గౌడ్, పడాకుల బాలరాజు, నారాయణరెడ్డి, పగిడ్యాల శ్రీనివాసులు, కొండయ్య, జలందర్‌రెడ్డి, డోకూరు పవన్‌కుమార్ రెడ్డి, ఎన్పీ వెంకటేశ్, రతంగ్ పాండురెడ్డి, బాలా త్రిపుర సుందరి, ఎగ్గని నర్సింహులు, శ్రీనివాస్‌రెడ్డి, అంజయ్య, కృష్ణవర్ధన్‌రెడ్డి, పాండురంగారెడ్డి, సురేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
లంచ్ హవర్లో ఉద్రిక్తత
బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరుగుతుండగా, అదే టైంలో ఎమ్మార్పీఎస్ నాయకులు ఎస్సీ వర్గీకరణకు మద్దతు తెలపాలంటూ మధ్యాహ్నం రెండు గంటలకు సమావేశం జరుగుతున్న ప్రాంతంలో ధర్నాకు దిగారు. నాయకులు పెద్ద ఎత్తున చేరి నినాదాలు చేశారు. సమావేశాలను అడ్డుకునేందుకు ఫంక్షన్ హాల్ వద్దకు వస్తుండగా, వీరిని పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో అక్కడే ఉన్న బీజేపీ లీడర్లు కొందరు రాళ్లు విసిరారు. దీంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆందోళనకారులను చెదరగొడుతున్న ఓ ఎస్ఐతో పాటు కానిస్టేబుల్‌కు గాయాలయ్యాయి. అనంతరం ఆందోళనకారులను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు.