- రాబోయే ఎన్నికలపై కార్యాచరణకు ప్లాన్
- నియోజకవర్గాల వారీగా పార్టీ బలాలు, బలహీనతలపై చర్చ
మహబూబ్‌నగర్, వెలుగు: దక్షిణ తెలంగాణ జిల్లాల్లో పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా బీజేపీ హైకమాండ్ సోమ, మంగళవారాల్లో మహబూబ్‌నగర్‌లో రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు జరుపుతోంది. పార్టీ స్టేట్ ప్రెసిడెంట్బండి సంజయ్, రాష్ట్ర సంస్థాగత వ్యవహారాల ఇన్చార్జి సునీల్ బన్సల్ సహా ఇతర పార్టీ ప్రముఖులు ఈ సమావేశాలకు హాజరుకానున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి, అధికారంలోకి రావాలని ఆశిస్తున్న బీజేపీ నేతలు, దక్షిణ తెలంగాణలో అనుసరించాల్సిన వ్యూహాలపై పాలమూరు వేదికగా యాక్షన్ ప్లాన్ రూపొందించనున్నట్లు తెలుస్తోంది. రాబోయే పార్లమెంట్ఎన్నికల్లో మహబూబ్నగర్నియోజకవర్గం నుంచి ప్రధానమంత్రి మోడీ పోటీ చేస్తారనే చర్చ జరుగుతున్న తరుణంలో జరుగుతున్న ఈ మీటింగ్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొన్నది.
ఇన్చార్జీల పనితీరుపై ఆరా.. ఎన్నికల కార్యాచరణ..
బీజేపీ గత డిసెంబర్లో రాష్ట్రంలోని119 నియోజకవర్గాలకు పాలక్‌లను, ఆ తర్వాత 17 లోక్‌సభ స్థానాలకు 46 మంది కన్వీనర్లు, జాయింట్ కన్వీనర్లు, 17 మంది ప్రభారీలను నియమించిన సంగతి తెలిసిందే. ఆయా నియోజకవర్గాల్లో పార్టీ బలోపేతం కోసం తమకు అప్పగించిన బాధ్యతలను పాలక్‌లు, కన్వీనర్లు, ప్రభారీలు నెరవేరుస్తున్నారో, లేదో తాజా కార్యవర్గ సమావేశాల్లో రివ్యూ చేయనున్నట్లు తెలిసింది. ఆయా నియోజకవర్గాల్లో పార్టీ బలాలు, బలహీనతలను చర్చించడంతో పాటు ఇన్చార్జీల నియామకం తర్వాత బూత్‌స్థాయిలో పార్టీ బలోపేతానికి ఎలాంటి చర్యలు తీసుకున్నారో చర్చించి, తగిన సలహాలు, సూచనలు జారీ చేసే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. బీజేపీ ఉత్తర తెలంగాణలో పటిష్టంగానే ఉన్నప్పటికీ దక్షిణ తెలంగాణలో అనుకున్నంత ఊపు ఇప్పటికీ రాలేదని భావిస్తున్న హైకమాండ్, పాలమూరు వేదికగా రెండు రోజులపాటు జరిగే సమావేశాల్లో ప్రత్యేక కార్యాచరణ రూపొందించనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా కేంద్రంలోని బీజేపీ సర్కారు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి మరింతగా తీసుకెళ్లడం, కేంద్రం ఫండ్స్ ఇవ్వడం లేదని, రాష్ట్ర అభివృద్ధికి సహకరించడం లేదంటూ బీఆర్ఎస్ నేతలు చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టడం ప్రధాన ఎజెండాగా ఉంటుందనే చర్చ జరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం తన ఘనతగా చెప్పుకుంటున్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, పల్లె ప్రకృతి వనాలు, రైతు వేదికలు, శ్మశాన వాటికలు, క్రీడా మైదానాలు, జాతీయ రహదారులన్నీ కేంద్రం ఫండ్స్‌తో చేపట్టారనే విషయాన్ని ప్రజలకు వివరించేలా కార్యాచరణ ప్రణాళిక ఉంటుందని చెప్తున్నారు. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల కృష్ణా జలాల వినియోగంలో ఉమ్మడి మహబూబ్‌నగర్, నల్గొండ సహా దక్షిణ తెలంగాణ జిల్లాలకు జరుగుతున్న అన్యాయాన్ని ఎండగట్టాలని భావిస్తున్నారు. అదే సమయంలో బీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు అవినీతి, అక్రమాలు, అభివృద్ధి పనుల్లో కమీషన్లు, ల్యాండ్, ఇసుక, గ్రానైట్ మాఫియా ద్వారా కోట్లకు పడగెత్తిన విషయాన్ని జనాల్లోకి తీసుకెళ్లడం ద్వారా ఆ పార్టీని నైతికంగా దెబ్బకొట్టాలని భావిస్తున్నట్లు పాలమూరుకు చెందిన ఓ సీనియర్ లీడర్ చెప్పారు.
ప్రధాని మోడీ పోటీపై చర్చ..
వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రధాని మోడీ పాలమూరు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారనే చర్చ జరుగుతోంది. మహబూబ్‌నగర్ నుంచి పోటీచేయడం ద్వారా సౌత్ ఇండియాలో తమ పార్టీకి ఊపు తేవాలన్నది బీజేపీ హైకమాండ్ ఆలోచనగా చెప్తున్నారు. ఇటీవల తాను ప్రధానిని కలిసి మహబూబ్‌నగర్ నుంచి పోటీచేయాలని కోరినట్లు ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు జితేందర్‌రెడ్డి ఇటీవల చెప్పారు. ఇదే విషయమై పార్టీ జాతీయ అధ్యక్షుడు జెపీ నడ్డాతో కూడా చర్చించినట్లు తెలిపారు. పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ కూడా ఈ విషయాన్ని ట్వీట్ చేశారు. ఈ క్రమంలో నేటి నుంచి రెండు రోజులపాటు పాలమూరులో జరగనున్న కార్యవర్గ సమావేశాల్లో ఈ అంశం చర్చకు వచ్చే అవకాశం ఉండడంతో అందరిలోనూ ఆసక్తి నెలకొన్నది.
హాజరుకానున్న ప్రముఖులు
మంగళవారం పాలమూరులోని అన్నపూర్ణ గార్డెన్స్లో నిర్వహించే రాష్ర్ట కార్యవర్గ సమావేశానికి బీజేపీ జాతీయ, రాష్ర్ట నాయకులు చీఫ్ గెస్టులుగా హాజరువుతున్నారు. సమావేశానికి రాష్ర్ట వ్యవహారాల ఇన్చార్జి తరుణ్ చుగ్, జాతీయ ప్రధాన కార్యదర్శి తెలంగాణ రాష్ర్ట ఇన్చార్జి సునీల్ బన్సల్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, జాతీయ కార్యవర్గ సభ్యులు జితేందర్ రెడ్డి, వివేక్ వెంకటస్వామి, హుజూరాబాద్, దుబ్బాక ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, రఘునందన్రావు, ఆయా జిల్లాల పార్టీ అధ్యక్షులు, ఇతర ప్రముఖులు హాజరుకానున్నారు.